డ్రస్ బాగోలేదని డైనింగ్ టేబుల్ ఇవ్వనన్నారట!
కోల్కత్తా : డ్రస్ మంచిగా వేసుకురాలేదట. డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ ఇవ్వనంటోంది ఓ రెస్టారెంట్. మళ్లీ ఆ రెస్టారెంట్‌కు ఎంత పేరు ఉందో తెలుసా.? కోల్ కత్తాలోని పార్క్ స్ట్రీట్‌లో ఆ రెస్టారెంట్ తెలియని వాళ్లుండరు. 60 ఏళ్లుగా సర్వీసులను అందిస్తూ ఐకానిక్‌గా నిలుస్తున్న మోకాంబో రెస్టారెంట్ ప్రస్తుతం జాత్యంహకారం ఆరోపణలతో పాటు పలు విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ రెస్టారెంట్ చేసిన నిర్వాకంపై ఫేస్బుక్లో ఓ కస్టమర్ పూసగుచ్చినట్టు వివరించింది. దీంతో రెస్టారెంట్‌కు వ్యతిరేకంగా నమోదైన ఈ పోస్టుపై 10వేలకు పైగా రియాక్షన్స్, 16వేల షేర్లు, 3వేల కామెంట్లు వెల్లువెత్తుతూ వైరల్ సృష్టిస్తున్నాయి.
దిల్షాన్ హేమ్నాని అనే మహిళ కోల్కత్తా నగరానికి విజిటర్‌గా వచ్చింది. వారం రోజులుగా అవసరార్థం నియమించుకున్న తను, డ్రైవర్ మనీష్ డిన్నర్ కోసం మోకాంబో రెస్టారెంట్‌కు వెళ్లారు. డిన్నర్ టేబుల్ కోసం క్యూలో వేచిఉన్న వీరిని రెస్టారెంట్ స్టాఫ్ అసలు పట్టించుకోలేదు. దీంతో తమకెందుకు టేబుల్ సౌకర్యం కల్పించడం ప్రశ్నించగా సాకులు చెప్పడం మొదలు పెట్టారు రెస్టారెంట్ స్టాఫ్. డ్రైవర్ సరియైన బట్టలు వేసుకోలేదని కొందరు, అతను తాగి ఉన్నాడని మరికొందరు స్టాఫ్ ఆమెతో వాదించారట. జాత్యాంహకార భావనతో రెస్టారెంట్ స్టాఫ్ ఈ మాదిరి వ్యవహరిస్తున్నారని గుర్తించిన హేమ్నాని, రెస్టారెంట్ ఓనర్ సిద్ధార్థ కొథారిని కాంటాక్టు చేసింది.
అయితే తను కూడా ఇదే మాదిరి సమాధానమిచ్చాడు. డ్రైవర్ ధరించిన దుస్తులు బాగాలేవని, ఒకవేళ గెస్టులు శుభ్రంగా లేకపోతే, ఇతర కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వస్తాయంటూ సాకులు చెప్పాడట. రెస్టారెంట్ నిర్వర్తించిన ఈ అమానుష చర్యపై హేమ్నాని ఫేస్బుక్లో వివరిస్తూ ఓ పోస్టు పెట్టింది. ఈ పోస్టుపై స్పందించిన కస్టమర్లు రెస్టారెంట్ నిర్వాకంపై మండిపడుతున్నారు. ఒకవేళ తాను డర్టీగా రెస్టారెంట్‌కు వెళ్తే, అలానే బయటికి పంపిస్తారా అంటూ సుదీప్తో రాయ్ అనే వ్యాపారవేత్త ప్రశ్నించారు. బాయ్‌కాట్ మోకాంబో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కొంతమంది కస్టమర్లు రెస్టారెంట్‌కు మద్దతు పలుకుతున్నారట. ప్రస్తుతం ఈ పోస్టు ఫేస్బుక్లో వైరల్ సృష్టిస్తోంది.