Employment Assurance Scheme
-
ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థ రద్దు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద చేపట్టే కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించే క్షేత్ర సహాయకు (ఫీల్డ్ అసిస్టెంట్–ఎఫ్ఏ)ల వ్యవస్థకు మంగళం పాడింది. వీరి స్థానంలో పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించింది. ఇకపై ఉపాధి హామీ పథకం అమలు, నిర్వహణ, నివేదికల సమర్పణ ప్రక్రియంతా వీరి ఆధ్వర్యంలోనే సాగనుంది. ఉపాధిహామీ పథకం మొద లైనప్పటి నుంచి దాని అమలు తీరులో ఫీల్డ్ అసిస్టెంట్లదే కీలకపాత్ర. దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమను శాశ్వత ప్రాతిపదికన నియమించి వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో దాదాపు 7,700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు గతంలో సమ్మె చేపట్టారు. దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ సమ్మెకు అప్పట్లో ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరగడంతో సమ్మె నిలిచింది. అదే సమయంలో వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పట్నుంచి దాదాపు నాలుగు నెలలుగా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యతలను పూర్తిగా పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణనివ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ల కథ ముగిసినట్లేనని స్పష్టమవుతోంది. ఆగస్టు 15కల్లా శిక్షణ పూర్తి ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచేందుకు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణనిచ్చేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మండలాల వారీగా శిక్షణనిచ్చే తేదీలు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేసింది. ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్లకు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లకు ముందుగా జిల్లా స్థాయిలో శిక్షణ ఇస్తారు. అనంతరం మండల స్థాయిలో శిక్షణ ఇచ్చేలా తేదీలు ఖరారు చేయాలని సూచించింది. మొత్తం గా ఆగస్టు 15కల్లా రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు పూర్తవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టంచేసింది. దీంతో జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు కార్యాచరణ రూపొందించి రాష్ట్ర అధికా రులకు నివేదికలు పంపేందుకు చర్యలు చేపట్టారు. రెండు దశల్లో శిక్షణ కార్యక్రమాలుంటాయి. తొలుత జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏపీఓలు, ఈసీలకు శిక్షణ ఆ తర్వాత మండల స్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నివేదికలు పంపిస్తున్నారు. -
ఒకే రోజు అరకోటి మందికి పని
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం మరో అత్యంత అరుదైన మైలురాయికి చేరుకుంది. సోమవారం (జూన్8) ఒక్క రోజే అరకోటి మందికి పైగా కూలీలకు పని కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 54,51,939 మంది కూలీలు ఉపాధి హామీ పథకం పనులకు హాజరయ్యారు. వ్యవసాయ పనుల్లేని పరిస్థితులు, కరోనా విపత్కర పరిస్థితులతో గ్రామీణ నిరుపేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా పనుల కల్పనపై దృష్టి పెట్టింది. లాక్డౌన్ కారణంగా తిరిగొచ్చిన వలస కూలీలకు వారి సొంత ఊర్లోనే పని కల్పించేలా తక్షణమే 1, 58, 400 జాబ్ కార్డ్‌లు మంజూరు చేసింది. ► తెలుగుదేశం ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం ద్వారా ఒక రోజు వ్యవధిలో గరిష్టంగా పని కల్పించిన కూలీల సంఖ్య 30 లక్షల్లోపేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ పథకం ద్వారా పనుల కల్పనకు