modern facilities
-
భూటాన్‌లో ఆస్పత్రిని ప్రారంభించిన మోదీ
థింపు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివా రం భూటాన్ రాజధాని థింపూలో అత్యాధు నిక వసతులతో నిర్మించిన ఆస్పత్రిని ఆ దేశ ప్రధాని త్సెరింగ్ టోబ్గేతో కలిసి ప్రారంభించారు. వివిధ విభాగాలకు చెందిన మొత్తం 150 పడకలతో కూడిన గ్యాల్ట్సుయెన్ జెట్సున్ పెమా వాంగ్‌చుక్ మాతా శిశు హాస్పిటల్‌ను భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించారు. నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలను అందించే ఈ ఆస్పత్రి ఎన్నో కుటుంబాలకు ఆశా కిరణం వంటిదని అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భారత్–టిబెట్ల ఆర్థిక సహకారానికి ఒక గొప్ప ఉదాహరణ ఈ ఆస్పత్రి అని తెలిపారు. భారత్ సాయంతో మొదటి దశలో రూ.22 కోట్లతో నిర్మించిన ఈ ఆస్పత్రి 2019 నుంచి సేవలందిస్తోంది. భారత్ అందించిన మరో రూ.119 కోట్లతో చేపట్టిన ఆస్పత్రి రెండో దశ నిర్మాణం తాజాగా పూర్తయిందని విదేశాంగ శాఖ తెలిపింది. ఎయిర్‌పోర్టులో వీడ్కోలు పలికిన రాజు రెండు రోజుల పర్యటనకు గాను ప్రధాని మోదీ శుక్రవారం భూటాన్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాజు జిగ్మే ఖేసర్ వాంగ్‌చుక్ ప్రధాని మోదీకి అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో’ను అందజేశారు. మోదీతో ఆయన ప్రత్యేకంగా సమావేశమ య్యారు. పర్యటన ముగించుకుని తిరిగి శనివారం మధ్యాహ్నం మోదీ తిరుగు పయనమయ్యారు. ఆయన వెంట ప్రధాని త్సెరింగ్ టోబ్గేతోపాటు రాజు జింగ్మే ఖేసర్ వాంగ్‌చుక్ స్వయంగా పారో విమానాశ్ర యానికి వచ్చారు. వీరిద్దరూ ప్రధాని మోదీకి ఘనంగా వీడ్కోలు పలికారు. -
ఎవరెస్ట్ యమ డేంజర్.. పది వేల అడుగులు దాటితే..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా వెండి కొండలా ధగధగలాడిపోతూ మంచుతో నిండిపోయిన ఈ పర్వత శిఖరం చేరుకోవడమంటే ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకోవడమే. అందుకే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నా, ప్రాణాలతో తిరిగి వస్తామన్న భరోసా లేకపోయినా ప్రతీ ఏడాది ఎందరో సాహసికులు ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవాలని తమ దేశ జెండాని పాతాలని ఆరాటపడుతుంటారు. మౌంట్ ఎవరెస్ట్‌ను తొలిసారి ఎక్కడం ప్రారంభించి 70 ఏళ్లయింది. 1953 సంవత్సరం మే 29న న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ భారత్‌కు చెందిన టెన్జింగ్ నార్గేలు ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరుకున్నారు. ఈ 70 ఏళ్లలో కనీవినీ ఎరుగని మార్పులు వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఆధునిక సదుపాయాలు చోటు చేసుకోవడంతో ఎవరెస్ట్ అధిరోహించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్ పర్వతారోహకులకు ఈ ఏడాది నేపాల్ ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు మంజూరు జారీ చేయడంతో ఎవరెస్ట్ అధిరోహణ మరింత ప్రమాదకరంగా మారింది. అసాధారణ రీతిలో 900 మంది పర్వతారోహకులకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొండపై భారీగా ట్రాఫిక్ జామ్‌లు కనిపించాయి. శిఖరాగ్రం చేరుకోవాలంటే 26 వేల అడుగులు పైకి వెళ్లాలి. పది వేల అడుగులు దాటితే ఇంక మృత్యువు ముఖంలోకి అడుగు పెట్టినట్టే. అంత ఎత్తులో ఆక్సిజన్ సరిగా అందదు. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారుతుంది. రక్తం గడ్డ కట్టేలా వాతావరణం మైనస్ 20 డిగ్రీలకు పడిపోతుంది. శారీరకంగా ఎంత ఫిట్నెస్ ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి ప్రాణాలు పోతాయి. సముద్ర మట్టానికి అంత ఎత్తుకు చేరుకుంటే ఒక్కోసారి మెదడు, ఊపిరితిత్తులకు వాపు వచ్చి శరీరంపై స్వాధీనం కోల్పోతారు. ఈ సారి ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు మంచులో గల్లంతయ్యారు. ఇటీవల ఈ స్థాయిలో మరణాలు ఎప్పుడూ సంభవించలేదు. ‘‘ఒకేసారి పర్వతారోహకులు కొండ ఎక్కుతూ ఉంటే వారికి ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆక్సిజన్ ఏర్పాటు చేయడం అత్యంత ముఖ్యం. మా ద్వారా ఎవరెస్ట్ అధిరోహించే పర్వతారోహకులెవరూ ఇప్పటివరకు ఏ సమస్య ఎదుర్కోలేదు’’అని ఆస్ట్రియాకు చెందిన లుకాస్ ఫర్టెన్‌బాచ్ అనే కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏడాది తమ సంస్థ తరఫున 100 మంది దిగ్విజయంగా ఎవరెస్ట్ ఎక్కి వచ్చారని చెప్పారు. వాతావరణ మార్పులతో పెరుగుతున్న ముప్పు ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు ఎవరెస్ట్ అధిరోహకులకు అతి పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. 1979 నుంచి చూస్తే గత 40 ఏళ్లలో ఎవరెస్ట్‌పై ఉష్ణోగ్రతలు సగటున 2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగాయి. దీంతో హిమానీ నదాలు కరిగి మంచు చరియలు విరిగి పడటం వంటిæ ప్రమాదాలు ముంచుకొస్తాయి. కొన్నేళ్లుగా ఎవరెస్ట్ అధిరోహించే వారు ఈ మార్పుల ప్రభావం విపరీతంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పదేళ్లలో ఎవరెస్ట్ ఎక్కే మార్గం ఎలా మారుతుందో ఊహకి కూడా అందడం లేదని నేపాల్ మౌంటనీరింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆంగ్ షెరింగ్ పేర్కొన్నారు. ఆదాయానికి ఆశపడి..? నేపాల్‌కు పర్యాటకమే ప్రధాన ఆధారం. ఎవరెస్ట్ అధిరోహణ నుంచే అధికంగా ఆదాయం సమకూరుతుంది. పశ్చిమ దేశాల నుంచి వచ్చే పర్వతారోహకుల నుంచి11 వేల డాలర్లు (రూ.9 లక్షలు) చొప్పున వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే కాకుండా వెంట తీసుకు వెళ్లే ఆక్సిజన్, ఆహారం, గైడ్ల కోసం మొత్తంగా ఒక్కొక్కరికి 27 వేల డాలర్లు (దాదాపుగా రూ.22 లక్షలు) ఖర్చు అవుతుంది. అయితే నేపాల్ ప్రభుత్వం ఆదాయానికి ఆశపడే అనుమతులు ఎక్కువగా ఇస్తున్నామన్న ఆరోపణల్ని తోసిపుచ్చింది. ప్రతీ పర్వతారోహకుడి ప్రాణ రక్షణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, బేస్ క్యాంప్‌లో వైద్యులు, అధికారుల బృందం ఈ సాహస యాత్రను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. ఏదైనా సాధ్యమే ప్రపంచంలో ఎవరెస్ట్ మ్యాన్‌గా పేరు పొందిన నేపాల్‌కు చెందిన షెర్పా కామి రిటా 28 సార్లు ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా నిలిచి తన రికార్డు తానే బద్దలు కొట్టాడు. ఈ ఏడాది వారం రోజుల తేడాలో రెండు సార్లు శిఖరాగ్రానికి చేరుకున్నాడు. తన రికార్డుని పసాంగ్ దావా అనే షెర్పా సమం చేయడంతో ఆ మరుసటి రోజే మళ్లీ ఎక్కి అత్యధికసార్లు ఎవరెస్ట్‌ని ఎక్కిన వ్యక్తిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక బ్రిటన్‌కు చెందిన మాజీ సైనికుడు హరి బుధా మాగర్ కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించాడు. మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు. ఒక మలేసియన్ పర్వతారోహకుడు అనారోగ్యం బారిన పడితే నేపాలీ గైడ్ గెల్జీ అతనిని మోసుకుంటూ కొండ దిగడం మరో అరుదైన ఫీట్‌గా నమోదైంది. ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరితే ప్రపంచాన్నే జయించినంత ఆనందం వస్తుంది కాబట్టే ప్రాణాలకు తెగించి మరీ ఎవరెస్ట్ ఎక్కే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నారావారి పల్లె ఎంపిపి స్కూలులో ఆధునిక సౌకర్యాలు
-
ప్రజారోగ్యానికి పెద్దపీట
సాక్షి, బొబ్బిలి: ప్రజా సంక్షేమ పథకాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, అవనీతి రహిత పాలన దిశగా సాగుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం... ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోంది. అందుబాటులో ఉన్న ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యసేవలందించాలని నిర్ణయించింది. సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు నియోజకవర్గానికి రెండు ఆస్పత్రులను ఆధునిక హంగులతో ఆదర్శవంతగా తీర్చిదిద్దనున్నారు. రాష్ట్రం లోని అన్ని నియోజకవర్గాల్లో మోడల్ ఆస్పత్రుల రూపకల్పనకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ కోవలోనే జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 18 పీహెచ్‌సీలకు భవనాలు, ఇతర సౌకర్యాలను సమకూర్చేందుకు ఏపీహెచ్‌ఎంఐడీసీకి జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు పంపించింది. నియోజకవర్గానికి రెండు... రాష్ట్ర ప్రభుత్వం మొదట నియోజకవర్గానికి ఒక ఆస్పత్రిని అన్ని హంగులూ, సౌకర్యాలు కల్పిం చాలని నిర్ణయించింది. అయితే, ఉన్నతాధికారులతో సంప్రదించిన సీఎం నాయకత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం నియోజకవర్గానికి రెండు ఆస్పత్రులను ఎంపిక చేసి అక్కడి సౌకర్యాలను మెరుగు పర్చి మోడల్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలని భావించింది. ఇందుకోసం రాష్ట్ర స్థాయి బృందం ఇటీవలే పర్యటించి ఆస్పత్రులను గుర్తించింది. ఆరు ఆస్పత్రులకు కొత్త భవనాలు.. ఎంపిక చేసిన ఆస్పత్రులకు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో ఆరు పీహెచ్‌సీలను పూర్తిగా కొత్త భవనాలతో మార్పు చేయనున్నారు. అందులో తోణాం, మామిడి పల్లి, శం బర, మక్కువ, కొత్తవలస, చల్లపేట పీహెచ్‌సీలు ఉన్నాయి.