కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ మెయిన్స్ ప్రిపరేషన్లో ‘రాయడం ప్రాక్టీస్’ చేయడమనేది కీలకమైన అంశం. ఎందుకంటే ఓ అంశానికి సంబంధించి ఎంతటి పరిజ్ఞానం, అవగాహన ఉన్నప్పటికీ రాతపూర్వకంగా సరిగా వ్యక్తీకరించకుంటే ఫలితం శూన్యం! వీలైనన్ని మాక్‌టెస్ట్‌లు రాయడం ద్వారా లోపాలను అధిగమించి, రాత తీరును మెరుగుపరుచుకోవచ్చు.
సమకాలీన అంశాలపై ఎస్సేలు రాసి, నిపుణులతో దిద్దించుకోవాలి. దీనివల్ల బలాలు, బలహీనతలు తెలుస్తాయి. మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై స్పష్టత వస్తుంది.
రోజూ జనరల్ స్టడీస్, ఆప్షనల్ ప్రిపరేషన్‌కు సమయం కేటాయించాలి. ఉదయం జనరల్ స్టడీస్ చదివితే, సాయంత్రం ఆప్షనల్ సబ్జెక్టు చదవాలి.
సమయం ఎక్కువగా అందుబాటులో ఉండదు కాబట్టి ఒకట్రెండు పేపర్లతోపాటు ఒక ప్రామాణిక మ్యాగజైన్‌కు పరిమితమవ్వాలి. ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి.
ఎంత ఎక్కువ చదివామనే దానికంటే చదివిన విషయం ఎంత వరకు గుర్తుంది అనేది ప్రధానం. అందుకే పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
సామాజిక, ఆర్థిక సర్వే; బడ్జెట్, ముఖ్యమైన కమిటీల నివేదికలు వంటి వాటిని అధ్యయనం చేయడం ముఖ్యం. రాష్ట్రపతి, ప్రధానిమంత్రి ప్రసంగాలపై దృష్టికేంద్రీకరించాలి. ఎందుకంటే వీటి ద్వారా వివిధ అంశాలకు సంబంధించిన ప్రభుత్వ ఆలోచన ధోరణి తేటతెల్లమవుతుంది.
సమాధానం రాసేటప్పుడు ఒక ‘ఆఫీసర్’గా రాయాలి. ఆఫీసర్ అయినట్లు ఊహించుకుని సమాధానం రాస్తే మరింత ప్రాక్టికల్‌గా రాసే అవకాశం లభిస్తుంది.
ఏదైనా సమస్య పరిష్కారానికి సూచనలు ఇచ్చేటప్పుడు క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్‌గా అమలు చేయడానికి వీలయ్యే వాటిని సూచించాలి.
సమాధానాల్లో నెగిటివ్ అభిప్రాయాలను రాయొద్దు. అన్నీ సమస్యలే.. అంతా అవినీతిమయం, ఏమీ చేయలేం.. వంటి నిరాశాజనక అభిప్రాయాలను కాకుండా ‘‘తప్పులున్నాయి.. వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశముంది..’’ అనే సానుకూల ధోరణిని ప్రతిబింబించాలి.
జనరల్ స్టడీస్ పేపర్-4 ప్రిపరేషన్‌కు ఇగ్నో మెటీరియల్‌ను సేకరించి వాటిలోని కేస్ స్టడీలను అధ్యయనం చేయాలి.