ఎనిమిది నామినేషన్ల ఉపసంహరణ
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నామినేషన్లలో సోమవారానికి మొత్తం ఎనిమిది మంది ఉపసంహరించుకున్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఈ నెల 30న జరుగనున్న ఎన్నికలకు సంబంధించి 902 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో ఎనిమిది మంది ఉపసంహరించుకోగా 894 మంది బరిలో ఉన్నారు. వాటిలో కొత్తగూడెంలో రెండు, మధిరలో ఐదు, సత్తుపల్లి ఒకటి ఉన్నాయి. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం సాయంత్రం 3 గంటల వరకు సమయం ఉంది. మూడు గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. అలాగే అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయించనున్నారు. అభ్యర్థులు ఎక్కువ మంది ఒకే గుర్తును కోరుకున్నట్లయితే తెలుగులో వారి ఇంటి పేరు అక్షర క్రమంలో కేటాయించనున్నారు.
సత్తుపల్లిలో ఒకరు....
సత్తుపల్లి నగర పంచాయతీలోని 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఎం. లావణ్య సోమవారం నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
కొత్తగూడెంలో ఇద్దరు...
కొత్తగూడెం అర్బన్ : కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో సోమవారం జ్యోతి, రావి మమతలు వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఆదివారం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు విత్‌డ్రా చేసుకోగా సోమవారం ఇద్దరు విత్‌డ్రా చేసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఏడుగురు అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మంగళవారం ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, అభ్యర్థులు బీ ఫాంలు చెల్లించిన తర్వాత అధికారులు తుది జాబితాను విడుదల చేయనున్నారు.