Field Work
-
ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థ రద్దు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద చేపట్టే కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించే క్షేత్ర సహాయకు (ఫీల్డ్ అసిస్టెంట్–ఎఫ్ఏ)ల వ్యవస్థకు మంగళం పాడింది. వీరి స్థానంలో పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించింది. ఇకపై ఉపాధి హామీ పథకం అమలు, నిర్వహణ, నివేదికల సమర్పణ ప్రక్రియంతా వీరి ఆధ్వర్యంలోనే సాగనుంది. ఉపాధిహామీ పథకం మొద లైనప్పటి నుంచి దాని అమలు తీరులో ఫీల్డ్ అసిస్టెంట్లదే కీలకపాత్ర. దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమను శాశ్వత ప్రాతిపదికన నియమించి వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో దాదాపు 7,700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు గతంలో సమ్మె చేపట్టారు. దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ సమ్మెకు అప్పట్లో ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరగడంతో సమ్మె నిలిచింది. అదే సమయంలో వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పట్నుంచి దాదాపు నాలుగు నెలలుగా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యతలను పూర్తిగా పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణనివ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ల కథ ముగిసినట్లేనని స్పష్టమవుతోంది. ఆగస్టు 15కల్లా శిక్షణ పూర్తి ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచేందుకు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణనిచ్చేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మండలాల వారీగా శిక్షణనిచ్చే తేదీలు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేసింది. ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్లకు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లకు ముందుగా జిల్లా స్థాయిలో శిక్షణ ఇస్తారు. అనంతరం మండల స్థాయిలో శిక్షణ ఇచ్చేలా తేదీలు ఖరారు చేయాలని సూచించింది. మొత్తం గా ఆగస్టు 15కల్లా రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు పూర్తవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టంచేసింది. దీంతో జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు కార్యాచరణ రూపొందించి రాష్ట్ర అధికా రులకు నివేదికలు పంపేందుకు చర్యలు చేపట్టారు. రెండు దశల్లో శిక్షణ కార్యక్రమాలుంటాయి. తొలుత జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏపీఓలు, ఈసీలకు శిక్షణ ఆ తర్వాత మండల స్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నివేదికలు పంపిస్తున్నారు. -
వానాకాలం.. జరభద్రం!
సాక్షి, పాలమూరు : పొద్దు పొడిచింది మొదలు చిమ్మచీకటి పడే వరకు పొలం పనుల్లో తలమునకలయ్యే రైతన్న జీవితం నిత్యం ప్రమాదాలమయం. రైతులు సాగు చేసిన పంటను నిత్యం చేలల్లో తిరుగుతూ పరిశీలించాల్సి ఉంటుంది. అందుకోసం పొలం గట్లపై తిరుగుతుంటారు. అలాంటప్పుడు పాములు, తేళ్లవంటి విష పురుగులతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఎదురవుతాయి. వరిలో, ఇతర పంటలలో కలుపు తీసే సందర్భాల్లోనూ విష సర్పాలు కాటువేసి చనిపోయిన ఘటనలు అనేకం. ఏవైపు నుంచి.. ఏ రూపంలో ఎప్పుడు ఎలా ప్రమాదం వచ్చి పడుతుందో తెలియదు. ఉదయం పనులకు వెళ్లిన వ్యక్తి సాయంత్రం ఇంటికి చేరే వరకు భయమే. అలాంటి రైతన్నకు వర్షాకాలం మరింత క్లిష్టమైనదని చెప్పవచ్చు. ఈ క్రమంలో రైతులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ప్రమాదం జరిగితే.. పాముకాటు ప్రమాదాలు సంభవించినప్పుడు అది ఏ పామో గుర్తించాలి. ఒకటి, రెండు కాట్లు ఉంటే విషపూరితమైంది. అంతకంటే ఎక్కువ కాట్లతో కనిపించే గాయం ఉంటే విషపూరితం కానిది. విషపూరితమైన పాము అయితే వెంటనే ఫోన్ ద్వారా సమాచారం అందించాలి. ఉన్నచోట నుంచి పరుగెత్తకూడదు. ఎవరైనా వచ్చే వరకు ఓపిగ్గా