డ్వామా పీడీలతో పాటు జెడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలను భాగస్వామ్యం చేశారు. రెండు నెలల్లోనే రూ.2,035 కోట్లు చెల్లింపు ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి 8.84 కోట్ల పనిదినాలు కల్పించి సోమవారం వరకు కూలీలకు రూ.2,035 కోట్ల వేతనాల రూపంలో చెల్లించారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్న వారిలో 82 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. లాక్‌డౌన్‌లోనూ ఒక్కో కుటుంబం రూ.20వేలకుపైగా ఆదాయం పొందింది. -
‘ఉపాధి’తో వారికి జీవనోపాధి
సాక్షి, అమరావతి: ప్రత్యేక పనిలో నైపుణ్యం ఉండి.. ఇప్పటి దాకా వేర్వేరు నగరాలు, పట్టణాల్లో ఉపాధి పొందుతూ, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో తిరిగి గ్రామాలకు వచ్చిన ప్రత్యేక కేటగిరీ వలస కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా జీవనోపాధిని కల్పించే కార్యక్రమాల అమలు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరింది. కరోనా నేపథ్యంలో వేలాది మంది కార్మికులు సొంత గ్రామాలకు తిరిగొచ్చారని, వారు మరింత కాలం గ్రామాల్లోనే ఉండాల్సి ఉంటుందని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం.. వివిధ వృత్తుల్లో పాక్షిక, పూర్తి స్థాయి నైపుణ్యం ఉన్న వారికి సంబంధిత పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేలా ఒక విధానం అమలు చేయాలని కోరింది. ఉపాధి హామీ పథకం ద్వారా ఎలాంటి కొత్త పనులకు అనుమతించాలన్న విషయంపై రెండు రోజుల క్రితం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ అన్ని రాష్టాల గ్రామీణాభివృద్ది శాఖ అదికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర అధికారులు ఈ ప్రతిపాదన చేశారు. పథకంలో ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రవేశపెట్టాల్సిన పనులపై రాష్ట్ర అధికారులు చేసిన ప్రతిపాదనలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఒక నివేదిక కూడా కేంద్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలివీ.. ► పది ఎకరాలున్న రైతుల పొలాల్లో కూడా ఉపాధి హామీ పథకంలో పండ్ల తోట పెంపకం, బీడు భూముల చదును వంటి పనులకు అనుమతించాలి. ప్రస్తుతం వ్యవసాయ, అనుబంధ పనుల్లో ఇప్పటి వరకు అయిదెకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకంలో అనుమతి ఉంది. కరువు మండలాలు, గిరిజన ప్రాంతాల్లోనైనా ఈ పరిధిని పది ఎకరాలకు పెంచాలి. ► వరుసగా రెండు మూడేళ్ల పాటు వంద పనిదినాలు ఉపాధి హామీ పథకంలో పని పొందిన కుటుంబాలకు అదనపు పని దినాలు కల్పించే విషయం పరిశీలించాలి. ఆ కుటుంబాలు ఉపాధి హామీ పథకంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయని పేర్కొంది. ► వేలాది రజక కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా దోభీ ఘాట్ల నిర్మాణాలకు అనుమతి తెలపాలి. ప్రతి దోభీ ఘాట్‌లో అవసరమైన వసతుల కల్పనకు అనుమతించాలి. ► గ్రామాల్లో ఎండిపోయిన బావుల్లో తిరిగి నీటి ఊట ఏర్పడేలా పూడికతీత పనులకు అనుమతివ్వాలి. ► రైతులు పండించిన కూరగాయలకు మంచి ధర వచ్చే వరకు తమ గ్రామంలోనే నిల్వ ఉంచుకునేలా చిన్న పాటి కోల్డు స్టోరేజీల నిర్మాణంతో పాటు గ్రామాల్లో హెల్త్ సబ్ సెంటర్లు, విలేజ్ అగ్రి క్లినిక్‌లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అనుమతించాలి. -
విపత్తులోనూ ఉపాధి
