పాములతో పారా హుషార్
వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడింది. ఇన్నాళ్లూ ఎండ వేడిమితో సతమతమైన పాములు పుట్టలు, బొరియల నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ సంచరిస్తున్నాయి. ఈ నెల 16న ఉరవకొండ మండలం రేణుమాకులపల్లికి చెందిన నాగేంద్ర (40) పాముకాటుతో మృతి చెందాడు. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఒక్క అనంతపురం సర్వజనాస్పత్రికే 170 మంది పాముకాటు బాధితులు వచ్చారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్న వారు చాలా మందే ఉన్నారు.
అనంతపురం మెడికల్ :
వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువ. రక్తపింజర, నాగుపాము, తాచుపాము, కట్లపాము, నీరుకట్ట, కొండచిలువ, జెర్రిపోతు వంటివన్నీ విష సర్పాలే. ఇలా ఏ రకమైన పాము కాటు వేసినా ముందస్తు జాగ్రత్తలు చాలా అవసరం. పాము కాటు వేయగానే తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణనష్టం తప్పదని వైద్యులు అంటున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
మొదట పాము కాటు వేసిన చోటును గుర్తించాలి.
కాటు వేసిన పైభాగంలో రక్త ప్రసరణ తగ్గించేందుకు కట్టుకట్టాలి. లేకపోతే రక్తాన్ని పిండేయాలి.
పాములు కాటు వేసిన సమయంలో భయాందోళనకు గురైతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎలాంటి పాము కుట్టినా మొదట ఒత్తిడికి లోనుకాకూడదు.
విషపూరిత పాము కాటేసినప్పుడు ఆ భాగాన్ని ఎక్కువగా కదలించకుండా సమీపంలోని ఆస్పత్రికి ప్రథమ చికిత్స కోసం తీసుకెళ్లాలి.
ఏ పాము కుట్టినా శరీరంపై ప్రభావం చూపించడానికి 30 నుంచి 60 నిమిషాల సమయం పడుతుందని డాక్టర్లు చెబుతారు. ఈలోగా సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడొచ్చు.
విషపూరిత పాము కాటుకు యాంటీ స్నేక్ వీనం సరైన సమయంలో ఇస్తే ప్రాణాపాయం నుంచి పూర్తిగా బయటపడవచ్చు.
ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు
పాము కాటుకు సంబంధించి ‘యాంటీ స్నేక్ వీనం’ మందును ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఈ విషయం తెలియక చాలా మంది పాము కాటు వేయగానే నాటు వైద్యం కోసం వెళ్తున్నారు. ఇది చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ‘యాంటీ స్నేక్ వీనం’ మందు అందుబాటులో ఉంది. గుంతకల్లు, హిందూపురం, గుత్తి, ధర్మవరం, పెనుకొండ, మడకశిర ఏరియా ఆస్పత్రులతో పాటు జిల్లాలోని 81 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందు అందుబాటులో ఉన్నట్లు అడిషనల్ డీఎంహెచ్‌ఓ వెంకటరమణ తెలిపారు.
రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి
రైతులు పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు. తడి ఎక్కువగా ఉండడం తో చల్లని వాతావరణం ఉంటుంది. దీంతో పాముల బెడదకూడా ఎక్కువే. రైతులు పొలం పనులకు వెళ్లేటప్పుడు కాళ్లకు పొడవైన బూట్లు వేసుకోవాలి. రాత్రి వేళల్లో పొలాలకు టార్చిలైట్ తీసుకుని పంచె కింద వరకు ధరించాలి. కర్రతో శబ్దం చేసుకుంటూ వెళ్లాలి. ఒక వేళ అనుకోకుండా పాము కాటు వేస్తే ఆందోళనకు గురికాకుండా సమీప ఆస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకోవాలి. వీలైనంత వరకు వెలుతురు ఉండగానే పనులు ముగించుకుని ఇంటికి చేరుకుంటే మంచిది. - డాక్టర్ పి.లక్ష్మిరెడ్డి, కేవీకే కో ఆర్డినేటర్, రెడ్డిపల్లి
నాటు మందులతో ప్రమాదం
చాలా మందు పాముకాటుకు నాటుమందు అంత సురక్షితం కాదు. ముందుగా పాముకాటుకు గురైన వారు ఒత్తిడికి లోనుకావద్దు. అలా చేస్తే విషం వేగంగా ప్రసరించి మెదడుపై ప్రభా వం చూపుతుంది. కాటు వేయగానే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఆలస్యం చేయొద్దు. - షేక్ యాసిర్ అరాఫత్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అనంతపురం ప్రభుత్వాస్పత్రి.