ఎయిర్‌పోర్ట్‌లో రెండున్నర కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్, న్యూస్‌లైన్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మీర్ మహ్మద్ హుస్సేన్(35) సింగపూర్ నుంచి సిల్క్ ఎయిర్‌లైన్స్ ఎంఐ(478) విమానంలో గురువారం అర్ధరాత్రి సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ప్యాంటు, చొక్కా లోపలి భాగంలో రెండు బంగారు బిస్కెట్లు, ఓ బ్రాస్లెట్ కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు. ఇవి 2 కిలోల 499 గ్రాముల బరువు ఉన్నాయి. వీటి రూ.75 లక్షల విలువ ఉంటుందని అధికారులు నిర్ధారించారు. హుస్సేన్ అక్రవుంగా బంగారం తెస్తున్నందున అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. తనిఖీల్లో కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ ఆర్. మనోహర్, డిప్యూటీ కమిషనర్ ఈవీఎన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ కల్యాణ్, కస్టమ్స్ సూపరిండెంట్ రామకృష్ణారావు, ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు అన్వర్, మొహినుద్దీన్, ప్రతాప్‌రెడ్డి, హుస్సేన్ పాల్గొన్నారు.
ఫిబ్రవరి మాసంలో అధికంగా..
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి నెలలోనే పదికిపైగా బంగారం పట్టివేత కేసులు నమోదయ్యాయి. వివిధ కేసుల్లో కస్టమ్స్ అధికారులు సుమారు పది కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కేజీ బంగారానికి సంబంధించి మూడు కేసులు ఉన్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రో ప్లేట్ల రూపంలో రెండున్నర కేజీల బంగారాన్ని తీసుకొచ్చాడు. పాప్‌కార్న్ యంత్రం, షూ సాక్సుల్లో, లో దుస్తుల్లో, లగేజీ బ్యాగులకు డిజైనింగ్ తీగల మాదిరిగా ఇలా పలు విధాలుగా ప్రయాణికులు విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొచ్చి అడ్డంగా దొరికిపోయూరు.