మోడల్ మున్సిపాలిటీగా గజ్వేల్
గజ్వేల్: గజ్వేల్ మున్సిపాలిటీ(నగర పంచాయతీ)ని రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దడానికి సంబంధిత అధికారులు కసరత్తును ప్రారంభించారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పట్టణాన్ని దేశంలోనే ‘బంగారు తునక’గా మారుస్తానని హామీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే కార్యాచరణ సిద్ధమవుతోంది.
తొలి దశ అభివృద్ధికి రూ.266 కోట్లతో ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు అందజేశారు. ఇందులో మౌలిక వసతులతోపాటు రింగ్ రోడ్డు ప్రతిపాదనలున్నాయి. వీటితో గోదావరి సుజల స్రవంతి పథకం నీటిని రంగారెడ్డి జిల్లా షామీర్పేట మండలం ఘనపూర్ వద్ద ట్యాప్ చేసి ఇక్కడికి తీసుకురావడానికి రూ.70.58 కోట్లతో ప్రతిపాదనలు
సిద్ధమయ్యాయి. కొద్ది రోజుల్లోనే ఈ ప్రతిపాదన సీఎం ఆమోదం పొందనుంది. ఈ పథకం అమలైతే గజ్వేల్ నగర పంచాయతీ వాసులకు 24 గంటలూ నీళ్లు వచ్చే అవకాశముంది. అంతేకాకుండా నగర పంచాయతీని క్లీన్ టౌన్‌గా తీర్చిదిద్దడానికి చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటుకూ కసరత్తు జరుగుతోంది.
సేకరించిన చెత్తను కంపోస్టుగా మార్చడానికి కూడా ఓ సంస్థ ముందుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా రైతు బజార్‌ను నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వీటన్నింటీతోపాటు గజ్వేల్‌ను పచ్చదనంతో నింపేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ అంశాలపై చర్చించడానికి నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో సమావేశమయ్యారు. కొద్ది రోజుల్లో అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ అమలుకానుందని సీఎం వెల్లడించినట్టు తెలుస్తోంది.