యంత్రం... సేద్యపు మంత్రం
- వ్యవసాయంలో పెరుగుతున్న యాంత్రీకరణ
- యాంత్రీకరణ పథకం అమలుతో జిల్లాలో విప్లవాత్మక మార్పులు
- సబ్సిడీ పరికరాల కోసం పదేళ్లలో రూ.39 కోట్లు ఖర్చు
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యవసాయ రంగంలో ఇటీవల యాంత్రీకరణ పెరుగుతోంది. పెద్ద రైతులే కాకుండా చిన్న,సన్నకారు రైతులు కూడా అత్యాధునిక యంత్రాలు, పనిముట్లను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీతో పరికరాలు అందజేస్తూ..వ్యవసాయ యాంత్రీకరణ దిశగా రైతులను ప్రోత్సహిస్తోంది. ఉపాధి హామీ పథకం, కరువు పరిస్థితుల వల్ల వలసలు పెరగడం.. తదితర కారణాలతో ఇటీవల వ్యవసాయ కూలీల కొరత ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం ముందుకు సాగాలంటే యంత్ర పరికరాలు, ఆధునిక సామగ్రిపై ఆధారపడక తప్పడం లేదు. స్ప్రేయర్లు మొదలుకుని డీజిల్ ఇంజన్లు, మినీ ట్రాక్టర్లు, రోటోవీటర్లు, కల్టివేటర్లు, గుంటకలు, గొర్రు, సీడ్ డ్రిల్లర్లు, నూర్పిడి, పంటకోత యంత్రాలు తదితర 70 రకాల యంత్ర పరికరాలను రైతులు ఉపయోగిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్నేళ్లుగా యాంత్రీకరణ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు పెంచుతూ వస్తున్నాయి. గత పదేళ్లలో రూ.39 కోట్లు ఖర్చు చేశాయి. అగ్రోస్ ద్వారా టెండర్లు పిలిచి ధరలు నిర్ణయించిన తరువాత అధీకృత తయారీ కంపెనీల ద్వారా యంత్ర పరికరాలను రాయితీతో రైతులకు అందజేస్తున్నారు. ఎద్దులతో నడిచే వాటికి 50 శాతం, ట్రాక్టర్‌తో నడిచే యంత్రాలకు, నూర్పిడి మిషన్లు, పంటకోత యంత్రాలకు గరిష్టంగా రూ.45 వేల వరకు రాయితీ వర్తింపజేస్తున్నారు.
సాధారణ యాంత్రీకరణ పథకమే కాకుండా రాష్ట్రీయ కృషివికాస యోజన (ఆర్కేవీవై) కింద అమలు చేస్తున్న యంత్రలక్ష్మి పథకం ద్వారా, అదనపు యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు యంత్ర పరికరాలను అందజేస్తున్నారు. యంత్రలక్ష్మి పథకంలో భాగంగా 2012-13లో రూ.4.06 కోట్లు, 2013-14లో రూ.2.25 కోట్లు వ్యయం చేశారు. అదనపు యాంత్రీకరణ కింద రూ.1.10 కోట్లు వెచ్చించారు. అలాగే గతేడాది టార్పాలిన్ల పంపిణీ కోసం రూ.71 లక్షలు వెచ్చించారు.
సకాలంలో అందజేయడంలో విఫలం
రాయితీతో వ్యవసాయ యంత్ర పరికరాలను సకాలంలో రైతులకు అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. ఖరీఫ్ ప్రారంభంలోనే అందజేస్తే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. కానీ.. సీజన్ మధ్యలో ఇస్తున్నారు. రైతులు, రైతుమిత్ర గ్రూపుల నుంచి దరఖాస్తులు, డీడీలు తీసుకున్న తర్వాత వారం పది రోజుల వ్యవధిలో పంపిణీ చేస్తే ఆశించిన ఫలితం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది.
గత ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులోకి రావడంతో ఆ వర్గాలకు తప్పనిసరిగా 22 శాతం నిధులు ఖర్చు చేసి.. అవసరమైన పరికరాలు అందజేయాల్సి ఉంటోంది. అయితే.. ఎస్సీ, ఎస్టీ రైతులకు కేటాయిస్తున్న నిధుల్లో కొంత మేరకు మిగులుతున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ రైతులకు రూ.70.13 లక్షలు కేటాయించగా.. రూ.25.04 లక్షలు మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఎస్టీ రైతులకు రూ.28.59 లక్షలు కేటాయించగా.. కేవలం రూ.7.71 లక్షలు ఖర్చు పెట్టారు. మొత్తమ్మీద గత పదేళ్లలో జిల్లాకు 33,750 యూనిట్లు మంజూరు కాగా.. అందులో 29,074 యూనిట్లు పంపిణీ చేశారు. సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో 4,676 యూనిట్లు అందజేయలేక పోయారు