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి కమ్ముకొస్తున్న తరుణంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిరుపేద కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో ఉపాధిహామీ పథకం ద్వారా ఇప్పటివరకు 79 లక్షల పనిదినాలు కల్పించగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 25.57 లక్షల పనిదినాలు కల్పించడం గమనార్హం. అయితే వాస్తవంగా రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 20 వరకు కూలీలకు 36.50 లక్షల పనిదినాలు కల్పించామని, తాజా డేటా కేంద్ర వెబ్‌పోర్టల్‌లో అప్లోడ్ కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఏప్రిల్‌లో కల్పించిన పనిదినాల వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్‌పోర్టల్‌లో వెల్లడించింది. ► విపత్కర సమయంలో ఉపాధి హామీ ద్వారా గ్రామీణ నిరుపేద కూలీలకు పని కల్పన దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువగా ఉంది. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా కల్పించిన ఉపాధిహామీ పనిదినాల్లో మూడో వంతు మన రాష్ట్రంలోని కూలీలే లబ్ధి పొందారు. ► రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే పని కోరిన ప్రతి కూలీని వారి నివాసానికి సమీప ప్రాంతంలో ఉపాధిహామీ ద్వారా ఆదుకుంది. ► ఉపాధి హామీ పనుల కోసం వచ్చే కూలీల సంఖ్య రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతోంది. ► విపత్కర పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 18 వరకు 9,100 గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా కూలీలకు ప్రభుత్వం పనులు కల్పించింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 2,07,498 మంది కూలీలు 9.03 లక్షల పనిదినాల పాటు పని చేసి రూ.18.23 కోట్ల వేతనాలు పొందారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 65 వేల మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. 3,800 గ్రామాల్లో మాత్రం వివిధ కారణాలతో ఉపాధి హామీ పనులు మొదలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో భౌతిక దూరం పాటిస్తూ ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు కరోనా వైరస్ నియంత్రణ చర్యలు.. ► ఉపాధి పనులను తెల్లవారుజామున ప్రారంభించి మధ్యాహ్నం 11 గంటల లోపు ముగించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గ్రామీణాభివద్ధి శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. ► కూలీలు పని ప్రదేశానికి వాహనాలలో వెళ్లేటప్పుడు దూరంగా కూర్చోవాలని, వీలైనంత వరకు సైకిల్ లేదా ద్విచక్ర వాహనాలపై వెళ్లడం మంచిదంటున్నారు. ► పనికి ఉపయోగించే పనిముట్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకవద్దని, శుభ్రం చేసుకోకుండా ఆహారం తీసుకోవద్దని సూచిస్తున్నారు. ► ఒక కుటుంబానికి ఒకే చోట పని కల్పిస్తున్నారు. ► కూలీలు కనీసం మీటరు దూరంలో ఉంటూ పనులు చేసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. తువ్వాలు లేదా కర్చీఫ్‌తో ముఖాన్ని కప్పుకోవాలి. ► వేసవి కాలం కావడంతో కూలీలు రోజు వారీ చేయాల్సిన పనిలో 30 శాతం తక్కువ చేసినా ‘నరేగా’ నిబంధనల ప్రకారం పూర్తి వేతనం చెల్లిస్తున్నారు. ‘ఉపాధి’కి నిధుల కొరత లేదు ‘ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాలు చెల్లించేందుకు నిధుల కొరత లేదు. ఉపాధి హామీ వేతనాల కోసం 2020–21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం రూ.2149.78 కోట్లు మంజూరు చేసింది. 2019–2020 లో రూ. 211 గా ఉన్న దినసరి వేతనాన్ని 2020–21లో అదనంగా రూ.26 పెంచి రోజుకి రూ. 237 చొప్పున చెల్లిస్తాం’ – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి -
‘ఉపాధి’ నిధులు మింగేశారు