ఈ భవనాలు పాత బడిపోవడంతో పా టు రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుందని వీటిని పూర్తి కొత్త భవనాలతో రూపొందించనున్నారు. సకల సౌకర్యాలు.. మోడల్ ఆస్పత్రుల్లో తాగునీటితో పాటు ఫర్నిచర్, అధునాతన పరికరాలు, పరీక్షా పరికరాలు, ల్యాబ్‌లు, ప్రహరీలు, మందుల ప్రతిపాదనలు వంటి అన్ని సౌకర్యాలనూ కల్పించనున్నారు. జిల్లాలోని మొత్తం 62 పీహెచ్‌సీలను పరిశీలించిన అధికారుల బృందం 18 పీహెచ్‌సీలను గుర్తించి మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్.. ముందుగా నియోజకవర్గానికో స్పెషల్ ఆఫీసర్‌ను ప్రభుత్వం నియమించింది. వీరు ఆస్పత్రుల్లో సౌకర్యాలు, జ్వరాలపై పరిశీలనలు, ఏఏ ప్రాంతాల్లో ఏఏ రోగులున్నారు... ఎంత వరకు నివారిస్తున్నారన్న వివరాలను జిల్లా వైద్యాధికారికి నివేదిస్తారు. డిసెంబర్ నుంచి పనుల ప్రారంభం.. జిల్లాలో 9 నియోజకవర్గాల్లో రెండేసి మోడల్ ఆస్పత్రుల ఏర్పాటుకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగా 18 పీహెచ్‌సీలను గుర్తించాం. అందులో ఆరు ఆ స్పత్రులకు కొత్త భవనాలు కూడా ప్రతిపాదించాం. డిసెంబర్ నాటికి పనుల ప్రారంభించే అవకాశం ఉంది. – డాక్టర్ కె.విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ, విజయనగరం -
సౌకర్యాలకు ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: జిల్లాలో దూసుకువస్తున్న స్థిరాస్తి వెంచర్లలో వ్యాపారులు ఆధునిక సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇరుకు రహదారులు, కాలుష్యం, ఇతర అసౌక్యాలకు నిలయంగా ఉన్న నగర జీవితాన్ని మరిచిపోయేలా మదిని మైమరిపించే అనేక అత్యాధునిక సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందమైన ప్రకృతిని వెంచర్లలో నెలకొల్పి కలల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. 40 అడుగుల రోడ్లు, ఫైవ్ స్టార్ సౌకర్యాలు, అందమైన ఆర్కిటెక్చర్ డిజైన్లకు ప్రాధాన్యం ఇచ్చేలా వెలుస్తున్న ఈ వెంచర్లు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. స్థలం ఎంపిక నుంచి లే అవుట్ డిజైన్, మౌలిక వసతుల రూపకల్పన, పర్యావరణానికి నేడు అందరూ ప్రాధాన్యం ఇస్తుండటంతో స్థిరాస్తి వ్యాపారులు కూడా ఆ మేరకు కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా కొత్త వెంచర్లను వేస్తున్నారు. ఖర్చు చేసే ప్రతి రూపాయికి అధిక విలువ తెచ్చేందుకు ప్రాధాన్యమిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. పచ్చని మొక్కలతో.. నగర జీవితమంటే ప్రధానంగా కాలుష్యం చెంతనే అనేది నానుడి. జగమెరిగిన ఈ సత్యాన్ని కలలో సైతం రానీయకుండా నగర శివారు ప్రాంతాల్లో కాలుష్యానికి చెక్ పెడుతూ సరికొత్త ఏర్పాట్లు చేస్తున్నారు. విశాలమైన రోడ్లపై ఇరువైపులా పచ్చని మొక్కలు పెంచటమే కాకుండా వాటి పర్యవేక్షణకు సంస్థలే ప్రాధాన్యం ఇస్తున్నాయి. పచ్చని పార్కులు ఆపై అందమైన డిజైన్లతో కొనుగోలుదారులకు