ప్రమాదం ‘అంచుల్లో’ ప్రయాణం
- ఇరవైచోట్ల కొండ చరియలు కూలే అవకాశాలు
- అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారుల సూచన
సాక్షి, తిరుమల: తిరుమల ఘాట్‌రోడ్ల ప్రయాణం ప్రమాదం అంచుల్లోకి చేరింది. వర్షాకాలం వస్తే చాలు రెండు ఘాట్‌రోడ్లలోనూ కొండ చరియలు విరిగి పడటం సర్వసాధారణమైపోయింది. రెండు రోజులుగా రెండో ఘాట్‌రోడ్డులోని చివరి ఐదు మలుపుల్లో భారీ స్థాయిలో కొండ చరియలు విరిగి పడ్డాయి. మరికొన్ని చోట్ల విరిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. దాదాపుగా ఇరవైకి పైగా ఇలాంటి ప్రదేశాలు ఉన్నట్టు ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు.
మొదటి ఘాట్‌రోడ్డులో తక్కువే
1944, ఏప్రిల్ 10వ తేదీన తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలకు 56 మలుపులతో కూడిన మొదటి ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వచ్చింది. 1973వ సంవత్సరం వరకు ఈ రోడ్డులోనే రాకపోకలన్నీ సాగేవి. ఏకధాటిగా కురిసే కుండపోత వర్షాల వల్ల కేవలం అవ్వాచ్చారి కోన ఎగువ ప్రాంతం, కపిలతీర్థం నుంచి అలిపిరి వరకు మాత్రమే కొండ చరియలు అడపా దడపా విరిగి పడుతున్నాయి.
రెండో ఘాట్‌రోడ్డులో కూలుతున్న చరియలు
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు భారీగా పెరుగుతుండటంతో 1969 నుంచి 1973 మధ్య కాలంలో రెండో ఘాట్‌రోడ్డును నిర్మించారు. ఈ మార్గంలో అలిపిరి నుంచి ఎనిమిది కిలోమీటర్ల తర్వాత మొదలై తిరుమలకు చేరే వరకు కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయి. ఇందులోనూ చివరి ఐదు మలుపుల వద్ద ఇలాంటి పరిస్థితులు చాలా ఎక్కువ.
రెండు రోజుల పాటు వరుసగా ఓ మోస్తరులో కుండపోత వర్షం కురిస్తే చాలు భారీ స్థాయిలో కొండ చరియలు విరిగి పడటం సాధారణమైపోయింది. అదృష్టవశాత్తు అలాంటి ఘటనల్లో ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. అలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోందని భక్తులు భావిస్తున్నారు. దీనివల్ల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. తాజాగా, ఇటీవల కురిసిన వర్షాలకు రెండు రోజులుగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి.
ఏడేళ్లకు ముందు త్రోవ భాష్యకార్ల సన్నిధి సమీపంలోని మలుపు వద్ద భారీగా కొండచరియలు విరిగి పడటంతో అప్పట్లో ప్రత్యేకంగా ఇంజనీరింగ్ నిపుణులను రప్పించి వాటిని తొలగిం చారు. అక్కడే భారీ ఇనుపరాడ్లను కొండలోకి దించారు. ప్రత్యేకంగా ఇనుప కంచె నిర్మించారు. చివరి మలుపు వద్ద భారీగా కొండ చరియలు విరిగి పడటంతో రెండేళ్లకు ముందు అక్కడ ఇనుప కంచె నిర్మించారు. దీనివల్ల బండరాళ్లు దొర్లినా ఇనుప కంచెలో పడుతుండటంతో ప్రమాదాలు తప్పుతున్నాయి.
ఇలాంటి పరిస్థితులే సుమారు మరో ఇరవై ప్రాంతాల్లో వెలుగుచూస్తుండ టం ఇంజనీరింగ్ ఉన్నతాధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎలాంటి సమాచారం చెవిన పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. వీటిని ని వారించాలంటే ఆయా ప్రాంతాల్లో సిమెంట్ కాంక్రీట్, ఇనుప కంచె నిర్మాణాలు చేపట్టాల్సిన పరిస్థితులు క నిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కొండ చరియలు విరిగి పడుతున్న నేపథ్యంలో వాహనదారులు, ద్విచక్రాలపై వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండా లని అధికారులు సూచించారు.