కూడు పెట్టని ‘ఉపాధి’ | wage Money problems with officers | Sakshi
Sakshi News home page

కూడు పెట్టని ‘ఉపాధి’

Published Mon, Jun 16 2014 11:45 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

కూడు పెట్టని ‘ఉపాధి’ - Sakshi

కూడు పెట్టని ‘ఉపాధి’

- రూ.లక్షల్లో కూలి డబ్బుల పెండింగ్
- బ్యాంక్ నుంచే జాప్యం అంటున్న అధికారులు
- ఇబ్బందులు పడుతున్న కూలీలు
- వెంటనే చెల్లించాలని వేడుకోలు

చేవెళ్లరూరల్ : పొట్ట కూటి కోసం పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తే పూట కూడా గడవడం లేదని ఉపాధి హామీ కూలీలు ఉసూరుమంటున్నారు. పని చేసినా కూలీ డబ్బులు చేతికందక పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. పైసల కోసం ప్రతి రోజూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక్క చేవెళ్ల మండలంలోనే ఉపాధి పనులకు సంబంధించి దాదాపు రూ.60లక్షలు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మండల పరిధిలోని 30 పంచాయతీల్లో దాదాపు సగానికి పైగా గ్రామాల్లో ఉపాధిహామీ పనులు జరుగుతున్నాయి. మొత్తం 3వేలకు పైగా కూలీలు పని చేస్తున్నారు.

ఏరోజుకారోజు పనిచేసిన వివరాలను మస్టర్లలో నమోదుచేసి పంపిస్తున్నారు. పనిచేసిన రోజులకు సంబంధించి పే స్లిప్‌లు కూడా వస్తున్నాయి. డబ్బు మాత్రం చేతికి అందటంలేదు. దీంతో ఇప్పటికే చాలామంది పనులు నిలిపి వేశారు. గత నెల 24వ తేదీ నుంచి డబ్బుల చెల్లింపు పూర్తిగా నిలిచిపోయింది. 15రోజులకోసారి కూలీ డబ్బులు వస్తాయనే నమ్మకంతో అరువు  తెచ్చి కుటుంబాలను పోషించుకుంటున్నామని, పైసలు రాక పస్తులుండాల్సి వస్తోందని వాపోతున్నారు.
 
డబ్బులు చెల్లించే సంస్థలు మారడమే కారణం!
ఉపాధిహామీ పథకంలో కూలీలకు డబ్బులు చెల్లించేందుకు యాక్సిస్ బ్యాంక్ తరపు ఓ సంస్థ ఉంటుంది. వారే క్షేత్రస్థాయిలో పనిచేసిన కూలీల పేస్లిప్‌ల ఆధారంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో పినో అనే సంస్థ ఈ వ్యవహారాలు చూసేది. ఆరునెలల కిత్రం మనిపాల్ అనే మరో సంస్థకు ఈ తంతు అప్పగించారు. అప్పటి నుంచి  చెల్లింపుల విషయంలో ఇబ్బందులు మొదలయ్యాయి. కూలీల వివరాలు అందలేదని కొంతమంది డబ్బులు చెల్లించలేదు. దీంతో వారు పనిచేయడం మానేశారు. కొత్తగా పనిచేస్తున్న వారికి సైతం డబ్బులు చెల్లించటంలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు. ఈ విషయమై ఉపాధి హామీ పీఓ ఉషను వివరణ కోరగా కూలీలు చేసిన పనులకు సంబంధించి రికార్డులను పంపించామని, బ్యాంక్ నుంచి డబ్బులు మాత్రం రావడం లేదని సమాధానమిచ్చారు.

త్వరగా చెల్లించాలి..
రోజూ పనిచేస్తేనే కాని కుటుంబం గడవదు. అందుకే ఉపాధి పనులు చేస్తున్నాం. నాలుగు వారాలుగా కూలీ డబ్బులు అందడం లేదు. చాలా ఇబ్బందింగా ఉంది. అధికారులను అడిగితే అదిగో.. ఇదిగో అంటున్నారు. కూలీ డబ్బులు త్వరగా వచ్చేలా చూడాలి.
 - జి. సువర్ణ, గొల్లపల్లి
 
 ఇబ్బందిగా ఉంది..
 ఉపాధిహామీ పథకంలో డబ్బులు సకాలంలో అందుతాయనే నమ్మకంతో పనులు చేశాం. కొన్ని రోజులుగా కూలీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పని మానేస్తే వచ్చే పైసలు కూడా రావేమోనన్న భయంతో రోజూ పనికి వస్తున్నాం.  
 - కె. కాశయ్య, గొల్లపల్లి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement