పిఠాపురం : అది సెంట్రల్ జైలూ కాదు, మరో రకంగా నిషేధిత ప్రాంతమూ కాదు. అత్యంత ప్రముఖులు ఉండే హై సెక్యూరిటీ జోన్ కాదు, రక్షణ రహస్యాలేవో పదిలపరిచిన చోటూ కాదు. నిత్యం పట్టణ ప్రజలు అనేక పనుల నిమిత్తం వచ్చిపోయే కార్యాలయం. అయితే.. ఎక్కడా లేనట్టు ఆ కార్యాలయంలో ప్రజలు ప్రవేశించడానికి నిషేధాజ్ఞలు విధించారు. ప్రజలు ఏ పని నిమిత్తమైనా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య మాత్రమే తప్ప ఆ కార్యాలయానికి వెళ్లాలి.
ఉదయం అటువైపు వెళ్లనే వెళ్లరాదు. ప్రజలతో పాటు పురపాలక సభ్యులకు సైతం ఈ సమయపాలన తప్పదు. ఈ వేళల్ని ఉల్లంఘించకుండా కార్యాలయం గేటు మూసివేసి నిరంతరం సెక్యూరిటీ గార్డుల కాపలా ఏర్పాటు చేసారు. నిర్ణీత సమయం(3 నుంచి 5 మధ్య)లో లోపల అడుగు పెట్టాలన్నా గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బందికి ఏపని మీద, ఎవరి కోసం వచ్చారు చెప్పి తీరాలి. ఏ సమయంలో లోపలకు అడుగుపెట్టారు, తిరిగి ఎప్పుడు బయటకు వెళ్లారు అనే వివరాలను కచ్చితంగా ఇచ్చి తీరాలి. నూతన సంవత్సర కానుకగా ఈ కఠిన నిబంధనలను జనవరి ఒకటి నుంచి అమలు చేస్తున్నారు.
మున్సిపల్ కార్యాలయ సిబ్బందితో ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఇటీవల సమీక్ష నిర్వహించగా దళారుల బెడద ఎక్కువగా ఉందని కొందరు అధికారులు చెప్పారని, దానిని నివారించడానికి ఆయన ఆదేశంతోనే ఈ నిబంధనలను అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే నిత్యం అనేక పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.
‘ఫీల్డ్ వర్క్’ అంటూ మధ్యాహ్నం మూడు దాటితే సిబ్బందిలో అనేక మంది కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోతుంటారని, అలాంటి సమయంలో ఏ అధికారిని కలిసి ఏపని చేయించుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని నిబంధనలను ఇక్కడ విధించడమేమిటని దుయ్యబడుతున్నారు.
సుమారు 70 వేల మంది ఉన్న పిఠాపురం ప్రజల సేవకు కేవలం రెండుగంటల వ్యవధి మాత్రమే ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కమిషనర్ లాంటి ఉన్నతాధికారిని కలవడానికి సమయాల్ని నిర్దేశిస్తే అర్థముంటుంది తప్ప ఏ పని చేయించుకోవాలన్నా ఇలా పరిమిత సమయం ఇవ్వడమేమిటని ధ్వజమెత్తుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న తమకు కూడా ఈ వేళల్ని విధించడం పట్ల పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నియంత్రణా? నియంతృత్వమా?
Published Sat, Jan 3 2015 2:43 AM | Last Updated on Sat, Sep 15 2018 8:43 PM
Advertisement
Advertisement