మేకువన్నె బాబా | police custody in Exorcist | Sakshi
Sakshi News home page

మేకువన్నె బాబా

Published Mon, Feb 29 2016 10:16 PM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

మేకువన్నె బాబా

మేకువన్నె బాబా

చేతనబడి
 

చూపు శూలం. రూపు రౌద్రం.
మాట మంత్రం. చేత తంత్రం.
పిడికిలితో పసుపు కుంకుమ తీసి ముఖం మీద కొట్టాడంటే...
ప్రేతాత్మ పనైపోయినట్లే!
దానికి చేతబడి జరిగినట్లే!
వీధి ‘వైద్యులు’ చెవుల్లోంచి రాళ్లు తీసినట్లు..
ఈ భూతవైద్యుడు మన ఒంట్లోంచి
మేకులు పీకుతాడు!
‘రోగం వదిలింది ఫో’ అంటాడు.
రోగంతో పాటు రుపీసూ వదిలిస్తాడు.
మనుషుల్లో మేక వన్నె పులులు ఉన్నట్లు...
ఈయన మేకు వన్నె బాబా!

 
రంగారెడ్డి జిల్లాలో మోమిన్ పేట గ్రామం. అది మండల కేంద్రం కూడా. ఆ ఊరికి రెండు కిలోమీటర్ల దూరాన పొలాల్లో ఉంది ఓ దేవాలయం. శక్తిస్వరూపిణి ఆలయానికి రోజూ పదుల కొద్దీ భక్తులు వస్తుంటారు. వారిలో నూటికి తొంభై మంది ఆ ఆలయంలో ఉన్న మంత్రగాడిని దర్శించుకోవడానికే వస్తుంటారు. పొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో గుడి, పక్కనే మంత్రగాడి ఇల్లు. కనుచూపు మేరలో మనిషి ఆనవాలు ఉండదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే భయం లేకుండా ఆ కుటుంబం అక్కడ ఎలా నివసించగలుగుతోందని అక్కడికొచ్చే భక్తులకు ఆశ్చర్యం. మళ్లీ అంతలోనే ‘అంతటి శక్తులున్న స్వామీజీకి భయమెందుకుంటుంది?’ అని తమకు తాముగా సమాధానం చెప్పుకుంటారు. ‘అందుకేగా మరి... చేతబడులను తిప్పి కొట్టగలుగుతోంది’ అని మరికొందరు అంటారు.
 
రౌద్రానికి ప్రతిరూపం
ఆ రోజు కూడా భక్తుల సంభాషణ ఇలాగే కొనసాగుతోంది. ఇంతలో.. ‘ష్...’ అంటూ నోటి మీద వేలిని చూపుతూ మాట్లాడవద్దనే సంకేతాన్ని జారీ చేశాడు ఓ అనుచరుడు. తర్వాత స్వామీజీ ఉన్న గది తెర తొలగించాడు. స్వామీజీ పద్మాసన స్థితిలో కూర్చుని ఉన్నాడు. ముఖంలో ప్రసన్నత ఏ కోశానా లేదు. రౌద్రానికి ప్రతిరూపంగా ఉన్నాడు. అతడి ముందు పసుపు, కుంకుమలు రాశులుగా పోసి ఉన్నాయి. త్రిశూలాన్ని చేతిలోకి తీసుకుని గిరగిరా తిప్పుతున్నాడు. ఆవేశంతో ఊగుతున్నాడు. భక్తుల్లో ఎవరికీ నోరు పెగలడం లేదు. తాము వచ్చిన పని మర్చిపోయి మంత్రముగ్ధుల్లా చూస్తున్నారు. త్రిశూలం వచ్చి గుండెల్లో దిగుతుందేమోనన్నంత ఉత్కంఠత నెలకొంది. ఏడెనిమిది నిమిషాలు గడిచాక కొద్దిగా శాంతించాడు స్వామీజీ.
 
‘నీ కష్టం ఏమిటో చెప్పుకో...’
త్రిశూలాన్ని పక్కన ఉంచి ‘ఎందుకొచ్చారన్నట్లుగా’ భక్తుల ముఖాల్లోకి సూటిగా చూస్తున్నాడు. అనుచరుడు ఒక మహిళ దగ్గరకు వచ్చి లో గొంతుకతో ‘నీ కష్టం ఏమిటో చెప్పుకోమ్మా’ అని అన్నాడు. ఆమె కూర్చున్న చోట నుంచి లేచి కొద్దిగా ముందుకు వెళ్లి తాను తెచ్చిన కొబ్బరి కాయ, తాంబూలం, పూలు, అరటిపండ్లు, సాంబ్రాణి కడ్డీలు, కర్పూరం, దక్షిణగా కొంత డబ్బు స్వామి ఎదురుగా ఉన్న పళ్లెంలో పెట్టింది. ధైర్యం తెచ్చుకుని నోరు తెరిచింది... ‘రెణ్నెల్ల నుంచి మోకాళ్లు, నడుములు, మోచేతుల నొప్పులు, నిలబడలేను, నాలుగడుగులు కూడా వేయలేక పోతున్నాను. కాలు కదిలించాలన్నా, చేత్తో నీళ్ల చెంబు ఎత్తాలన్నా భయంగా ఉంటోంది’ అని చెప్పింది. మరి ఆమె వైద్యుడి దగ్గరకు వెళ్లకుండా భూతవైద్యుడి దగ్గరకు ఎందుకు వచ్చినట్లు..అనే సందేహం అక్కడెవరికీ రాలేదు.
 
