ఉత్తరకొరియా యుద్ధానికి సిద్ధమవుతోందా?
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ కొరియా- యునైటెడ్ స్టేట్స్ సంయుక్త విన్యాసాల ముగింపునకు ముందు కొరియాలో నూతన సైనిక ప్రదర్శన జరిగింది. దీనికి కిమ్ నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ కమాండర్లతో మాట్లాడుతూ ఈ విన్యాసాలకు నిజమైన యుద్ధంలా కసరత్తు చేయాలని ఆదేశించారు. ఈ సమయంలో ఒక నూతన యుద్ధ ట్యాంక్ తన మొదటి ప్రదర్శనలో విజయవంతంగా మందుగుండు సామగ్రిని ప్రయోగించింది. తన కమాండర్ల పనితీరుకు కిమ్ సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.
ఈ విన్యాసాల వివరాలను వెల్లడించిన ఒక నివేదికలో ‘యుద్ధ పరిస్థితులలో సమర్థవంతంగా పనిచేసే ఈ భారీ యుద్ధ ట్యాంకులు ఒకే సారి లక్ష్యాలపై దాడి చేసి, చిధ్రం చేస్తాయని’ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్‌తో పాటు రక్షణ మంత్రి కాంగ్ సున్నామ్తో పాటు సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. సైనిక విన్యాసాల సందర్భంగా కొరియా మీడియా పలు ఫోటోలను విడుదల చేసింది. ఒక ఫోటోలో కొరియన్ నియంత యుద్ధట్యాంక్‌ను పరీక్షించడాన్ని చూడవచ్చు. కిమ్ స్వయంగా ట్యాంక్‌ను నడిపినట్లు మీడియా పేర్కొంది.
మరొక ఫోటోలో కిమ్ లెదర్ జాకెట్ ధరించగా, కమాండర్లు అతని చుట్టూ ఉన్నట్లు కనిపించారు. ఉత్తర కొరియా జెండా కలిగిన యుద్ధ ట్యాంకులు కూడా ఫొటోలలో కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక ఉమ్మడి సైనిక విన్యాసం ముగియనున్న తరుణంలో ఈ కసరత్తు కనిపించింది. నవంబర్‌లో ప్యోంగ్యాంగ్ ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో 2018 అంతర్-కొరియా సైనిక ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాలకు ఫ్రీడమ్ షీల్డ్ ఎక్స్‌ర్‌సైజ్’ అని పేరు పెట్టారు. లైవ్ ఫైర్ డ్రిల్‌లో పలు యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, ఎఫ్ఏ-50 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి.