Mobile units
-
బియ్యం డోర్ డెలివరీకి 8న ట్రయల్‌రన్
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేయనున్న నేపథ్యంలో సోమవారం మొబైల్ యూనిట్ల ట్రయల్‌రన్ చేయనున్నారు. అధికారంలోకి వస్తే నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు హామీ ఇచ్చారు. (మైనార్టీల జీవితాల్లో ఆర్థిక వెలుగు) ఈ హామీ అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు బియ్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేకంగా మొబైల్ యూనిట్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే తయారు చేసిన కొన్ని యూనిట్లను ఈ నెల 8న ట్రయల్ రన్ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా 13,370 మొబైల్ యూనిట్లను అందుబాటులోకి తెచ్చేందుకు టెండర్లను పిలుస్తామని తెలిపారు. నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ విధానం ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. (ఏపీ ప్రభుత్వ పథకాలకు జాతీయస్థాయి ప్రశంసలు) మొబైల్ యూనిట్ వల్ల ప్రయోజనం... ► ఇందులోనే ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ ఉంటుంది. ► మొబైల్ యూనిట్ల ద్వారా ఇంటికివెళ్లి నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తారు. ► లబ్ధిదారుల ముందే బియ్యం బస్తా సీల్ ఓపెన్ చేసి రేషన్ ఇస్తారు. ► బియ్యం తీసుకునేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన బ్యాగులను ముందే ఇవ్వనున్నారు. -
ఇక రంగంలోకి మొబైల్ యూనిట్లు
సాక్షి, ముంబై: అత్యవసర సమయంలో ‘రెస్పాన్స్ టైం’ తగ్గించేందుకు నగరంలో 10 మొబైల్ యూనిట్లు ఏర్పాటుచేయాలని అగ్నిమాపక శాఖ నిర్ణయం తీసుకుంది. ఏదైన ప్రమాదం సంభవించినప్పుడు సమీపంలో ఉన్న ఈ మొబైల్ యూనిట్లు కేవలం ఏడు నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంటాయి. అక్కడ జరిగే ప్రాణ, ఆస్తి నష్టం నుంచి కాపాడతాయి. దూరం నుంచి అగ్నిమాపక యంత్రాలు వచ్చి సహకరించనున్నాయి. అయితే సమీపంలో ఉండడంవల్ల ముందుగా ఈ యూనిట్లు చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నాలు చేస్తాయని బీఎంసీ అదనపు కమిషనర్ మోహన్ అడ్తాని చెప్పారు. ఒక్కో మొబైల్ యూనిట్లో ఒక సహాయక కేంద్ర అధికారి, ఒక డ్రైవర్, ఇద్దరు అగ్నిమాపక జవాన్లు శాశ్వతంగా విధులు నిర్వహిస్తారన్నారు. కాగా, నగరంలో ట్రాఫిక్ జాం సమస్య విపరీతంగా పెరిగిపోయింది. అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు, పోలీసు వ్యాన్లు, అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకోవాలంటే భారీ కసరత్తు చేయాలి. అయితే ఎలాంటి ప్రమాదం జరిగిన ముందుగా అక్కడికి చేరుకునేది అగ్నిమాపక వాహనాలే కావడంతో వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నగరంలో 33 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. ఈ ట్రాఫిక్ జాంలో ఫైరింజన్లు దూరం నుంచి ఘటనాస్థలికి రావాలంటే కనీసం అరగంటకుపైనే సమయం పడుతుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీంతో నగర విస్తరణ, జనాభాను దృష్టిలో ఉంచుకుని అదనంగా 26 కేంద్రాలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నగరంలో తగినంత స్థలం దొరక్కపోవడంతో మొబైల్ యూనిట్ల ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చింది. వీటిని ఫ్లైఓవర్ల కిందున్న ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేస్తారు.