సబను కిడ్నాప్ చేసి ..
►సూదులతో వాతలు... ఒళ్లంతా గాయాలు
►ఐదు నెలలుగా తిండి,నిద్ర లేకుండా గడిపిన చిన్నారి
►మెదడు, పుర్రెకు తీవ్ర గాయమై చనిపోయినట్టు వైద్యుల నిర్ధారణ
►చిట్టితల్లిది హైదరాబాదే...అసలు పేరు నౌసిన్ బేగం
►‘సాక్షి’లో ఫొటో చూసి సంగారెడ్డికి వచ్చిన తల్లిదండ్రులు
►వివరాల సేకరణలో పోలీసులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఒక ఖాకీ క్రూరత్వం.. మరి కొంత మంది ఖాకీల నిర్లక్ష్యం చిట్టి తల్లిని చిదివేశాయి. జాతరలో ఆడుకుంటున్న చిన్నారిని దొంగతనంగా ఎత్తుకొచ్చిన రాక్షస దంపతులు అత్యంత క్రూరంగా, పాశవికంగా హత్య చేశారు. పాప తలను బలంగా గోడకేసి కొట్టడంతో పుర్రె అంతర్భాగం చితికిపోయి, మెదడుకు ఇన్ఫెక్షన్ సోకడంతో షాహస్తా సబ చనిపోయిందని వైద్య పరీక్షల్లో తేలింది.
ఈ కేసులో వెలుగు చూస్తున్న వాస్తవాలను చూస్తే ఖాకీ దంపతులు చిన్నారిని ఐదు నెలులుగా పస్తులు పెట్టి, ఏడిస్తే కాల్చి వాతలు పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. పాప నరకం అనుభవించి చనిపోయిందని వైద్య బృందం నిర్ధారణ చేసింది. అమాయకమైన ముఖంతో, స్ట్రెచర్ మీద నిద్రపోయినట్టున్న చిన్నారిని పత్రికల్లో చూసిన ప్రతి హృదయం కన్నీళ్లు పెట్టింది. అదే ఫొటోతో ‘సాక్షి’ మెయిన్ పేజీలో ప్రచురితమైన వార్తను చూసి హైదరాబాద్‌కు చెందిన పాప తల్లిదండ్రులు మంగళవారం సంగారెడ్డికి వచ్చారు. పోలీసులకు పాప విషయం చెప్పి భోరున విలపించారు.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రాంతంలోని హసన్ నగర్‌కు చెందిన మహ్మద్ మహబూబ్, రేష్మాబేగం దంపతులు మూడో కూతురు షాహిస్త సబ, అసలు పేరు నౌసిన్ బేగం(5) గత ఏడాది జూలై మాసంలో రంజాన్ పండగ సందర్భంగా తన కుటుంబంతో కలిసి కర్ణాటక రాష్ట్రం గుల్భర్గలోని కేబీఎన్ దర్గాలో జరిగే ఉర్సుకు వెళ్లారు. అదే సమయంలో హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ జాకీర్ హుస్సేన్ కూడా భార్య, ఆరు మంది సంతానంతో కలిసి అదే దర్గాకు వెళ్లారు. ఈమేరకు జూలై 29 నుంచి ఆగస్టు 1 వరకు జాకీర్ హుస్సేన్ సెలవు తీసుకున్నట్లు బొల్లారం పోలీసు స్టేషన్ రికార్డుల్లో నమోదై ఉంది.
జూలై 31న ఇంటికి తిరగి వచ్చేందుకు సిద్ధమైన హెడ్‌కానిస్టేబుల్ కుటుంబానికి దర్గా జాతరలో ఒంటరిగా ఆడుకుంటున్న నౌసిన్బేగం కంటపడింది. అప్పటికే గంపెడు మంది సంతానానికి చాకిరి చేయలేక ఇబ్బంది పడుతున్న కానిస్టేబుల్ భార్య రజియా సుల్తానా పని మనిషి కోసం వెతుకుతోంది. అదే అదునుగా వారిద్దరూ కలిసి చిన్నారిని కిడ్నాప్‌చేసి కొండాపూర్ మండలం మల్కాపూర్‌లోని తమ ఇంటికి తెచ్చుకున్నారు.
మరోవైపు కనిపించకుండా పోయిన తన కూతురు కోసం మహ్మద్ మహబూబ్, రేష్మాబేగం దర్గా పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎవరో ఒక మహిళ ఎత్తుకొని పోయిందని స్థానికులు చెప్పడంతో అదే రోజు అంటే జూలై 31న చిన్నారి తల్లిదండ్రులు గుల్భర్గాలోని మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు మరుసటి రోజు అంటే ఆగస్టు 1న కిడ్నాప్ కేసుగా నమోదు చేశారు. కర్ణాటక పోలీసులు కేవలం కేసు నమోదుతోనే వదిలేశారు.
