
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం మరో అత్యంత అరుదైన మైలురాయికి చేరుకుంది. సోమవారం (జూన్8) ఒక్క రోజే అరకోటి మందికి పైగా కూలీలకు పని కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 54,51,939 మంది కూలీలు ఉపాధి హామీ పథకం పనులకు హాజరయ్యారు. వ్యవసాయ పనుల్లేని పరిస్థితులు, కరోనా విపత్కర పరిస్థితులతో గ్రామీణ నిరుపేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా పనుల కల్పనపై దృష్టి పెట్టింది. లాక్‌డౌన్ కారణంగా తిరిగొచ్చిన వలస కూలీలకు వారి సొంత ఊర్లోనే పని కల్పించేలా తక్షణమే 1, 58, 400 జాబ్ కార్డ్‌లు మంజూరు చేసింది.
► తెలుగుదేశం ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం ద్వారా ఒక రోజు వ్యవధిలో గరిష్టంగా పని కల్పించిన కూలీల సంఖ్య 30 లక్షల్లోపేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
► ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ పథకం ద్వారా పనుల కల్పనకు డ్వామా పీడీలతో పాటు జెడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలను భాగస్వామ్యం చేశారు.
రెండు నెలల్లోనే రూ.2,035 కోట్లు చెల్లింపు
ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి 8.84 కోట్ల పనిదినాలు కల్పించి సోమవారం వరకు కూలీలకు రూ.2,035 కోట్ల వేతనాల రూపంలో చెల్లించారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్న వారిలో 82 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. లాక్‌డౌన్‌లోనూ ఒక్కో కుటుంబం రూ.20వేలకుపైగా ఆదాయం పొందింది.