MLA SVSN Varma
-
నియంత్రణా? నియంతృత్వమా?
పిఠాపురం : అది సెంట్రల్ జైలూ కాదు, మరో రకంగా నిషేధిత ప్రాంతమూ కాదు. అత్యంత ప్రముఖులు ఉండే హై సెక్యూరిటీ జోన్ కాదు, రక్షణ రహస్యాలేవో పదిలపరిచిన చోటూ కాదు. నిత్యం పట్టణ ప్రజలు అనేక పనుల నిమిత్తం వచ్చిపోయే కార్యాలయం. అయితే.. ఎక్కడా లేనట్టు ఆ కార్యాలయంలో ప్రజలు ప్రవేశించడానికి నిషేధాజ్ఞలు విధించారు. ప్రజలు ఏ పని నిమిత్తమైనా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య మాత్రమే తప్ప ఆ కార్యాలయానికి వెళ్లాలి. ఉదయం అటువైపు వెళ్లనే వెళ్లరాదు. ప్రజలతో పాటు పురపాలక సభ్యులకు సైతం ఈ సమయపాలన తప్పదు. ఈ వేళల్ని ఉల్లంఘించకుండా కార్యాలయం గేటు మూసివేసి నిరంతరం సెక్యూరిటీ గార్డుల కాపలా ఏర్పాటు చేసారు. నిర్ణీత సమయం(3 నుంచి 5 మధ్య)లో లోపల అడుగు పెట్టాలన్నా గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బందికి ఏపని మీద, ఎవరి కోసం వచ్చారు చెప్పి తీరాలి. ఏ సమయంలో లోపలకు అడుగుపెట్టారు, తిరిగి ఎప్పుడు బయటకు వెళ్లారు అనే వివరాలను కచ్చితంగా ఇచ్చి తీరాలి. నూతన సంవత్సర కానుకగా ఈ కఠిన నిబంధనలను జనవరి ఒకటి నుంచి అమలు చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయ సిబ్బందితో ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఇటీవల సమీక్ష నిర్వహించగా దళారుల బెడద ఎక్కువగా ఉందని కొందరు అధికారులు చెప్పారని, దానిని నివారించడానికి ఆయన ఆదేశంతోనే ఈ నిబంధనలను అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే నిత్యం అనేక పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ‘ఫీల్డ్ వర్క్’ అంటూ మధ్యాహ్నం మూడు దాటితే సిబ్బందిలో అనేక మంది కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోతుంటారని, అలాంటి సమయంలో ఏ అధికారిని కలిసి ఏపని చేయించుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని నిబంధనలను ఇక్కడ విధించడమేమిటని దుయ్యబడుతున్నారు. సుమారు 70 వేల మంది ఉన్న పిఠాపురం ప్రజల సేవకు కేవలం రెండుగంటల వ్యవధి మాత్రమే ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కమిషనర్ లాంటి ఉన్నతాధికారిని కలవడానికి సమయాల్ని నిర్దేశిస్తే అర్థముంటుంది తప్ప ఏ పని చేయించుకోవాలన్నా ఇలా పరిమిత సమయం ఇవ్వడమేమిటని ధ్వజమెత్తుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న తమకు కూడా ఈ వేళల్ని విధించడం పట్ల పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వర్మా.. చరిత్ర హీనుడిగా మిగిలిపోతావ్
పిఠాపురం :వాకతిప్ప బాణసంచా తయారీ కేంద్ర ప్రమాద బాధితులకు ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఏమీ చేయలేదని విమర్శలు చేస్తున్న పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చరిత్ర హీనుడిగా మిగిలిపోక తప్పదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. శనివారం ఆయన ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే వర్మతీరుపై మండిపడ్డారు. పదవి రాక ముందు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా బాధితులకు వేలాది రూపాయలు పంపిణీ చేసి, పదవి రాగానే బాధితులకు పైసా విదల్చకపోవడంలో మర్మ మేమిటో వర్మకే తెలియాలని ఆయన దుయ్యబట్టారు. పదవి కోసం ప్రజలను ఆకట్టుకునేందుకు బాధితులను ఓదార్చినట్టు నటించిన సంగతి తేటతెల్లమైందన్నారు. ప్రతిపక్షనేత ఎందుకు వస్తారో, ఏం చేస్తారో తెలియని అమాయక స్థితిలో ఉండి వర్మ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రజలు చూస్తు ఊరుకోరన్నారు. జగన్మోహన్రెడ్డి రాగానే బాధితులు ప్రభుత్వ నిర్వాకాన్ని ఎక్కడ బయటపెడతారోనన్న భయంతో వారిని లోపలపెట్టి గేట్లు వేయించిన నీచ రాజకీయ నేతగా వర్మ చరిత్రలో నిలిచి పోతారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన పలు ప్రమాదాల్లో బాధితులకు రూ.5 లక్షలు పరిహారం ఇచ్చారని, ఇక్కడ మాత్రం కేవలం రూ.2 లక్షలకే ప్రకటించడం తగదన్నారు. ప్రజాగ్రహంతో దిగివచ్చి మళ్లీ దానిని రూ.3 లక్షలకు పెంచడం పాలకుల చేతగానితనానికి నిదర్శనంగా నెహ్రూ అభివర్ణించారు. సొంతంగా ఒక్క రూపాయి కూడా విదల్చని వర్మ జగన్మోహన్రెడ్డిని విమర్శించేందుకు సాహసించడం విడ్డూరంగా ఉందన్నారు. దహన సంస్కారాలకు ఇచ్చిన రూ.5 వేలు కూడా తమ సొంత సొమ్ము ఇచ్చినట్టు వర్మ చెప్పుకోవడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ పెండెం దొరబాబు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రావు చిన్నారావు మాట్లాడుతూ జరిగిన సంఘటనకు చలించిన జగన్మోహన్రెడ్డి బాధితులను పరామర్శించి, అన్ని ప్రాంతాలు పూర్తిగా పరిశీలించి వారికి ఆసరాగా నిలబడతానని మాట ఇచ్చారన్నారు. దానిని నిలబెట్టుకునేందుకు బాధితులకు ఒక్కొక్కరికి రూ.50వేలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, వాటిని పంపిణీ కూడా చేశామని తెలిపారు.