అసెంబ్లీలో లేకున్నా ఎలా సస్పెండ్ చేస్తారు?
బద్వేలు ఎమ్మెల్యే తిరువీధి జయరాములు
బద్వేలు(అట్లూరు): అసెంబ్లీలో లేని తనను ఎలా సస్పెండ్ చేస్తారని వైఎస్సార్ జిల్లా బద్వేలు ఎమ్మెల్యే తిరువీధి జయరాములు ప్రశ్నించారు. ఐదు రోజుల క్రితం అయ్యప్పస్వామి దర్శనం కోసం శబరిమలై వెళ్లిన ఆయన శనివారం సాయంత్రం పోరుమామిళ్లలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను ఐదు రోజుల క్రితం శబరిమలైకి వెళ్లానని అందువల్ల అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేకపోయానన్నారు. అయినా ఈనెల 18న తాను అసెంబ్లీలో ఉన్నట్లు ప్రకటించి స్పీకర్ తనను కూడా సస్పెండ్ చేశారన్నారు.
అదే రోజు శాసనసభలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బద్వేలు ఎమ్మెల్యే జయరాములు అసెంబ్లీలో లేరని ఆయనను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. అధికార పార్టీ అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.