త్వరలో మొబైల్ ఆధార్ కేంద్రాలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో ఆధార్ కార్డులు పొందలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగుల కోసం మొబైల్ ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో గురువారం రాత్రి ఆధార్ కార్డుల జారీ తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 2నుంచి పింఛన్ల మొత్తాన్ని పెంచిన దృష్ట్యా ఆధార్ కార్డులు తప్పనిసరి అని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో బోగస్ పింఛన్లను నిరోధించేందుకు, అర్హత కలిగిన పింఛన్‌దారులందరికీ సకాలంలో పింఛన్లు అందించడానికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశామన్నారు.
జిల్లాలో సామాజిక పింఛన్లు ప్రతి నెలా 3 లక్షల 30 వేల 661 మందికి అందిస్తుండగా, అందులో 3 లక్షల 8 వేల 194 మందికి మాత్రమే ఆధార్‌కార్డులున్నాయని మరో 8 వేల 324 మందికి ఇప్పటివరకు ఆధార్ నమోదు జరగలేదన్నారు. వారి కోసం మొబైల్ వాహనాలు వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన కింద 46 వేల 650 మంది లబ్ధిదారులుండగా వారిలో 35 వేల 872 మందికి ఆధార్ అనుసంధానం జరగలేదన్నారు. ఈ విషయంలో భాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సీడీపీవోలకు జీతాలు చేస్తేగాని వారిలో బాధ్యత గుర్తురాదని ఆగస్టు 15వ తేదీలోగా ఆధార్ అనుసంధానం చేయకపోతే జీతాలు నిలుపుదల తప్పదని హెచ్చరించారు.
మూడు నెలల్లో కాళీపట్నం భూ సమస్య పరిష్కారం
ఏలూరు : జిల్లాలో ఆరు దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న మొగల్తూరు మండలం కాళీపట్నం భూముల సమస్యను మూడు నెలల్లో పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని కలెక్టర్ కాటమనేని భాస్కర్ హామీ ఇచ్చారు. ఈ భూముల సమస్యను పరిష్కరించాలని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, నరసాపురం ఎమ్మెల్యే బి.మాధవనాయుడు, పలువురు రైతులు కలెక్టర్‌ను గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఈ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ భాస్కర్ బదులిస్తూ 20మంది తహసిల్దార్లను, ఎక్కువ మంది సర్వేయర్లు నియమించి భూములను సర్వే చేసి నిజమైన రైతులకు న్యాయం చేస్తామన్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మొగల్తూరు మాజీ జెడ్పీటీసీ జక్కం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.