ఆ తర్వాత పాప ఆచూకీ తెలుసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కేసు దర్యాఫ్తు చేసి ఉంటే పాప ఆచూకీ బయట పడేది. మరో వైపు ఆగస్టు 2వ తేదీన జిన్నారం పోలీసు స్టేషన్లో విధులకు హాజరైన సయ్యద్ జాకీర్ హుస్సేన్ తర్వాత కాలంలో పని కోసం ఒక చిన్న పాపను తెచ్చుకున్నామని తన సహచర పోలీసు మిత్రులకు చెప్పినట్లు బొల్లారం పోలీసులు చెప్తున్నారు. తన భార్య గయ్యాళిదని హెడ్‌కానిస్టేబుల్ పలుమార్లు స్టేషన్ లో చెప్పినట్లు, ఈ విషయం ఎస్ఐతో సహా అందరికి తెలుసని ఇక్కడి పోలీసులు చెప్తున్నారు. ఏదేళ్ల చిన్న పాపను పనికోసం తెచ్చి పెట్టుకోవడం నేరమని ఏ ఒక్క పోలీసు చెప్పినా చిన్నారి బతికి ఉండేది.
స్టేషన్ హౌస్ అధికారికి తెలిసినా ఆయన కూడా హెడ్‌కానిస్టేబుల్‌తో ఉన్న సాన్నిహిత్యంతో చెప్పలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. ఇక పాప చిత్ర వధకు గురవుతున్న విషయం చైల్డ్‌లైన్ డెరైక్టర్‌కు స్థానికులు చేరవేశారు. అయితే ఆయన కూడా వెంటనే స్పందించలేదనే విమర్శలు వస్తున్నాయి. మీడియాను వెంట తీసుకొనిపోయి ఫొటోలకు ఫోజులు ఇస్తూ హడావుడి చేయాలనే ఆలోచనతో జాప్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. చైల్డ్‌లైన్ డెరైక్టర్ గత నెల 27న ఒక టీవీ ఛానల్ రిపోర్టర్‌కు ఫోన్ చేసి సంయుక్త ఆపరేషన్ చేద్దామని అడిగినట్లు సమాచారం.
అదే రోజు రాత్రి బాగా పొద్దుపోయాక ఆయన జిల్లా పోలీసులకు కూడా సమాచారం చేరవేసినట్లు తొలుత చైల్డ్‌లైన్ డెరైక్టరే మీడియాకు చెప్పారు. అయితే అప్పటికే బాగా రాత్రి కావడం, చైల్డ్‌లైన్ డెరైక్టర్ ఇచ్చిన సమాచారంలో క్లారిటీ లేకపోవడం, ప్రమాద తీవ్రత వివరించలేకపోవడం, పైగా దాడి చేయాల్సింది సొంత ఖాకీ ఇంటిమీద కావడంతో పోలీసులు వెంటనే స్పందించలేదని తెలుస్తోంది.
అనంతరం జిల్లా ఎస్పీ సుమతి ఓ తల్లిగా స్పందించడంతో పోలీసు దాడులు మొదలయ్యాయి. డీఎస్పీ తిరుపతన్న మెరుపు దాడి చేశారు కానీ. అప్పటికే చిట్టితల్లి కర్కశుల చేతిలో గాయపడి కొన ఊపిరితో చివరి ఘడియల్లో ఉంది. వెంటనే 108లో ఆసుపత్రికి తరలించినా ఫలించినా ఫలితం లేకపోయింది.
సాక్షి కథనంలో బయటికి వచ్చిన విషాదం..
నౌసిన్బేగం మృతి చెందిన వార్తను సాక్షి మెయిన్ పేజీలో ప్రచురించింది. వార్తను చూసిన స్థానికులు విషయం చిన్నారి తల్లిదండ్రులకు మహ్మద్ మహబూబ్, రేష్మాబేగం దంపతులకు చెప్పారు. మంగళవారం వారు సంగారెడ్డికి చేరుకొని డీఎస్పీ తిరపతన్నను కలిశారు. తమ కూతురును గుల్బర్గా దర్గా వద్ద ఎవరో కిడ్నాప్ చేసినట్లు, అక్కడి పోలీస్ స్టేషన్లో కేసుపెట్టినుట్లు చెప్పడంతో, దర్యాప్తు కోసం వారిని కొండాపూర్ పోలీసుతో గుల్బర్గా పంపించారు.