సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద చేపట్టే కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించే క్షేత్ర సహాయకు (ఫీల్డ్ అసిస్టెంట్–ఎఫ్‌ఏ)ల వ్యవస్థకు మంగళం పాడింది. వీరి స్థానంలో పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించింది. ఇకపై ఉపాధి హామీ పథకం అమలు, నిర్వహణ, నివేదికల సమర్పణ ప్రక్రియంతా వీరి ఆధ్వర్యంలోనే సాగనుంది. ఉపాధిహామీ పథకం మొద లైనప్పటి నుంచి దాని అమలు తీరులో ఫీల్డ్ అసిస్టెంట్లదే కీలకపాత్ర. దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమను శాశ్వత ప్రాతిపదికన నియమించి వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో దాదాపు 7,700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు గతంలో సమ్మె చేపట్టారు.
దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ సమ్మెకు అప్పట్లో ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరగడంతో సమ్మె నిలిచింది. అదే సమయంలో వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పట్నుంచి దాదాపు నాలుగు నెలలుగా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యతలను పూర్తిగా పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణనివ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ల కథ ముగిసినట్లేనని స్పష్టమవుతోంది.
ఆగస్టు 15కల్లా శిక్షణ పూర్తి
ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచేందుకు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణనిచ్చేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మండలాల వారీగా శిక్షణనిచ్చే తేదీలు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేసింది. ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్లకు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లకు ముందుగా జిల్లా స్థాయిలో శిక్షణ ఇస్తారు. అనంతరం మండల స్థాయిలో శిక్షణ ఇచ్చేలా తేదీలు ఖరారు చేయాలని సూచించింది. మొత్తం గా ఆగస్టు 15కల్లా రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు పూర్తవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టంచేసింది. దీంతో జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు కార్యాచరణ రూపొందించి రాష్ట్ర అధికా రులకు నివేదికలు పంపేందుకు చర్యలు చేపట్టారు. రెండు దశల్లో శిక్షణ కార్యక్రమాలుంటాయి. తొలుత జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏపీఓలు, ఈసీలకు శిక్షణ ఆ తర్వాత మండల స్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నివేదికలు పంపిస్తున్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థ రద్దు
Published Thu, Jul 30 2020 4:45 AM | Last Updated on Thu, Jul 30 2020 4:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment