భక్తులకు పాద భాగ్యం
పాడేరు,న్యూస్‌లైన్: నేటి నుంచి మోదకొండమ్మ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయాన్ని శోభాయమానంగా ఆలయం అలంకరించారు. ఈ నెల 13న అనుపు ఉత్సవం ఉంటుంది. ఉత్సవ విగ్రహం, పాదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఉత్సవాల సమయంలో విగ్రహం, పాదాలను నెత్తిన పెట్టుకొని మోసే భాగ్యం ఉంటే అంతా మంచే జరుగుతుందనే నమ్మకం పూర్వం నుంచి భక్తుల్లో నెలకొంది. అయితే వీఐపీల తాకిడి అధికంగా ఉండటంతో సామాన్య భక్తులు ఉత్సవ విగ్రహం, పాదాలను తాకేందుకు కూడా వీలు లేని పరిస్థితి వారిని బాధిస్తోంది. లక్షలాది మంది భక్తులు ఉత్సవానికి తరలి వస్తున్నా అందరికి మోసే భాగ్యం మాత్రం లేదు. కానీ ఈ ఏడాది ఎన్నికల కోడ్ కారణంతో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఉత్సవ కమిటీ వీఐపీలుగా గుర్తించడం లేదు.
సామాన్య భక్తులే తమకు వీఐపీలని, అందరికీ ఉత్సవ విగ్రహం, పాదాలను మోసే అవకాశం కల్పిస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కురుసా నాగభూషణం, బత్తిన కృష్ణలు ప్రకటించారు. పోలీసుశాఖ కూడా రోప్‌వే ఏర్పాటు చేసి ఉత్సవ విగ్రహం, పాదాలను భక్తులు తాకే విధంగా ఏర్పాట్లు చేస్తుంది. దీంతో భక్తులో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.