సౌకర్యాల కల్పనలో పోటీపడుతున్నాయి. అతి తక్కువ ధరలో వాయిదాల పద్ధతిలో సైతం ఇళ్ల స్థలాలు లభ్యం కావటంతో మధ్య తరగతి కుటుంబాలు సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు.. వెంచర్ల ఏర్పాటులో రక్షణకు కూడా సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఆకర్షణీయమైన ముఖ ద్వారంతో స్వాగతం పలుకుతూ 60, 40, 40 ఫీట్ల రహదారులను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ ఇబ్బంది లేకుండా భూగర్భ కేబుల్స్ వేయటంతో పాటూ కొన్ని సంస్థలు ప్రహారీ గోడ మీద సౌర విద్యుత్ కంచెను ఏర్పాటు చేస్తున్నాయి. 24 గంటల పాటు సెక్యూరిటీ ఏర్పాటుతో కొనుగోలుదారులు ప్రశంసలు పొందుతున్నారు. స్టార్ హోటల్ వసతులు.. నేటి యువత అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తోంది. ఇంటి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఉద్యోగ ఒత్తిడి నుంచి సాంత్వన పొందే ఇంటి నిర్మాణాలపై ఆసక్తి చూపిస్తోంది నేటి యువత. దీనికి తగ్గట్టుగానే కొంత మంది వ్యక్తిగత గృహాలు ఇష్టపడుతుంటే, మరికొంత మంది అపార్ట్మెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు తగ్గ ట్టుగానే వ్యాపారులు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. త్రిబుల్ బెడ్‌కు డిమాండ్ వ్యక్తిగత గృహాలైనా సరే త్రిబుల్ బెడ్రూమ్ నిర్మాణం వైపు నేటి యువత ఆసక్తి చూపిస్తుంది. పార్కింగ్, పచ్చని ఆవరణకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థలు 300–500 చదరపు గజాల విస్తీర్ణమున్న ప్లాట్లను వేస్తున్నారు. అందమైన డిజైన్లతో విల్లాలతో పోటీ పడే ఇటువంటి నిర్మాణాలు నేటి యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఉడెన్ ఫ్లోరింగ్ అందానికి, హోదాకి చిహ్నం ఉడెన్ ఫ్లోరింగ్. దీని నిర్వహణ పెద్ద కష్టమేమీ కాదు. దుమ్ము, ధూళి, ఇసుక, మట్టి వంటివి ఉడెన్ ఫ్లోర్‌కు శత్రువులు. ఇవి గీతలను సృష్టించడమే కాకుండా కాంతి విహీనం చేస్తాయి. అందుకే అవి దరిచేరకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తరుచుగా మెత్తటి గుడ్డతో శుభ్రం చేస్తుండాలి. ఫ్లోర్‌ను వ్యాక్స్, వార్నిష్, పాలియుథరిన్తో ఫినిషింగ్ చేయించుకుంటే.. ఆ నేల మీద ఆహారపదార్థాలు, ద్రవాలు పడకుండా జాగ్రత్త వహించాలి. లేదంటే గచ్చు కాంతి మాయం అవుతుంది. పొరపాటున సిరా లేదా నీళ్లు ఒలికితే ముందుగా ఉడెన్ ఫ్లోర్ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. తర్వాత వెనిగర్ కలిపిన నీటిలో ముంచిన మెత్తటి గుడ్డతో తుడిచేయాలి. అనంతరం పొడి బట్టతో తుడిస్తే సరిపోతుంది. -
పోలీసు వాహనాలకు కెమెరా కళ్లు
సైబరాబాద్ పోలీసులు ఆధునిక హంగులు సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పైన సీసీ కెమెరాలు, లోపల సీసీ టీవీలు ఉండే వాహనాలను వాడబోతున్నారు. గురువారం సాయంత్రం వీటిని ప్రారంభించనున్నారు. నేరాల అదుపు, అసాంఘిక శక్తుల కట్టడికి ఇవి తాజా అస్త్రాలు కానున్నాయని భావిస్తున్నారు. -
తీరప్రాంత గస్తీకి సుస్తీ!
మరమ్మతులకు నోచుకోక తీరానికే పరిమితమవుతున్న నౌకలు సాక్షి, ముంబై: 26/11 సంఘటన తర్వాత తీరప్రాంత గస్తీని మరింత పటిష్టం చేస్తామంటూ గొప్పలు చెప్పుకున్న నేతలు, అధికారులు ఇప్పుడు ఆ విషయాన్నే మర్చిపోయారు. సముద్ర తీరాల భద్రత కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన గస్తీ నౌకలు మరమ్మతులకు నోచుకోలేక తీరానికే పరిమితమవుతున్నాయి. మరికొన్ని రోజులు అవి తీరంలోనే ఉంటే పూర్తిగా శిథిలావస్థకే చేరే అవకాశముం దని పలువురు హెచ్చరిస్తున్నారు. హోంశాఖ కూడా వీటిపై దృష్టి పెట్టడం లేదని, 26/11 సంఘటన పునరావృతమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. పరిపాలన విభాగం నిర్లక్ష్యంవల్ల జరుగుతున్న ఈ నిర్వాకంతో తగినన్ని నౌకలు అందుబాటులో లేక తీరప్రాంతాల్లో పూర్తిస్థాయిలో గస్తీ నిర్వహించలేకపోతున్నారు. 2008, నవంబర్ 26న ఉగ్రవాదులు నగరంలోకి చొరబడి మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. సముద్ర మార్గం మీదుగా కుబేర్ పడవలో నగరంలో చొరబడిన 10 మంది ఉగ్రవాదులు వంద మందికిపైగా నగరవాసులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో తీరప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సదుపాయాలున్న గస్తీ నౌకలను కొనుగోలు చేసిం ది. రాష్ట్రంలో 570 కి.మీ. సముద్ర తీర ప్రాంతం విస్తరించి ఉంది. అందులో దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబైకి 114 కి.మీ. తీర ప్రాం తం ఉంది. తీర ప్రాంతాలకు ఆనుకొని ఉన్న ఆరు జిల్లాల్లో కొత్తగా 12 పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశా రు. ప్రస్తుతం తీరప్రాంతాల్లో మొత్తం 37 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. కోస్టు గార్డు అధీనంలో దాదాపు 91 గస్తీ నౌకలు ఉన్నాయి. ఇవి తీర ప్రాంతాల వెం బడి ప్రతీరోజు సుమారు మూడు వేలకుపైగా ట్రిప్పులు కొడతాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వా నికి చెందిన 12, 5 టన్నులు ఇలా వేర్వేరుగా 24 గస్తీ నౌకలు ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చూసుకుం టున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి 12 మీటర్ల పొడవున్న నౌకలు ఏడు, 9.5 మీటర్ల పొడవున్న 22 నౌకలు ఉండగా వీటి నిర్వాహణ బాధ్యతలు మెరైన్ ప్రంటియర్స్ కంపెనీకి అప్పగించారు. ఈ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం మే 16న ముగి సింది. ఇంతవరకు గడువు పెంచకపోవడంతో గస్తీ నౌకలకు మరమ్మతులు జరగడం లేదు. ఫలితంగా 19 నౌకలు ఒడ్డుకే పరిమితమయ్యాయి. ఒడ్డున పడి ఉన్న నౌకలకు స్టార్టింగ్ ట్రబుల్, కొన్నింటికి గేర్ బాక్స్, ఇంజిన్ అయిల్ లీకేజీ తదితర సమస్యలున్నాయి. గడువు పొడిగిస్తేనే ఇవి మరమ్మతులకు నోచుకుంటాయని, తీరప్రాంత భద్రత పటిష్టమవుతుందన్నారు. -
రూ.12 కోట్లతో ‘కార్మిక’ అధ్యయన కేంద్రం
రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి పరమేశ్వర నాయక్ సాక్షి, బెంగళూరు : కార్మికుల సమస్యలకు సరైన పరిష్కా రాలు కనుగొనేందుకు నిరంతర అధ్యయనాల అవసరమని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి పరమేశ్వర నాయక్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కార్మిక అధ్యయన కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. అంతేకాక ఆ కేంద్రం ఏర్పాటుకు రూ.12.60 కోట్ల నిధులను విడుదల చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘అసంఘటిత రంగాల్లోని కార్మికుల సామాజిక భద్రత’ అనే అంశంపై గురువారమిక్కడ ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కేంద్రం ద్వారా కార్మికుల సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం సులభతరమవుతుందని అన్నారు. అసంఘటిత కార్మిక భద్రతా మండలి ఇప్పటికే 43 విభిన్న రంగాల్లోని కార్మికులను గుర్తించిందని చెప్పారు. కార్మికుల సంక్షేమాన్ని కోరుకునే సంఘాలు సైతం ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పరమేశ్వర నాయక్ సూచించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ వర్క్‌షాప్‌లో కార్మిక సంఘాల నేతలు, అధికారులు కలిసి చర్చించి కార్మికుల సమస్యల పరిష్కారానికి సరైన సలహాలు, సూచనలను ప్రభుత్వానికి అందజేయాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రామమూర్తి, అడిషనల్ డెరైక్టర్ జింకలప్ప తదితరులు పాల్గొన్నారు.