రెప్పవాల్చని సిటీ...
సూర్యుడికి సాయంకాలం పడమటి కొండల్లో విశ్రాంతి...
చంద్రుడు రవికిరణం సోకితే చల్లగా జారుకుంటాడు..
మరి భాగ్యనగరి... నిరంతర జన ప్రవాహ ఝరి....
అర్ధరాత్రీ హడావుడి.. సందడి మామూలే...
నైట్ లైఫ్...
అర్ధరాత్రికి ఆకలెక్కువనుకుంటాను
పెనమ్మీద మాడిపోయిన
బ్రెడ్డుముక్కల్నీ గుడ్డుముక్కల్నీ
చౌరస్తాలు ఎగబడి పంచుకుంటున్నాయి...
భాగ్యనగరి.. నిరంతర జనఝరి.. సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకూ జీవనయానం సాగుతునే ఉంటుంది. 24 గంటలు మాకు సరిపోవు అన్నట్టు నగరం పరుగులు తీస్తోంది. స్త్రీ, పురుషులు, బడా, పేద అనే తేడాను చెరిపేస్తోంది. అర్ధరాత్రి సైతం అందరినీ ‘కలిపే’ నడిపిస్తోంది. ఐటీ హబ్‌లు..అంతర్జాతీయ కార్యాలయాలకు కేంద్రంగా నిలిచిన విశ్వ నగరం నిరంతరం మేల్కొనే ఉంటోంది. రేయి, పగలుకు తేడా లేదంటూ అర్ధరాత్రి విద్యుత్ దీప కాంతుల్లో యువత కేరింతలు.. దూసుకుపోతున్న కార్లు.. వేడివేడి టిఫిన్ల కోసం మొబైల్ క్యాంటిన్లు.. వీధులను శుభ్రం చేస్తున్న కార్మికులు..
కలల బండి మెట్రో పనులు చేస్తున్న శ్రామికులు.. మీ భద్రతకు మేం భరోసా అంటూ పెట్రోలింగ్ పోలీసులు.. ఇలా గ్రేటర్ సిటీ బిజీబిజీ. నిశిరాత్రి వేళ నగరంలో వింతలు.. విశేషాలను మీ ముందుంచేందుకు ‘సాక్షి’ ఓ ప్రయత్నం చేసింది. హైటెక్ హంగులు పులుముకున్న మాదాపూర్.. కొత్త పాతల మేలు కలయిక మెహదీపట్నం.. ఎప్పుడూ బిజీగా ఉండే అమీర్‌పేట్, సికింద్రాబాద్‌లలో పర్యటించింది. నగరం నిద్దరోతున్న వేళ..మేల్కొని ఉన్న మరో ప్రపంచాన్ని మీరూ చూడండి.
- సాక్షి, సిటీబ్యూరో