Andhra Pradesh: ఏపీలో జీవనోపాధి భేష్‌ | Rural economy is good in AP and Works for everyone even in corona disaster | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఏపీలో జీవనోపాధి భేష్‌

Published Sun, May 23 2021 2:48 AM | Last Updated on Sun, May 23 2021 11:45 AM

Rural economy is good in AP and Works for everyone even in corona disaster - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న తరుణంలో కూడా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ జోరు ఏమాత్రం తగ్గలేదు. పలు రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ కుదేలై, కోలుకోవడానికి సతమతమవుతుండగా.. రాష్ట్రంలో మాత్రం పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచే రీతిలో దూసుకుపోతుండటం విశేషం. గ్రామాల్లో ఎక్కడా కూడా ప్రజలు జీవనోపాధి కోసం ఇబ్బంది పడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎకానమీ సైకిల్‌ పటిష్టంగా ఉండటం వల్లే కూలి పనులకు ఎక్కువ డిమాండ్‌ ఏర్పడి రేట్ల పెరుగుదల కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు మొదలు అసంఘటిత కార్మికులు, చేతి వృత్తి పనులు చేసుకునే వారి వరకు రోజు వారీ సంపాదన ఏడాదిలో 9 నుంచి 13 శాతం వరకు పెరిగినట్టు ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ డైరెక్టరేట్‌ అధ్యయనంలో తేలింది. అసంఘటిత కార్మిక వర్గంలో అత్యంత బలహీన కేటగిరీగా భావించే గ్రామీణ ప్రాంతంలోని చేతివృత్తిదారులు, వ్యవసాయ కూలీల రోజు వారీ కూలీ రేట్లపై ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 42 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 44 ప్రాంతాల్లో 16 రకాల వృత్తులలో కూలి రేట్లపై అధ్యయనం చేసింది. 

వ్యవసాయ కూలి రేటు రూ.48 పెరుగుదల
సాధారణ వ్యవసాయ కూలీకి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రోజుకు రూ.368 కూలి దక్కితే.. కరోనా విపత్తు సంభవించిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.416 చొప్పన అందింది. అంటే విపత్తు వేళ కూడా కూలి రూ.48 పెరగడం అంటే చిన్న విషయం కాదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. వ్యవసాయ కూలీల కూలి రేట్లలో కూడా 13 శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో వడ్రంగి (చెక్క పని చేసే వారు) పని చేసే వారి రోజు వారీ కూలి రేటు 9 శాతం, చెప్పులు కుట్టుకునే వారి రోజు వారీ కూలీ రేటు 8 శాతం పెరిగినట్టు అధ్యయనంలో తేలింది. అయితే ఇదే సమయంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకునే వారిలో స్త్రీ, పురుషుల కూలి రేట్ల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. పురుషులకు రోజు వారీ కూలి సరాసరి రూ.416 చొప్పున దక్కితే, మహిళలకు మాత్రం సరాసరి రూ.298 చొప్పునే అందుకోగలిగారు. కాగా, మహిళల కూలి రేట్లలో ఏడాదిలో 12 శాతం పెరుగుదల నమోదవ్వడం గమనార్హం.  

ప్రభావం చూపని కరోనా!
2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2020–21 ఆర్థిక సంవత్సరం హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (ధరల సూచి)లో పెరుగుదల 8.5 శాతంగా ఉంది. అంటే వినియోగ వస్తువుల ధరల సూచీలో పెరుగుదల కంటే గ్రామాల్లో చేతి వృత్తిదారులు, వ్యవసాయ కూలీల రోజు వారీ వేతనాల పెరుగుదల ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. గత ఏడాది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా, మన దేశంలోనూ అన్ని వ్యవస్థలను అతలాకుతలం చేస్తోన్న కరోనా, మన రాష్ట్రంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఏమాత్రం ప్రభావం చూపలేదని స్పష్టమవుతోందని ఆర్థిక నిఫుణులు పేర్కొంటున్నారు. వివిధ రంగాల్లోని కూలీలకు అధిక కూలి రేట్లు దక్కడానికి నిపుణులు చెబుతున్న కారణాలు ఇలా ఉన్నాయి. 

ఎకానమీ జోష్‌కు ఇవీ కారణాలు
► రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా గత 23 నెలల కాలంలో దాదాపు రూ.1.25 లక్షల కోట్ల మొత్తాన్ని రైతులకు, మహిళలకు, పేదలకు నేరుగా నగదు రూపంలోనే అందజేసింది. ఇందులో అధిక మొత్తం గ్రామీణ లబ్ధిదారులకే చేరింది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల కొనుగోలు శక్తిలో కరోనా సమయంలో పెద్దగా మార్పు చోటు చేసుకోలేదు. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో పనులకు డిమాండ్‌ పెరిగిందే తప్ప తగ్గలేదు. 
► వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వారి సొంత గ్రామాల్లోనే పెద్ద ఎత్తున పనులు కల్పించారు. ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా గత ఏడాది 26.03 కోట్ల పనిదినాలు కల్పించింది.
► రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితి సైతం గతంతో పోల్చుకుంటే గత రెండేళ్లగా బాగా మెరుగు పడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవహారాలన్నీ వ్యవసాయ రంగంతోనే ముడిపడి ఉంటాయి. వ్యవసాయ పనులు తక్కువగా ఉండే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లోనే కరోనా తీవ్రత అధికంగా కనిపించింది. దీంతో వ్యవసాయ రంగంపై ప్రభావం తక్కువగానే కనిపించింది.

గ్రామాల్లో ఆర్థిక పరిస్థితి బాగుంది
గ్రామీణ ప్రాంతంలో పనులకు డిమాండ్‌ అధికంగా ఉండడం వల్లే చేతి వృత్తుదారులకు, వ్యవసాయ కార్మికులకు  కూలీ రేట్లు బాగా పెరిగాయి. కరోనా సమయంలోనూ గ్రామీణ ఎకనామీ సైకిల్‌ యాక్టివ్‌గానే ఉందన్నది వాస్తవం. పనులకు డిమాండ్‌ పెరగడానికి ఇదే కారణం. గడిచిన ఏడాదిలో హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (ధరల సూచీ)లో 8.5 శాతం, ఉత్పత్తి రంగంలో 7.5 శాతం మాత్రమే పెరుగుదల ఉంది. అదే సమయంలో గ్రామాల్లో వ్యవసాయ కూలీల రోజు వారీ కూలీ రేట్లలో మాత్రం æ13 శాతం పెరుగుదల కనిపించింది. మహిళా వ్యవసాయ కూలీల రోజు వారీ వేతనం 12 శాతం పెరిగింది. చేతివృత్తి పని వారి వేతనాలు 9 శాతం దాకా పెరుగుదల కనిపించింది. 
– ప్రొఫెసర్‌ ఎం. ప్రసాదరావు, ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం 
చదవండి: ‘యాస్‌’ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement