మీరైతే అరగంటైనా ఉండగలరా!
వసతిగృహాల్లో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఎస్వీ ఆగ్రహం
కర్నూలు(జిల్లా పరిషత్): ‘ఒకసారి ఇలా చూడండి.. ఎంత అపరిశుభ్రంగా ఉందో. డ్రైనేజీ పూడుకుపోయింది. మురికినీరు బయటకొచ్చి దుర్గంధం వ్యాపిస్తోంది. ఎక్కడ చూసినా ఈగలు, దోమలే. ఇలాంటి వాతావరణంలో పిల్లలు ఎలా ఉండగలరు. అన్నం తినడం సాధ్యమేనా. గుండెపై చేయి వేసుకుని చెప్పండి.. మీరైతే కనీసం అరగంటైనా ఉండగలరా? మీ ఇళ్లలో ఇలాగే ఉంటే సహిస్తారా.’ అంటూ వసతి గృహాల వార్డెన్లపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సమీపంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు, బెగ్గర్హోంలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అక్కడి దుస్థితికి చలించిపోయారు. వసతిగృహాల్లో పారిశుద్ధ్యం బాధ్యత మీదేనని మున్సిపల్ ఇంజనీర్ రాజశేఖర్ వార్డెన్లకు సూచించారు. అందుకు వారు స్పందిస్తూ సిబ్బంది ఆ పని తమది కాదంటున్నారని.. గతంలో ఒకరిని కలెక్టర్ బంగ్లాలో పని చేసేందుకు పంపారని తెలిపారు. రెండు రోజులుగా బోరు పని చేయడం లేదని.. కనీసం మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు కూడా నీళ్లు లేవని వార్డెన్లు ఎమ్మెల్యేకు సమస్యను వివరించారు. నీటి సమస్య పరిష్కారానికి ట్యాంకు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట వసతిగృహాల వార్డెన్లు విక్టోరియా రాణి, పద్మకుమారి, ఆశాలత ఉన్నారు.