MLA Srikantha reddy
-
చంద్రబాబుది నియంత పాలన
– ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి రాయచోటి : టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా నియంత పాలనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన తన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పింఛన్లు, పక్కాగృహాలు, ఇన్‌పుట్‌సబ్సిడీ వంటివి తమ కనుసైగల్లోనే జరగాలని, ఎటువంటి రాజ్యాంగ పదవులలో లేనివారు ఆదేశాలు ఇస్తుండడం, దానిని అధికారులు పాటించడం దుర్మార్గమైన చర్య అన్నారు. 2004–2009లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో పేదలందరికీ మంచి చేయాలన్న తలంపుతో రాయచోటి పరిధిలోనే 30 నుంచి 40 వేల పింఛన్లు, అదేతరహాలో పక్కాగృహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం పింఛన్లు మంజూరు నియోజకవర్గ టీడీపీ నాయకుల చేతుల్లోకిపోయాయన్నారు. ఐఏఎస్‌లు అంటే ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేదని నేడు కొంత మంది పార్టీల కండువాలు వేసుకుని పనిచేసే స్ధాయికి దిగజారడం బాధకరమన్నారు. పెద్దనోట్ల రద్దు జరిగి 50 రోజులు అవుతున్నా నగదు కష్టాలు తీరలేదు. బ్యాంక్‌ల రోజు రోజుకు కష్టాలు పెరుగుతునే ఉన్నాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే పార్టీ సభ్యత్వం తీసుకోవాలన్న ఆదేశాలను టీడీపీ నాయకులు ఇస్తుండడం బాధకరమన్నారు. ఇటువంటి దృష్టపాలనను తిరిగి రానీయకుండా ప్రజలందరూ అప్రమత్తం కావాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే స్వామినాధన్ కమిషన్ చెప్పిన విధంగా ప్రతి రైతుకు పెన్షన్ ఇచ్చే పథకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలిస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ దుష్టపాలనకు నిరసనగా, పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండబోతున్నామని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. -
వైభవం.. శ్రీనివాసుని కల్యాణం
రాయచోటి : శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం స్థానిక బాలికోన్నత పాఠశాల మైదానంలో కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తుల గోవిందనామస్మరణతో ప్రాంగణం మారుమోగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. తిరుమల నుంచి తీసుకొచ్చిన శ్రీదేవి, భూదేవి సమేతుడైన వెంకటేశ్వరస్వామి విగ్రహాలకు టీటీడీ వేద పండితులు శాస్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణమహోత్సవంలో టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ దంపతులతో పాటు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. న్యాయమూర్తి తిరుమలరావు, తహసీల్దార్ గుణభూషణ్‌రెడ్డి, ప్రముఖ వైద్యులు బయారెడ్డి, సంగమ్మ, మాజీ ఎన్జీఓ నేత వెంకటరెడ్డి, రాజు విద్యాసంస్ధల వ్యవస్ధాపకులు సుబ్బరాజు, విఆర్ విద్యా సంస్ధల డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.