‘శిఖర్ ధావన్ గురించే ఆందోళన’
న్యూఢిల్లీ: టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ముగిసి వన్డే సిరీస్‌కు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య ప్రారంభంకానున్న వన్డే సిరీస్ గురించే ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ మొహీందర్ అమర్నాథ్ ఓ జాతీయ పత్రికకు రాసిన కాలమ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ గురించి ప్రధానంగా ప్రస్తావించాడు.
‘ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఒక్క విషయంలోనే కాస్త ఆందోళన చెందుతుంది. అది ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ గురించి. కానీ, అతనిపై నమ్మకం ఉంది. అతి కొద్ది సమయంలోనే అతడు తిరిగి తన ఫామ్‌ను అందుకుని వన్డే సిరీస్‌లో రాణిస్తాడనే ఆశిస్తున్నా. ఇంగ్లండ్ గడ్డపై పేసర్లను సమర్థంగా ఎదుర్కొంటే చాలు విజయాలు సాధించినట్లే. మన స్పిన్నర్లు కూడా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. చాహల్ మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులేశారు. కుల్దీప్ యాదవ్‌ను చివరి టీ20లో ఆడించకపోవడంతో నేను ఆశ్చర్యానికి గురయ్యాను. టీ20 సిరీస్ గెలిచిన భారత్‌కు ఇంగ్లండ్ గడ్డపై మంచి ఆరంభమే దక్కింది. వన్డే సిరీస్‌లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తారని అనుకుంటున్నాను. మూడు టీ20ల్లో పలువురు ఆటగాళ్లు సత్తా చాటారు. చివరి టీ20లో రోహిత్ శర్మ ఎలాంటి ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు’ అని అమర్నాథ్ అన్నాడు.