భూసేకరణ చేస్తే సామూహిక ఆత్మహత్యలే
నేతలు, పాలకులకు తేల్చి చెప్పిన కొత్తగూడెం వాసులు
కొత్తగూడెం (గన్నవరం) : పోలవరం కాలువ నిర్మాణం కోసం తమ ఇళ్లను బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని కొత్తగూడెం గ్రామస్తులు ప్రజాప్రతినిధులు, అధికారులకు తేల్చిచెప్పారు. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాలువ డిజైన్ మార్చడంతో తాము ఇళ్లు కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. తమ ఇళ్లకు మినహాయింపు ఇవ్వకపోతే ఎమ్మెల్యే, అధికారుల ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల విజ్ఞప్తి మేరకు పోలవరం కాలువ నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, ప్రాజెక్టు ప్రత్యేక డెప్యూటీ కలెక్టర్ డి. సుదర్శనరావు, పలువురు అధికారులు గురువారం గ్రామాన్ని సందర్శించారు. తొలుత భూసేకరణకు గుర్తించిన ఇళ్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కాలువ నిర్మాణం కోసం 320 మీటర్ల వెడల్పున భూసేకరణ చేస్తున్నామని, పేదల ఇళ్లను మినహాయించేందుకు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని, అధికారుల సర్వేకు సహకరించాలని కోరారు. ఎంపీపీ పట్రా కవిత, వైస్ ఎంపీపీ గొంది పరంధామయ్య, సర్పంచ్ కొండ్రు ఝాన్సీ, పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.