ఉండాలి. తినడం, తాగడం లాంటివి చేయకూడదు. కాటు వేసిన భాగాన్ని కదిలించకుండా ఉంచాలి. సహాయకులు వచ్చిన తర్వాత కాటేసిన భాగాన్ని పరిశుభ్రమైన నీరు, సెలైన్ వాటర్‌తో పంపులాంటి ధారలా పైనుంచి గాయం పడినచోట పోయాలి. దాని వల్ల గాయం వద్ద ఉన్న రక్తం, విషపు చుక్కలు కారిపోతాయి. ఆ వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. ఈ జాగ్రత్తలు పాటించాలి.. ► పాము కాటేసిన చోట తాడుతో లేక ఇతర గుడ్డముక్కలతోనైనా కట్టాలి. ఆ వెంటనే చికిత్సకు తరలించాలి. ►పాము కాటేస్తే మూఢనమ్మకాలను నమ్మి మంత్రం వేసిన నీళ్లు తాగడమో.. భూమిలో కాలుపెట్టి చికిత్స తీసుకోవడం లాంటివి చాలాచోట్ల చేస్తుంటారు. ►మూఢనమ్మకాలకు దూరం ఉండి తక్షణమే ఆస్పత్రికి వెళ్లాలి. ►పొలానికి వెళ్లిన సమయంలో చెట్ల పొదల్లో అడుగు పెట్టేది ఉంటే కాళ్లకు పెద్ద సైజులో ఉండే నల్లని బూట్లు ధరించాలి. ►పొదల్లో పనిచేసే సమయంలో చేతులకు గ్లౌజులు ధరించడం మంచిది. పిల్లలను పొదలు ఎక్కువగా ఉన్నచోట ఆడుకోవడానికి పంపించరాదు. ► పల్లెల్లో ఇళ్ల పరిసరాలు చుట్టూ చెట్ల పొదలు ఎక్కువగా ఉండనివ్వకుండా చూసుకోవాలి. పొలాల్లోనే అధికం.. పొలాల్లో ప్రధానంగా తాచుపాము, రక్తపింజర, కట్లపాము, చిన్న రక్తపింజర సంచారం ఉంటుంది. ఎలుక కన్నాల్లో, పందికొక్కుల బొరియల్లో, చెదల పుట్టల్లో నివాసాలు ఏర్పాటు చేసుంటాయి. అక్కడే గుడ్డు పెట్టడమే కాకుండా పిల్లలను ప్రసవిస్తాయి. నాగుపాము, కట్ల, రక్తపింజరం వంటి కొన్ని రకాల పాములు మాత్రమే ప్రమాదకరం. -
నియంత్రణా? నియంతృత్వమా?
పిఠాపురం : అది సెంట్రల్ జైలూ కాదు, మరో రకంగా నిషేధిత ప్రాంతమూ కాదు. అత్యంత ప్రముఖులు ఉండే హై సెక్యూరిటీ జోన్ కాదు, రక్షణ రహస్యాలేవో పదిలపరిచిన చోటూ కాదు. నిత్యం పట్టణ ప్రజలు అనేక పనుల నిమిత్తం వచ్చిపోయే కార్యాలయం. అయితే.. ఎక్కడా లేనట్టు ఆ కార్యాలయంలో ప్రజలు ప్రవేశించడానికి నిషేధాజ్ఞలు విధించారు. ప్రజలు ఏ పని నిమిత్తమైనా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య మాత్రమే తప్ప ఆ కార్యాలయానికి వెళ్లాలి. ఉదయం అటువైపు వెళ్లనే వెళ్లరాదు. ప్రజలతో పాటు పురపాలక సభ్యులకు సైతం ఈ సమయపాలన తప్పదు. ఈ వేళల్ని ఉల్లంఘించకుండా కార్యాలయం గేటు మూసివేసి నిరంతరం సెక్యూరిటీ గార్డుల కాపలా ఏర్పాటు చేసారు. నిర్ణీత సమయం(3 నుంచి 5 మధ్య)లో లోపల అడుగు పెట్టాలన్నా గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బందికి ఏపని మీద, ఎవరి కోసం వచ్చారు చెప్పి తీరాలి. ఏ సమయంలో లోపలకు అడుగుపెట్టారు, తిరిగి ఎప్పుడు బయటకు వెళ్లారు అనే వివరాలను కచ్చితంగా ఇచ్చి తీరాలి. నూతన సంవత్సర కానుకగా ఈ కఠిన నిబంధనలను జనవరి ఒకటి నుంచి అమలు చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయ సిబ్బందితో ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఇటీవల సమీక్ష నిర్వహించగా దళారుల బెడద ఎక్కువగా ఉందని కొందరు అధికారులు చెప్పారని, దానిని నివారించడానికి ఆయన ఆదేశంతోనే ఈ నిబంధనలను అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే నిత్యం అనేక పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ‘ఫీల్డ్ వర్క్’ అంటూ మధ్యాహ్నం మూడు దాటితే సిబ్బందిలో అనేక మంది కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోతుంటారని, అలాంటి సమయంలో ఏ అధికారిని కలిసి ఏపని చేయించుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని నిబంధనలను ఇక్కడ విధించడమేమిటని దుయ్యబడుతున్నారు. సుమారు 70 వేల మంది ఉన్న పిఠాపురం ప్రజల సేవకు కేవలం రెండుగంటల వ్యవధి మాత్రమే ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కమిషనర్ లాంటి ఉన్నతాధికారిని కలవడానికి సమయాల్ని నిర్దేశిస్తే అర్థముంటుంది తప్ప ఏ పని చేయించుకోవాలన్నా ఇలా పరిమిత సమయం ఇవ్వడమేమిటని ధ్వజమెత్తుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న తమకు కూడా ఈ వేళల్ని విధించడం పట్ల పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.