సాక్షి, పాలమూరు : పొద్దు పొడిచింది మొదలు చిమ్మచీకటి పడే వరకు పొలం పనుల్లో తలమునకలయ్యే రైతన్న జీవితం నిత్యం ప్రమాదాలమయం. రైతులు సాగు చేసిన పంటను నిత్యం చేలల్లో తిరుగుతూ పరిశీలించాల్సి ఉంటుంది. అందుకోసం పొలం గట్లపై తిరుగుతుంటారు. అలాంటప్పుడు పాములు, తేళ్లవంటి విష పురుగులతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఎదురవుతాయి. వరిలో, ఇతర పంటలలో కలుపు తీసే సందర్భాల్లోనూ విష సర్పాలు కాటువేసి చనిపోయిన ఘటనలు అనేకం. ఏవైపు నుంచి.. ఏ రూపంలో ఎప్పుడు ఎలా ప్రమాదం వచ్చి పడుతుందో తెలియదు. ఉదయం పనులకు వెళ్లిన వ్యక్తి సాయంత్రం ఇంటికి చేరే వరకు భయమే. అలాంటి రైతన్నకు వర్షాకాలం మరింత క్లిష్టమైనదని చెప్పవచ్చు. ఈ క్రమంలో రైతులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.
ప్రమాదం జరిగితే..
పాముకాటు ప్రమాదాలు సంభవించినప్పుడు అది ఏ పామో గుర్తించాలి. ఒకటి, రెండు కాట్లు ఉంటే విషపూరితమైంది. అంతకంటే ఎక్కువ కాట్లతో కనిపించే గాయం ఉంటే విషపూరితం కానిది. విషపూరితమైన పాము అయితే వెంటనే ఫోన్ ద్వారా సమాచారం అందించాలి. ఉన్నచోట నుంచి పరుగెత్తకూడదు. ఎవరైనా వచ్చే వరకు ఓపిగ్గా ఉండాలి. తినడం, తాగడం లాంటివి చేయకూడదు. కాటు వేసిన భాగాన్ని కదిలించకుండా ఉంచాలి. సహాయకులు వచ్చిన తర్వాత కాటేసిన భాగాన్ని పరిశుభ్రమైన నీరు, సెలైన్ వాటర్‌తో పంపులాంటి ధారలా పైనుంచి గాయం పడినచోట పోయాలి. దాని వల్ల గాయం వద్ద ఉన్న రక్తం, విషపు చుక్కలు కారిపోతాయి. ఆ వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాలి.
ఈ జాగ్రత్తలు పాటించాలి..
► పాము కాటేసిన చోట తాడుతో లేక ఇతర గుడ్డముక్కలతోనైనా కట్టాలి. ఆ వెంటనే చికిత్సకు తరలించాలి.
►పాము కాటేస్తే మూఢనమ్మకాలను నమ్మి మంత్రం వేసిన నీళ్లు తాగడమో.. భూమిలో కాలుపెట్టి చికిత్స తీసుకోవడం లాంటివి చాలాచోట్ల చేస్తుంటారు.
►మూఢనమ్మకాలకు దూరం ఉండి తక్షణమే ఆస్పత్రికి వెళ్లాలి.
►పొలానికి వెళ్లిన సమయంలో చెట్ల పొదల్లో అడుగు పెట్టేది ఉంటే కాళ్లకు పెద్ద సైజులో ఉండే నల్లని బూట్లు ధరించాలి.
►పొదల్లో పనిచేసే సమయంలో చేతులకు గ్లౌజులు ధరించడం మంచిది. పిల్లలను పొదలు ఎక్కువగా ఉన్నచోట ఆడుకోవడానికి పంపించరాదు.
► పల్లెల్లో ఇళ్ల పరిసరాలు చుట్టూ చెట్ల పొదలు ఎక్కువగా ఉండనివ్వకుండా చూసుకోవాలి.
పొలాల్లోనే అధికం..
పొలాల్లో ప్రధానంగా తాచుపాము, రక్తపింజర, కట్లపాము, చిన్న రక్తపింజర సంచారం ఉంటుంది. ఎలుక కన్నాల్లో, పందికొక్కుల బొరియల్లో, చెదల పుట్టల్లో నివాసాలు ఏర్పాటు చేసుంటాయి. అక్కడే గుడ్డు పెట్టడమే కాకుండా పిల్లలను ప్రసవిస్తాయి. నాగుపాము, కట్ల, రక్తపింజరం వంటి కొన్ని రకాల పాములు మాత్రమే ప్రమాదకరం.
Comments
Please login to add a commentAdd a comment