momin peta
-
మేకువన్నె బాబా
చేతనబడి చూపు శూలం. రూపు రౌద్రం. మాట మంత్రం. చేత తంత్రం. పిడికిలితో పసుపు కుంకుమ తీసి ముఖం మీద కొట్టాడంటే... ప్రేతాత్మ పనైపోయినట్లే! దానికి చేతబడి జరిగినట్లే! వీధి ‘వైద్యులు’ చెవుల్లోంచి రాళ్లు తీసినట్లు.. ఈ భూతవైద్యుడు మన ఒంట్లోంచి మేకులు పీకుతాడు! ‘రోగం వదిలింది ఫో’ అంటాడు. రోగంతో పాటు రుపీసూ వదిలిస్తాడు. మనుషుల్లో మేక వన్నె పులులు ఉన్నట్లు... ఈయన మేకు వన్నె బాబా! రంగారెడ్డి జిల్లాలో మోమిన్ పేట గ్రామం. అది మండల కేంద్రం కూడా. ఆ ఊరికి రెండు కిలోమీటర్ల దూరాన పొలాల్లో ఉంది ఓ దేవాలయం. శక్తిస్వరూపిణి ఆలయానికి రోజూ పదుల కొద్దీ భక్తులు వస్తుంటారు. వారిలో నూటికి తొంభై మంది ఆ ఆలయంలో ఉన్న మంత్రగాడిని దర్శించుకోవడానికే వస్తుంటారు. పొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో గుడి, పక్కనే మంత్రగాడి ఇల్లు. కనుచూపు మేరలో మనిషి ఆనవాలు ఉండదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే భయం లేకుండా ఆ కుటుంబం అక్కడ ఎలా నివసించగలుగుతోందని అక్కడికొచ్చే భక్తులకు ఆశ్చర్యం. మళ్లీ అంతలోనే ‘అంతటి శక్తులున్న స్వామీజీకి భయమెందుకుంటుంది?’ అని తమకు తాముగా సమాధానం చెప్పుకుంటారు. ‘అందుకేగా మరి... చేతబడులను తిప్పి కొట్టగలుగుతోంది’ అని మరికొందరు అంటారు. రౌద్రానికి ప్రతిరూపం ఆ రోజు కూడా భక్తుల సంభాషణ ఇలాగే కొనసాగుతోంది. ఇంతలో.. ‘ష్...’ అంటూ నోటి మీద వేలిని చూపుతూ మాట్లాడవద్దనే సంకేతాన్ని జారీ చేశాడు ఓ అనుచరుడు. తర్వాత స్వామీజీ ఉన్న గది తెర తొలగించాడు. స్వామీజీ పద్మాసన స్థితిలో కూర్చుని ఉన్నాడు. ముఖంలో ప్రసన్నత ఏ కోశానా లేదు. రౌద్రానికి ప్రతిరూపంగా ఉన్నాడు. అతడి ముందు పసుపు, కుంకుమలు రాశులుగా పోసి ఉన్నాయి. త్రిశూలాన్ని చేతిలోకి తీసుకుని గిరగిరా తిప్పుతున్నాడు. ఆవేశంతో ఊగుతున్నాడు. భక్తుల్లో ఎవరికీ నోరు పెగలడం లేదు. తాము వచ్చిన పని మర్చిపోయి మంత్రముగ్ధుల్లా చూస్తున్నారు. త్రిశూలం వచ్చి గుండెల్లో దిగుతుందేమోనన్నంత ఉత్కంఠత నెలకొంది. ఏడెనిమిది నిమిషాలు గడిచాక కొద్దిగా శాంతించాడు స్వామీజీ. ‘నీ కష్టం ఏమిటో చెప్పుకో...’ త్రిశూలాన్ని పక్కన ఉంచి ‘ఎందుకొచ్చారన్నట్లుగా’ భక్తుల ముఖాల్లోకి సూటిగా చూస్తున్నాడు. అనుచరుడు ఒక మహిళ దగ్గరకు వచ్చి లో గొంతుకతో ‘నీ కష్టం ఏమిటో చెప్పుకోమ్మా’ అని అన్నాడు. ఆమె కూర్చున్న చోట నుంచి లేచి కొద్దిగా ముందుకు వెళ్లి తాను తెచ్చిన కొబ్బరి కాయ, తాంబూలం, పూలు, అరటిపండ్లు, సాంబ్రాణి కడ్డీలు, కర్పూరం, దక్షిణగా కొంత డబ్బు స్వామి ఎదురుగా ఉన్న పళ్లెంలో పెట్టింది. ధైర్యం తెచ్చుకుని నోరు తెరిచింది... ‘రెణ్నెల్ల నుంచి మోకాళ్లు, నడుములు, మోచేతుల నొప్పులు, నిలబడలేను, నాలుగడుగులు కూడా వేయలేక పోతున్నాను. కాలు కదిలించాలన్నా, చేత్తో నీళ్ల చెంబు ఎత్తాలన్నా భయంగా ఉంటోంది’ అని చెప్పింది. మరి ఆమె వైద్యుడి దగ్గరకు వెళ్లకుండా భూతవైద్యుడి దగ్గరకు ఎందుకు వచ్చినట్లు..