విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలంలో మాస్కులు ధరించి సబ్బుతో చేతులను శుభ్రం చేసుకుంటున్న కూలీలు
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి కమ్ముకొస్తున్న తరుణంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిరుపేద కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో ఉపాధిహామీ పథకం ద్వారా ఇప్పటివరకు 79 లక్షల పనిదినాలు కల్పించగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 25.57 లక్షల పనిదినాలు కల్పించడం గమనార్హం. అయితే వాస్తవంగా రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 20 వరకు కూలీలకు 36.50 లక్షల పనిదినాలు కల్పించామని, తాజా డేటా కేంద్ర వెబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్ కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఏప్రిల్‌లో కల్పించిన పనిదినాల వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్‌పోర్టల్‌లో వెల్లడించింది.
► విపత్కర సమయంలో ఉపాధి హామీ ద్వారా గ్రామీణ నిరుపేద కూలీలకు పని కల్పన దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువగా ఉంది. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా కల్పించిన ఉపాధిహామీ పనిదినాల్లో మూడో వంతు మన రాష్ట్రంలోని కూలీలే లబ్ధి పొందారు.
► రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే పని కోరిన ప్రతి కూలీని వారి నివాసానికి సమీప ప్రాంతంలో ఉపాధిహామీ ద్వారా ఆదుకుంది.
► ఉపాధి హామీ పనుల కోసం వచ్చే కూలీల సంఖ్య రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతోంది.
► విపత్కర పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 18 వరకు 9,100 గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా కూలీలకు ప్రభుత్వం పనులు కల్పించింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 2,07,498 మంది కూలీలు 9.03 లక్షల పనిదినాల పాటు పని చేసి రూ.18.23 కోట్ల వేతనాలు పొందారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 65 వేల మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. 3,800 గ్రామాల్లో మాత్రం వివిధ కారణాలతో ఉపాధి హామీ పనులు మొదలు కాలేదని అధికారులు తెలిపారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో భౌతిక దూరం పాటిస్తూ ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యలు..
► ఉపాధి పనులను తెల్లవారుజామున ప్రారంభించి మధ్యాహ్నం 11 గంటల లోపు ముగించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గ్రామీణాభివద్ధి శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు.
► కూలీలు పని ప్రదేశానికి వాహనాలలో వెళ్లేటప్పుడు దూరంగా కూర్చోవాలని, వీలైనంత వరకు సైకిల్ లేదా ద్విచక్ర వాహనాలపై వెళ్లడం మంచిదంటున్నారు.
► పనికి ఉపయోగించే పనిముట్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకవద్దని, శుభ్రం చేసుకోకుండా ఆహారం తీసుకోవద్దని సూచిస్తున్నారు.
► ఒక కుటుంబానికి ఒకే చోట పని కల్పిస్తున్నారు.
► కూలీలు కనీసం మీటరు దూరంలో ఉంటూ పనులు చేసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. తువ్వాలు లేదా కర్చీఫ్‌తో ముఖాన్ని కప్పుకోవాలి.
► వేసవి కాలం కావడంతో కూలీలు రోజు వారీ చేయాల్సిన పనిలో 30 శాతం తక్కువ చేసినా ‘నరేగా’ నిబంధనల ప్రకారం పూర్తి వేతనం చెల్లిస్తున్నారు.
‘ఉపాధి’కి నిధుల కొరత లేదు
‘ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాలు చెల్లించేందుకు నిధుల కొరత లేదు. ఉపాధి హామీ వేతనాల కోసం 2020–21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం రూ.2149.78 కోట్లు మంజూరు చేసింది. 2019–2020 లో రూ. 211 గా ఉన్న దినసరి వేతనాన్ని 2020–21లో అదనంగా రూ.26 పెంచి రోజుకి రూ. 237 చొప్పున చెల్లిస్తాం’
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment