యూఏఈపై బంగ్లా గెలుపు
ఆసియా కప్ టి20 టోర్నీ
మిర్పూర్: ఆసియా కప్ టి20 టోర్నీ తొలి మ్యాచ్‌లో ఓడిన ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ కోలుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 51 పరుగుల తేడాతో యూఏఈపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఓపెనర్ మొహమ్మద్ మిథున్ (41 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 72/1తో ఒక దశలో మెరుగ్గా కనిపించిన బంగ్లా... యూఈఏ బౌలర్లు రాణించడంతో 61 పరుగులకు మిగతా 7 వికెట్లు కోల్పోయింది.
చివర్లో మహ్ముదుల్లా (27 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. బౌలింగ్‌లో నవీద్ (2/12), జావేద్ (2/34) రాణించారు. అనంతరం యూఈఏ 17.4 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ముహమ్మద్ ఉస్మాన్ (30 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. మొర్తజా (2/12), ముస్తఫిజుర్ (2/18), మహ్ముదుల్లా (2/5), షకీబ్ (2/20) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. మహ్ముదుల్లాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.