అనే సందేహం అక్కడెవరికీ రాలేదు. ఆ మేకులే ఈ మేకులు! అందరూ స్వామీజీ ఏం చెబుతాడోననే ఉత్కంఠతో చెవులు రిక్కించి వింటున్నారు. స్వామీజీ త్రిశూలాన్ని ఆమె మోకాళ్ల మీద, మోచేతుల మీద ఆన్చి కళ్లు మూసుకుని ఏదో జపించాడు. కళ్లు తెరిచాడు... ‘మీ ఊరికి పది మైళ్ల దూరాన ఉన్న వాళ్లెవరో మీకు చేతబడి చేసి పిండిబొమ్మలో మేకులు గుచ్చారు. ఆ మేకులే నీ మోకాళ్లలో దూరాయి’ అని ముగించాడు. ఆమె కళ్లలోని భయాన్ని చూసి... ‘నీకు అంతటి శత్రువులు ఎవరూ ఉండరు. నువ్వు లక్షణంగా ఉంటే చూడలేని నీ బంధువులే ఈ పని చేశారు’ అంటూ ముక్తాయింపునిచ్చేశాడు. ఆ మహిళ అయోమయం నుంచి తేరుకునే లోపు మరో భక్తుని పంపించాడు అనుచరుడు. కొంతసేపటికి లేచి వెళ్లబోతున్న ఆ అర వయ్యేళ్ల స్త్రీని ఆపి పక్కన కూర్చోబెట్టారు. ‘స్వామీజీ తీసేస్తాడట..’ ఒక్కొక్కరు ఒక్కో రకమైన కష్టం చెప్పుకుంటున్నారు. స్వామీజీ ఒకరికి నిమ్మకాయలను మంత్రించి ఇస్తున్నాడు. కొందరిని కొరడాతో కొడుతున్నాడు. కీళ్ల నొప్పులని వచ్చిన వారందరినీ ఒక చోట కూర్చోబెడుతున్నాడు అనుచరుడు. ‘ఒంట్లోకి దూరిన మేకులను స్వామీజీ చేత్తో తీసేస్తాట్ట’ గుసగుసగా చెప్పుకుంటున్నారు. చివరగా వీరికి (భూత) వైద్యం మొదలైంది. మేకుల్ని తీయడానికి ఉపక్రమించగానే స్వామీజీలో రౌద్రం తారస్థాయికి చేరింది. పసుపు, కుంకుమలను గుప్పెళ్లతో తీసి ఒంటి మీద చల్లుతున్నాడు. ప్రేతాత్మతో మాట్లాడుతున్నట్లు అభినయిస్తున్నాడు. మోచేతులను గట్టిగా పట్టుకుని మేకులను పళ్లతో లాగేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మేకు పళ్లకు దొరకనందుకు కోపంతో మనిషి ఊగిపోతున్నాడు. ఐదారు ప్రయత్నాల తర్వాత మోచేతి నుంచి ఒక మేకు తీసి చూపించాడు. అలా మూడు మేకులు బయటపడ్డాయి. అన్నీ ఒకేరోజు కాదు! ‘ఈ రోజుకు చాలు, మిగిలినవి వచ్చే వారం’ అని ముగించాడు స్వామీజీ. ఆమె నుంచి మేకుకు రెండు వందల చొప్పున ఆరువందలు వసూలు చేశాడు అనుచరుడు. అలా ఆమెకు వారానికి ఆరేడు వందల చొప్పున దాదాపుగా మూడు వేలు వదిలాయి. కానీ నొప్పులు తగ్గలేదు. వయసు రీత్యా, క్యాల్షియం లోపంతో ఎముకలు గుల్లబారడం, కీళ్ల అరుగుదలతో ఇలాంటి నొప్పులు వస్తుంటాయి. అలా బాధపడే వాళ్లు ఆ స్వామీజీ దగ్గరకు వస్తుంటారు. కొందరికి నొప్పులు రెండు- మూడు వారాల్లో వాటంతట అవే తగ్గిపోతుంటాయి. స్వామీజీ నొప్పుల్ని మాయం చేశాడని వీళ్లు చేసే ప్రచారంతో మిగిలిన వాళ్లు ఆకర్షితులవుతుంటారు. తగ్గని వాళ్లు ప్రత్యామ్నాయంగా మరో భూతవైద్యుడినో, వైద్యుడినో వెతుక్కుంటూ ఈ సంగతి మర్చిపోతారు. కాస్త లాజిక్‌గా ఆలోచిస్తే చాలు... ఇలాంటి బాబాల మోసాలు ఇట్టే అర్థమైపోతాయి. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మేకులు ఎక్కడ ఉంటాయి? మేకుల్ని పసుపు కుంకుమలో దాస్తారు.ఎవరూ గమనించలేనంత నైపుణ్యంగా మేకులను వేళ్ల మధ్యకు తీసుకుని ఒంటిమీద పెట్టి నోటితో లాగినట్లు భ్రమింపచేస్తారు. దేహం లోపలి నుంచి ఇనుప మేకు బయటకు వస్తే ఆ మేరకు గాయమై రక్తం చిందాలి కదా అనే చిన్న తర్కాన్ని కూడా ఆలోచించరు భక్తులు. ఆలోచిస్తే ఇటువంటి వైద్యాలు కొనసాగవు. ఇలా ఛేదించాం మేము గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి ఆ అరవై ఏళ్ల మహిళ వచ్చింది. స్వామీజీలు చేసే ట్రిక్స్‌ని చేసి చూపిస్తుంటే ఆమె వెంటనే స్పందించింది. ‘మీరు ఓ నెల ముందు మా ఊరికి రాకపోతిరి’ అంటూ తనకు జరిగిన భూతవైద్యం గురించి, మేకుల బాబా మోసాన్ని చెప్పింది. దాంతో మేము కూడా భక్తుల్లాగే వెళ్లి అతడు మేకులను ఎక్కడ దాస్తున్నాడో, ఎలా తీస్తున్నాడో చూపించాం. అప్పటికే అక్కడ ఉన్న భక్తులు మమ్మల్ని గట్టిగా వ్యతిరేకించారు. మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పమనడంతో వాళ్లు కూడా తార్కికంగా ఆలోచించి సమాధానపడ్డారు. ఆ స్వామీజీని పోలీసులకు పట్టివ్వడానికి కూడా సహకరించారు. - టి. రమేశ్, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ కాంగ్రెస్ నెట్వర్క్ -
కట్టుకున్న భర్తనే కడతేర్చింది..!
మోమిన్‌పేట: రెండు వేర్వేరు హత్యా కేసులకు సంబంధించి నలుగుర్ని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అదనపు కట్నం వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించిన వివాహితకు ఆమె భర్తే నిప్పంటించి ఆమె మృతికి కారకుడయ్యాడు. మరోకేసులో వివాహేతర సంబంధం గురించి తరచూ సూటిపోటి మాటలతో వేధిస్తున్నాడరి ఓ మహిళ తన ప్రయుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. మోమిన్‌పేట సర్కిల్ ఇన్స్పెక్టరు ఎ.వి.రంగా తెలిపిన వివరాలు.. బెదిరిస్తే నిజమే చేశాడు.. ధారూర్ మండలం తరిగోపుల గ్రామానికి చెందిన చాకలి ప్రభావతి(32), భీమయ్యలు దంపతులు. వీరికి 20సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు కుమారులున్నారు. అయితే నాలుగేళ్లు అదనపు కట్నం కింద బైక్ ఇప్పించాలంటూ భీమయ్య తరచూ ప్రభావతిని వేధించడం ప్రారంభించాడు. దీనికి అతడి తల్లి సంగమ్మ కూడా సహకరించేది. ఈ క్రమంలో ఈ నెల 5న అదనపు కట్నం వేధింపులు ఆపకుంటే ఆత్మహత్యకు పాల్పడతానంటూ భర్తను బెదిరించేందుకు ప్రభావతి ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. అయితే ఆమెను ఆపాల్సిందిపోయి భీమయ్య అగ్గిపెట్టె అంటించి ఆమెకు నిప్పంచించాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో న్యాయమూర్తి ఎదుట భీమయ్య, సంగమ్మలే తనకు నిప్పంటిం చారని ప్రభావతి వాంగ్మూలం ఇచ్చింది. అనంతరం చికిత్స పొందుతూ ఈ నెల 19న మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దర్ని మంగళవారం రిమాండుకు తరలించారు. అడ్డు తొలగించుకున్నారు మర్పల్లి మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన తెలుగు చెన్నయ్య(60), రాములమ్మలు భార్యాభర్తలు. అయితే గతంలో రాములమ్మ అదే గ్రామానికి చెందిన బోయిని బాలయ్యతో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ విషయమై ఇప్పటికీ రాములమ్మను సూటిపోటి మాటలతో చెన్నయ్య వేధించేవాడు. దీంతో తన భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన రాములమ్మ బాలయ్యతో కలిసి పన్నాగం పన్నింది. ముందస్తు వ్యూహం మేరకు అక్టోబర్ 25న రాములమ్మ, బాలయ్యలు కలిసి చెన్నయ్యను మోమిన్‌పేట సంతకు తీసుకొచ్చారు. అనంతరం మోమిన్‌పేటలోని పెట్రోల్ బంక్ వెనుకాల ఉన్న పత్తి పొలంలో చెన్నయ్యకు ఫూటుగా మద్యం తాగించారు. తర్వాత మత్తులో ఉన్న చెన్నయ్య మర్మంగాలను తాడుతో గట్టిగ కట్టేసి దారుణంగా హత్య చేసి స్వగ్రామానికి వెళ్లిపొయారు. అక్టోబరు 30న పొలంలో గుర్తు తెలియని మృతదేహాన్ని గమనించిన పోలీసులు మర్పల్లి ప్రభుత్వాస్పత్రిలో పొస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని భద్రపరిచారు. కాగా మృతుని కమీజుపై వీర్లపల్లి టైలరు అనే పేరు ఉండటంతో ఆ గ్రామంలో డప్పు చాటింపు వేయించారు. ఆ తర్వాత రాములమ్మ తన భర్త ఐదు రోజుల క్రితం బంధువుల వద్దకు వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలోని మృతదేహాన్ని పరిశీలించి అది తన భర్తదేనంటూ తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించింది. రాములమ్మ వ్యవహారశైలిని అనుమానించిన పోలీసులు ఆమెపై నిఘా పెట్టారు. దీంతో తాము హత్య చేసిన సంగతి బయటపడుతుందని ఆందోళనకు గురైన రాములమ్మ, బాలయ్యలు మంగళవారం మోమిన్‌పేట తహసీల్దార్ రవీందర్ ఎదుట లొంగిపోయారు. పోలీసులు వారిద్దర్ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. -
పశువుల కాపరిని... పసిపాపల వైద్యుడ్ని అయ్యా....
సర్కారు దవాఖానాల ప్రక్షాళన నరకకూపాలుగా ఉన్న సర్కారు దవాఖానాలను సమూలంగా ప్రక్షాళన చేస్తానని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. మెదక్ జిల్లా మోమిన్ పేట మండల పరిధిలోని మేకవనంపల్లిలో నిర్మించిన మేథడిస్టు చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ అభివృద్ధి చర్యల్లో భాగంగా జిల్లా ఆస్పత్రికి రూ.25 కోట్ల చొప్పున, ఇతర ఆస్పత్రులు ఒక్కోదానికి రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలోని ఆస్పత్రులలో నిద్రిస్తేనే సమస్యలు తెలుస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి దళిత, గిరిజన పక్షపాతి అన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్లతో దళితులు, రూ.25వేల కోట్లతో బీసీలు, రూ.15వేల కోట్లతో గిరిజనులు, రూ.15వేల కోట్లతో మైనార్టీల అభివృద్ధికి నిధులు ఖర్చు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేయనున్న పలు పథకాల గురించి వివరించారు. పశువుల కాపరిని... పసిపాపల వైద్యుడ్ని అయ్యా.... పశువుల కాపరియైన తాను పసిపాపల వైద్యుడ్ని అయ్యానని ఆయన చిన్నప్పటి స్మృతులను రాజయ్య గుర్తుచేసుకున్నారు. పట్టుదల, అత్మవిశ్వాసం, క్రమశిక్షణలతో ఎదైనా సాధించవచ్చన్నారు. పొరుగు వారిని నిండు మనసుతో ప్రేమించాలని ఆయన కోరారు. మోమిన్‌పేటలో 30పడకల ఆస్పత్రికి హామీ మోమిన్‌పేట మండల కేంద్రంలో ఉన్న ఆరు పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నందున రోగులకు వైద్యం పూర్తి స్థాయి లో అందడం లేదని స్థానిక ఎమ్మెల్యే సంజీవరావు, ఎంపీపీ నిఖితారెడ్డిలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన 30పడకల ఆస్పత్రి మంజూరుకు హామీ ఇచ్చారు. అందుకు రూ.1.20కోట్లు ఆవసరమవుతాయని, వెంటనే మంజూరు చేస్తానని పేర్కొన్నారు. అంతకు ముందు చర్చిలో మినీ క్రిస్ట్మస్ సందర్భంగా కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్సీ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, మార్కెటు కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ శంకర్, ఎంపీటీసీ సభ్యులు భాస్కర్, రాములమ్మ, చర్చి నిర్మాణ కర్త సంజీవరావు,పాస్టరు పద్మాకర్, నాయకులు సంగారెడ్డి, లక్ష్మయ్య, నరేందర్‌రెడ్డి, మహంత్‌స్వామి, లక్ష్మారెడ్డి, చంద్రయ్య, ఆనందం, ప్రతాప్‌రెడ్డి, చెన్న తదితరులు పాల్గొన్నారు.