టెన్షన్.. టెన్షన్..
కాకినాడ క్రైం :డెంగీ భూతం జిల్లాను వణికిస్తోంది. వివిధ ప్రాంతాలకు చెందిన 38 మంది డెంగీతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కె.గంగవరం మండలం వాసాలరేవును 20 రోజులుగా జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు హడావుడిగా అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డెంగీ అనుమానితుల్ని వెంటనే కాకినాడ ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్)కి తరలిస్తున్నారు. మంగళవారం వరకూ జీజీహెచ్‌కు 26 మంది పెద్దలు, తొమ్మిది మంది పిల్లలు వచ్చారు. వారికి మాక్ ఎలీషా టెస్ట్ నిర్వహించగా 22 మంది పెద్దలు, ఎనిమిది మంది పిల్లలకు డెంగీ సోకినట్టు నిర్ధారణ అయింది. కాకినాడలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో ఎనిమిదిమంది డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. కాకినాడ రూరల్ మండలం పండూరుకు చెందిన ముగ్గురు, సామర్లకోట మండలం పనసపాడుకు చెందిన ఐదుగురు ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ఈ ఏడాది ఇప్పటివరకూ ఆరుగురు మృతి!
డెంగీ లక్షణాలతో ఈ ఏడాది ఇప్పటివరకూ ఆరుగురు మృతి చెందినట్టు అనధికార సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. అయితే అధికారులు ముగ్గురు మాత్రమే మృతి చెందారని చెబుతున్నారు. తాజాగా అల్లవరానికి చెందిన అనంతలక్ష్మి (65) డెంగీ లక్షణాలతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 13 రాత్రి మృతి చెందింది.
అధికార యంత్రాంగంపైవిమర్శల వెల్లువ
జిల్లాను డెంగీ భూతం పట్టి పీడిస్తున్నా అధికార యంత్రాంగం సరైన చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాసాలరేవులో పారిశుధ్యం అధ్వానంగా ఉన్నప్పటికీ పంచాయతీ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అలాగే తాగునీరు కలుషితం కావడంతో గ్రామానికి చెందిన సుమారు 70 మంది 20 రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నారని చెబుతున్నారు. అయినప్పటికీ వైద్య, ఆరోగ్య, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్న బాధితులు
జ్వరంతో బాధపడుతున్న చాలామంది ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉన్న ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రి, ఆరోగ్య కేంద్రాల్లో వారిని పరీక్షించి డెంగీ సోకినట్టు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరికీ వైద్యాధికారులు మందులు అందిస్తున్నారు. అయితే వాటిని వాడవద్దని కొంతమంది ఆర్ఎంపీలు చెప్పడంతో రోగులు ఆ మందులు వాడడంలేదు. దీంతో వారికి ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతోంది. అటువంటి ఆర్ఎంపీలను నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
లక్షల్లో ఖర్చు
ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ చికిత్సకు సుమారు రూ.2 లక్షలు పైగా ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఖరీదైన యాంటీబయాటిక్స్‌కు, ప్లేట్స్‌లెట్స్ ఎక్కించడానికి లక్షల్లో ఖర్చవుతుందని చెబుతున్నారు. డెంగీకి పూర్తి స్థాయి వైద్యం కాకినాడ జీజీహెచ్‌లో అందుబాటులో ఉంది. దీనిపై అవగాహన లేకపోవడంతో పేద, మధ్యతరగతివారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు.