దాద్రీలో మళ్లీ ఉద్రిక్తత
నిషేధాజ్ఞలు విధించిన జిల్లా కలెక్టర్
గ్రేటర్ నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలో 9 నెలల తరువాత మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గోవధకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహ్మద్ అఖ్లాక్ కుటంబంపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలనే డిమాండ్‌తో దాద్రీ తాలూకాలోని బిషాదా గ్రామస్తులు సోమవారం నిరసన సమావేశం నిర్వహించారు. గత ఏడాది సెప్టెంబర్ 28న మహ్మద్ అఖ్లాక్ కుటుంబంపై దాడి జరిగిన సమయంలో స్వాధీనం చేసుకున్నేది గోమాంసమేనని ఇటీవల ఫోరెన్సిక్ నివేదికలో బహిర్గతం కావడం తాజా డిమాండ్‌కు తెరతీసింది.
అఖ్లాక్ కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు కోసం ఒత్తిడి పెంచడానికి తొలుత గ్రామస్తులు మహాపంచాయతీ నిర్వహించాలని అనుకున్నారు. అయితే పోలీసులు నిషేధాజ్ఞలు, గట్టి భద్రతా చర్యల కారణంగా ఆ ప్రయత్నం విరమించుకున్నారు. నిరసన కార్యక్రమానికి పలువురు స్థానిక శివసేన పార్టీ నాయకులు హాజరైనట్లు తెలిసింది. ఉద్రిక్తత నివారించడానికి గౌతం బుద్ధ్‌నగర్ జిల్లా మెజిస్ట్రేట్ ఎన్పీ సింగ్ సెక్షన్ 144 విధించారు. న లుగురు లేదా ఐదుగురికి మించి గుమిగూడకుండా నిషేధాజ్ఞలు జారీచేశారు.