సర్జికల్ స్ట్రైక్స్ సలహా ఎవరిదో తెలుసా?
ముజఫర్నగర్: ఉగ్రవాదం పీచమణచడంలో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో సర్జికల్ స్ట్రైక్స్(లక్షిత దాడులు) నిర్వహించిన భారత సైన్యం పాటవాన్ని ప్రపంచమంతా పొగిడింది.. ఒక్క పాకిస్థాన్ తప్ప! ఇంతకు ముందు కూడా భారత సైన్యం ఇలాంటి దాడులు చేసినప్పటికీ అధికారికంగా వెల్లడించడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్ 28-29 తేదీల్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ పై ప్రస్తుతం పెద్ద ఎత్తున రాజకీయ చర్చ నడుస్తున్న సంగతీ తెలిసిందే. అయితే అసలింతకీ సర్జికల్ స్ట్రైక్స్ ఆలోచన ఎవరిది? ఎవరి సలహా తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది?.. ఈ ప్రశ్నలకు బదులు తెలియాలంటే ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో వెలుగుచూసిన ఈ కథనం చదవాలి.
'పాక్ ఆక్రమిత కశ్మీర్ లో సర్జికల్ స్ట్రైక్స్ ఐడియా ఇచ్చింది మన నేతాజీ ములాయం సింగ్ యాదవ్. ఆయన సలహా తీసుకున్న తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ దాడులకు పచ్చ జెండా ఊపారు. ఆర్మీ ఆపరేషన్ పై కొందరు రాజకీయాలు చేస్తున్నారు. అలాంటివాళ్లంతా జీరోలు.. ఆర్మీ జవాన్లే అసలైన హీరోలు..' అంటూ సమాజ్ వాది పార్టీ యువనేత మొహమ్మద్ షంషేర్ మాలిక్ రాత్రికిరాత్రే ముజఫర్ నగర్ లో పోస్టర్లు వేయించాడు. ములాయం సింగ్ గతంలో రక్షణ మంత్రిగా పనిచేసినందున పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో, అవతలివాళ్లను ఎలా దెబ్బకొట్టాలో ఆయనకు తెలుసని, నేతాజీ సలహాతోనే భారత సైన్యం దాడులు జరిపిందని, ఈ విషయం పార్టీ పెద్దల ద్వారా తనకు తెలిసిందని షంషేర్ మాలిక్ మీడియాకు చెప్పాడు.
అయితే సమాజ్ వాది పార్టీ ముజఫర్ నగర్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ లాల్ సైనీ మాత్రం మాలిక్ వ్యాఖ్యలను ఖండించారు. 'సర్జికల్ స్ట్రైక్స్ ఐడియా ములాయం సింగ్ దే అని నేను గానీ, పార్టీ పెద్దలుగానీ ఎక్కడా చెప్పలేదు. మా నేతాజీ అనుభవజ్ఞుడు గనుక ఆయన సలహా తీసుకొని ఉంటారని మాత్రమే అనుకున్నాం' అని శ్యామ్ లాల్ వివరణ ఇచ్చారు. పోస్టర్ లో ములాయం సింగ్ యాదవ్ తోపాటు అతని కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తోపాటు షంషేర్ మాలిక్ ఫొటో కూడా ఉంది. పోస్టర్ ను తొలిగించాలని పార్టీ ఎలాంటి ఆదేశాలు జారీచేయకపోవడం గమనార్హం. మూడు రోజుల కిందట ఇవే సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో బీజేపీ, శివసేన కార్యకర్తలు రాజకీయ పోస్టర్లు రూపొందించిన సంగతి తెలిసిందే. (చదవండి: మరో సర్జికల్ స్ట్రైక్ తో పాక్ ఖలాస్)