నా కుటుంబం జోలికోస్తే ఇకపై సహించను: మంచు విష్ణు
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో తనపై దారుణంగా ట్రోల్స్ చేశారని అన్నారు. మా ఫ్యామిలీని టార్గెట్ చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీని వెనకాల ఓ స్టార్ హీరో ఉన్నారని మంచు విష్ణు ఆరోపించారు. మా కుటుంబంపై ట్రోల్స్ చేసేందుకు ఏకంగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నెలకొల్పారని తెలిపారు.
(చదవండి: వెనక్కి తగ్గిన మంచు విష్ణు.. 'జిన్నా' వాయిదా?)
తాజాగా జిన్నా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న విష్ణు.. 'మా' ఎన్నికల నుంచి మా ఫ్యామిలీపై ట్రోల్స్ ఎక్కువయ్యాయని అన్నారు. నా ఫ్యామిలీపై ట్రోల్స్ చేసినవారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మంచు విష్ణు తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు, ఐపీ అడ్రస్‌లు పోలీసులకు అందజేస్తానని ఆయన వెల్లడించారు. ఇన్ని రోజులు అన్నీ భరించానని.. ఇకపై సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
మంచు విష్ణు మాట్లాడుతూ 'ఓ హీరోకు చెందిన కంపెనీ నుంచే నా కుటుంబంపై ట్రోలింగ్. ఇకపై సహించేది లేదు. తనపైనా, తన కుటుంబంపైనా పనిగట్టుకుని ట్రోలింగ్ చేస్తున్నారు. త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తా. ఓ హీరో తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఓ కంపెనీలో తన కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆఫీస్ చిరునామాతో పాటుగా వారు వినియోగించే ఐపీ అడ్రస్‌లను కూడా సేకరించాను. త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమగ్ర ఆధారాలతో ఫిర్యాదు చేస్తా' అని అన్నారు.