ఎయిర్పోర్టులో టెర్రరిస్టులు...?!
హైదరాబాద్ : విమానాశ్రయంలోకి ఒక్కసారిగా ఉగ్రవాదులు చొరబడ్డారు.. ఓ వైపు సీఐఎస్‌ఎఫ్ భద్రతదళాలను మొహరించారు.. మరోవైపు పోలీసులు.. అగ్నిమాపక శాఖ అధికారులు.. వైద్యులు ఇలా.. అన్నిశాఖల అధికారులు అప్రమత్తమయ్యారు.. ఇదంతా నిజం కాదండీ బాబోయ్.. మాక్‌డ్రిల్‌లో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాయుధులైన ఉగ్రవాదులు చొరబడితే రక్షణ విభాగ శాఖలు వెంటనే అప్రమత్తం కావల్సిన తీరుపై మాక్‌డ్రిల్ నిర్వహించారు.
విమానాశ్రయంలోని ఆయా టెర్మినళ్ల వద్ద జరిగిన ఈ మాక్‌డ్రిల్‌లో పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ బలగాలతోపాటు ఇతర శాఖల అధికారులంతా.. నిజంగానే విపత్కర పరిస్థితి ఎదురైనట్లుగా స్పందించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మాక్‌డ్రిల్ మధ్యాహ్నం 12.40 గంటల వరకు కొనసాగింది. డ్రిల్ కారణంగా ఎయిర్‌పోర్టులోని ఇతర కార్యక్రమాలకు ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.