సాక్షి, శాంతిపురం(చిత్తూరు) : సామాజిక తనిఖీ సాక్షిగా అక్రమాల పుట్టలు పగిలాయి. టీడీపీ పాలనలో 2018–19 ఆర్థిక సంవత్సరం మండలంలో రూ. 11.13 కోట్లతో జరిగిన పనులపై నిర్వహించిన సోషల్ ఆడిట్లో రూ.70,16,313 రికవరీకి అధికారులు ఆదేశించారు. 15 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మండలంలో గత ఆర్థిక సంవత్సరం జరిగిన ఉపాధి హామీ పనులపై ఈనెల 30 నుంచి అధికారులు తనిఖీలు నిర్వహించారు. పంచాయతీల వారీగా పనులను పరిశీలించి, నివేదికలను సిద్ధం చేశారు. డ్వామా ఏపీడీ కిరణ్‌కుమార్ ప్రొసీడింగ్ అధికారిగా, జిల్లా ఉపాధి హామీ విజిలెన్స్ అధికారి శివయ్య సమక్షంలో గురువారం ఉదయం ప్రారంభమైన బహిరంగ వేదిక అర్ధరాత్రి వరకూ కొనసాగింది. మండలంలోని 23 పంచాయతీల్లో ఉపాధి హామీ శాఖ ద్వారా జరిగిన పనుల్లో గరిష్టంగా రూ.55,31,847, వెలుగు ద్వారా చేసిన పనుల్లో 3,97,456, పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేసిన వాటిలో 8,39,180, పశుసంవర్ధక శాఖ నుంచి రూ.5,000, హౌసింగ్ శాఖ నుంచి రూ.30,830 బాధ్యుల నుంచి రికవరీకి ఆదేశించారు. పొరబాట్లు చేసిన ఉపాధి సిబ్బందికి జరిమానాగా మరో రూ.2,17,000 విధించారు. గతంలో జరిగిన 12 విడతల సామాజిక తనిఖీల్లో ఎన్నడూ రూ.10 లక్షలకు మించి రికవరీ రాకపోగా ఇప్పుడు ఏకంగా రూ.70.16 లక్షల ఆక్రమాలను గుర్తించి ఆ మేరకు రికవరికీ ఆదేశించటం స్థానికంగా సంచలనమైంది. పంచాయతీల వారీగా రికవరీ 13వ విడత సామాజిక తనిఖీల్లో రూ.12,35, 038 రికవరీతో ఎంకేపురం పంచాయతీ అక్రమాల్లో అగ్రస్థానంలో నిలిచింది. కోనేరుకుప్పంలో నామమాత్రంగా రూ.18,305 మాత్రమే అక్రమాలను గుర్తించారు. దండికుప్పం పంచాయతీలో రూ.11,94,599, అనికెరలో రూ. 1,53,001, మొరసనపల్లిలో రూ.1,45,712, శివరామ పురంలో రూ.2,93, 992, కడపల్లిలో రూ. 1,13,941, సి.బండపల్లిలో రూ. 5,71,663, రేగడదిన్నేపల్లిలో రూ.5,85,748, సొన్నేగానిపల్లిలో రూ.8,77,796, కెనమాకులపల్లిలో రూ.42,128, నడింపల్లిలో రూ. 4,20,583, అబకలదొడ్డిలో రూ.1,17,809, చెంగుబళ్లలో రూ.72,998, మఠంలో రూ.1,25,841, చిన్నారిదొడ్డిలో రూ.1,72,635, 121పెద్దూరులో రూ. 38,346, తుమ్మిశిలో రూ.2,21,524, 64పెద్దూరులో రూ.32,553, కర్లగట్టలో రూ.2,13,948, కొలమడుగులో రూ.1,45, 506, గుంజార్లపల్లిలో రూ.41,581, రాళ్లబూదుగూరు పంచాయతీలో రూ.1,18,952 రికవరీకి డ్వామా పీడీ ఆదేశిం చారు. వారం రోజుల్లోపు రికవరీ కాని వాటిపై రెవెన్యూ రికవరీ యాక్టు కింద చర్యలకు ఆదేశిస్తామని హెచ్చరించారు. 15మంది అధికారులపై చర్యలు మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల అక్రమాలకు బాధ్యులుగా గుర్తించి మొత్తం 15 మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. పంచాయతీరాజ్ రిటైర్డ్ ఇంజినీర్ గోపాల్‌కు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ఆర్థిక లాభాలను నిలుపుదల చేశారు. టెక్నికల్ అసిస్టెంట్లు ధర్మలింగం, వెంకటేష్, సి.బండపల్లి సీనియర్ మేట్ గోవిందరాజును పూర్తిగా విధుల నుంచి తప్పించారు. అప్పటి ఏపీఓ హరినాథ్, టీఏలు రఘునాథ్, మునిరత్నంను సస్పెండ్ చేశారు. వీరితో పాటు ఫీల్డు అసిస్టెంట్లుగా ఉన్న పౌలారాణి(శివరామపురం), నాగరాజు(చిన్నారిదొడ్డి), శివానందం(రేగడదిన్నేపల్లి), సుబ్రమణ్యం(దండికుప్పం), మంజు నాథ్(ఎంకే పురం), వెంకటేశు(నడింపల్లి), సుబ్రమణ్యం(అబకలదొడ్డి), నాగరాజు(తుమ్మిశి)ను సస్పెండ్ చేశారు. గురువారం ఉదయం ప్రారంభమైన బహిరంగ వేదిక అర్ధరాత్రి వరకూ కొనసాగింది. 23 పంచా యతీల్లో ఉపాధి హామీ ద్వారా జరిగిన పనుల్లో గరిష్టంగా రూ.55,31,847, వెలుగు ద్వారా చేసిన పనుల్లో 3,97,456, పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేసిన వాటిలో 8,39,180, పశుసంవర్ధక శాఖ నుంచి రూ.5వేలు, హౌసింగ్ నుంచి రూ.30,830 బాధ్యుల నుంచి రికవరీకి ఆదేశించారు. పొరబాట్లు చేసిన ఉపాధి సిబ్బందికి జరిమానాగా రూ. 2,17,000 విధించారు. గతంలో జరిగిన 12 విడతల సామాజిక తనిఖీల్లో ఎన్నడూ రూ.10 లక్షలకు మించి రికవరీ రాలేదు. ఇప్పుడు రూ.70.16 లక్షలు రావడం స్థానికంగా సంచలనమైంది. -
స్వాహానే ఎజెండా!
ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ఈసీ, సీఎస్‌లపై ఒత్తిడి తెచ్చి మంత్రివర్గ సమావేశం నిర్వహించడం ద్వారా రూ.1,920 కోట్ల ఉపాధిహామీ పెండింగ్ బిల్లులను పార్టీ నేతలకు చెల్లించాలనేది సీఎం చంద్రబాబు ఎత్తుగడగా అధికారవర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఈనెల 14వ తేదీన నిర్వహించాలని భావిస్తున్న మంత్రివర్గ సమావేశం అజెండాలో ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లుల అంశం కూడా ఉండటం గమనార్హం. – సాక్షి, అమరావతి ఇవన్నీ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా అధికార పార్టీ నేతలు నామినేషన్ పద్ధతిలో సిద్ధం చేసుకున్న ఉపాధి హామీ పథకం బిల్లులు. టీడీపీ గ్రామ స్థాయి నేతలు గత అర్నెళ్లుగా రూ.1,920 కోట్ల విలువైన పనులు చేసినట్లు ఎన్నికల ముందు రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఉపాధి హామీ పనుల పేరుతో ఈనెల 14వ తేదీన నిర్వహించాలని భావిస్తున్న క్యాబినెట్ భేటీలో చర్చించి ఈ బిల్లులకు ఆమోదం తెలిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతుండటంతో ‘ఉపాధి’ డబ్బులను టీడీపీ నేతలకు వెదజల్లేందుకు అధికార పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. పెండింగ్‌లో భారీగా బిల్లులు ఉన్నా పనులు మాత్రం జరుగుతున్నాయి. కొత్త సర్పంచులు వస్తే బెడిసికొడుతుందనే.. ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్టర్ల వ్యవస్థకు తావుండదు. ఉపాధి హామీలో చేపట్టే ఏ పనికైనా ఆ గ్రామ పంచాయితీకే నిధులు చెల్లించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయితీనే ఏ అవసరానికి ఎంత ఖర్చు అయిందో లెక్కలు వేసి డబ్బులు చెల్లిస్తోంది. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల ద్వారా టీడీపీ నేతలు అక్రమంగా ఉపాధి పనులు దక్కించుకుంటూ గ్రామ పంచాయతీ పేరుతో సొమ్ము చేసుకోవడం ఐదేళ్లుగా కొనసాగుతోంది. డబ్బులు తమ పేరుతో మార్చినందుకు టీడీపీ నేతలు వాటాలు చెల్లిస్తున్నారు. గత ఆగస్టు 1వ తేదీ నుంచి సర్పంచుల పదవీ కాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలన రావడంతో టీడీపీ నేతల పని మరింత సులభం అయిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో నిధులు లేకపోయినా గత ఆగస్టు నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు దాదాపు రూ.1,800 కోట్ల బిల్లులు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అందులో రూ.1,615 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలలో జరిగిన పనులతో కలిపి అది రూ.1,920 కోట్లకు చేరుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం మారితే బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతుందనే ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. కొత్త సర్పంచులు వస్తే టీడీపీ నేతల ప్లాన్ బెడిసికొడుతుంది. అందువల్లే బిల్లుల చెల్లింపుల కోసమే సీఎం చంద్రబాబు అత్యవసరంగా మంత్రివర్గ సమావేశ నిర్వహణకు సిద్ధమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. అత్యధిక బిల్లులు లోకేష్ శాఖలోనే.. ఉపాధి హామీ పెండింగ్ బకాయిలుగా చెబుతున్న రూ.1,920 కోట్ల బిల్లుల్లో రూ.1,400 కోట్లు ఒక్క పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా గ్రామీణ రహదారులు, ఇతర నిర్మాణ పనులకు చెల్లించాల్సినవని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలలలో రూ.305 కోట్ల ఉపాధి హామీ మెటీరియల్ పనులు జరగగా అందులో రూ.196 కోట్లు పంచాయతీరాజ్ రోడ్లు బిల్లులుగా చెబుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, స్కూళ్ల ప్రహరీ గోడల నిర్మాణం, గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణాలు, అటవీశాఖ ఆధ్వరంలో చేపట్టిన మొక్కల పెంపకం కింద రూ.500 కోట్లకుపైగా బిల్లులను టీడీపీ నేతలు చూపిస్తున్నారు. -
కూడు పెట్టని ‘ఉపాధి’
- రూ.లక్షల్లో కూలి డబ్బుల పెండింగ్ - బ్యాంక్ నుంచే జాప్యం అంటున్న అధికారులు - ఇబ్బందులు పడుతున్న కూలీలు - వెంటనే చెల్లించాలని వేడుకోలు చేవెళ్లరూరల్ : పొట్ట కూటి కోసం పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తే పూట కూడా గడవడం లేదని ఉపాధి హామీ కూలీలు ఉసూరుమంటున్నారు. పని చేసినా కూలీ డబ్బులు చేతికందక పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. పైసల కోసం ప్రతి రోజూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక్క చేవెళ్ల మండలంలోనే ఉపాధి పనులకు సంబంధించి దాదాపు రూ.60లక్షలు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మండల పరిధిలోని 30 పంచాయతీల్లో దాదాపు సగానికి పైగా గ్రామాల్లో ఉపాధిహామీ పనులు జరుగుతున్నాయి. మొత్తం 3వేలకు పైగా కూలీలు పని చేస్తున్నారు. ఏరోజుకారోజు పనిచేసిన వివరాలను మస్టర్లలో నమోదుచేసి పంపిస్తున్నారు. పనిచేసిన రోజులకు సంబంధించి పే స్లిప్‌లు కూడా వస్తున్నాయి. డబ్బు మాత్రం చేతికి అందటంలేదు. దీంతో ఇప్పటికే చాలామంది పనులు నిలిపి వేశారు. గత నెల 24వ తేదీ నుంచి డబ్బుల చెల్లింపు పూర్తిగా నిలిచిపోయింది. 15రోజులకోసారి కూలీ డబ్బులు వస్తాయనే నమ్మకంతో అరువు తెచ్చి కుటుంబాలను పోషించుకుంటున్నామని, పైసలు రాక పస్తులుండాల్సి వస్తోందని వాపోతున్నారు. డబ్బులు చెల్లించే సంస్థలు మారడమే కారణం! ఉపాధిహామీ పథకంలో కూలీలకు డబ్బులు చెల్లించేందుకు యాక్సిస్ బ్యాంక్ తరపు ఓ సంస్థ ఉంటుంది. వారే క్షేత్రస్థాయిలో పనిచేసిన కూలీల పేస్లిప్‌ల ఆధారంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో పినో అనే సంస్థ ఈ వ్యవహారాలు చూసేది. ఆరునెలల కిత్రం మనిపాల్ అనే మరో సంస్థకు ఈ తంతు అప్పగించారు. అప్పటి నుంచి చెల్లింపుల విషయంలో ఇబ్బందులు మొదలయ్యాయి. కూలీల వివరాలు అందలేదని కొంతమంది డబ్బులు చెల్లించలేదు. దీంతో వారు పనిచేయడం మానేశారు. కొత్తగా పనిచేస్తున్న వారికి సైతం డబ్బులు చెల్లించటంలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు. ఈ విషయమై ఉపాధి హామీ పీఓ ఉషను వివరణ కోరగా కూలీలు చేసిన పనులకు సంబంధించి రికార్డులను పంపించామని, బ్యాంక్ నుంచి డబ్బులు మాత్రం రావడం లేదని సమాధానమిచ్చారు. త్వరగా చెల్లించాలి.. రోజూ పనిచేస్తేనే కాని కుటుంబం గడవదు. అందుకే ఉపాధి పనులు చేస్తున్నాం. నాలుగు వారాలుగా కూలీ డబ్బులు అందడం లేదు. చాలా ఇబ్బందింగా ఉంది. అధికారులను అడిగితే అదిగో.. ఇదిగో అంటున్నారు. కూలీ డబ్బులు త్వరగా వచ్చేలా చూడాలి. - జి. సువర్ణ, గొల్లపల్లి ఇబ్బందిగా ఉంది.. ఉపాధిహామీ పథకంలో డబ్బులు సకాలంలో అందుతాయనే నమ్మకంతో పనులు చేశాం. కొన్ని రోజులుగా కూలీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పని మానేస్తే వచ్చే పైసలు కూడా రావేమోనన్న భయంతో రోజూ పనికి వస్తున్నాం. - కె. కాశయ్య, గొల్లపల్లి