ఆ మేకులే ఈ మేకులు!
అందరూ స్వామీజీ ఏం చెబుతాడోననే ఉత్కంఠతో చెవులు రిక్కించి వింటున్నారు. స్వామీజీ త్రిశూలాన్ని ఆమె మోకాళ్ల మీద, మోచేతుల మీద ఆన్చి కళ్లు మూసుకుని ఏదో జపించాడు. కళ్లు తెరిచాడు... ‘మీ ఊరికి పది మైళ్ల దూరాన ఉన్న వాళ్లెవరో మీకు చేతబడి చేసి పిండిబొమ్మలో మేకులు గుచ్చారు. ఆ మేకులే నీ మోకాళ్లలో దూరాయి’ అని ముగించాడు. ఆమె కళ్లలోని భయాన్ని చూసి... ‘నీకు అంతటి శత్రువులు ఎవరూ ఉండరు. నువ్వు లక్షణంగా ఉంటే చూడలేని నీ బంధువులే ఈ పని చేశారు’ అంటూ ముక్తాయింపునిచ్చేశాడు. ఆ మహిళ అయోమయం నుంచి తేరుకునే లోపు మరో భక్తుని పంపించాడు అనుచరుడు. కొంతసేపటికి లేచి వెళ్లబోతున్న ఆ అర వయ్యేళ్ల స్త్రీని ఆపి పక్కన కూర్చోబెట్టారు.
 
‘స్వామీజీ తీసేస్తాడట..’

ఒక్కొక్కరు ఒక్కో రకమైన కష్టం చెప్పుకుంటున్నారు. స్వామీజీ ఒకరికి నిమ్మకాయలను మంత్రించి ఇస్తున్నాడు. కొందరిని కొరడాతో కొడుతున్నాడు. కీళ్ల నొప్పులని వచ్చిన వారందరినీ ఒక చోట కూర్చోబెడుతున్నాడు అనుచరుడు. ‘ఒంట్లోకి దూరిన మేకులను స్వామీజీ చేత్తో తీసేస్తాట్ట’ గుసగుసగా చెప్పుకుంటున్నారు. చివరగా వీరికి (భూత) వైద్యం మొదలైంది. మేకుల్ని తీయడానికి ఉపక్రమించగానే స్వామీజీలో రౌద్రం తారస్థాయికి చేరింది. పసుపు, కుంకుమలను గుప్పెళ్లతో తీసి ఒంటి మీద చల్లుతున్నాడు. ప్రేతాత్మతో మాట్లాడుతున్నట్లు అభినయిస్తున్నాడు. మోచేతులను గట్టిగా పట్టుకుని మేకులను పళ్లతో లాగేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మేకు పళ్లకు దొరకనందుకు కోపంతో మనిషి ఊగిపోతున్నాడు. ఐదారు ప్రయత్నాల తర్వాత మోచేతి నుంచి ఒక మేకు తీసి చూపించాడు. అలా మూడు మేకులు బయటపడ్డాయి.
 
అన్నీ ఒకేరోజు కాదు!

‘ఈ రోజుకు చాలు, మిగిలినవి వచ్చే వారం’ అని ముగించాడు స్వామీజీ. ఆమె నుంచి మేకుకు రెండు వందల చొప్పున ఆరువందలు వసూలు చేశాడు అనుచరుడు. అలా ఆమెకు వారానికి ఆరేడు వందల చొప్పున దాదాపుగా మూడు వేలు వదిలాయి. కానీ నొప్పులు తగ్గలేదు. వయసు రీత్యా, క్యాల్షియం లోపంతో ఎముకలు గుల్లబారడం, కీళ్ల అరుగుదలతో ఇలాంటి నొప్పులు వస్తుంటాయి. అలా బాధపడే వాళ్లు ఆ స్వామీజీ దగ్గరకు వస్తుంటారు. కొందరికి నొప్పులు రెండు- మూడు వారాల్లో వాటంతట అవే తగ్గిపోతుంటాయి. స్వామీజీ నొప్పుల్ని మాయం చేశాడని వీళ్లు చేసే ప్రచారంతో మిగిలిన వాళ్లు ఆకర్షితులవుతుంటారు. తగ్గని వాళ్లు ప్రత్యామ్నాయంగా మరో భూతవైద్యుడినో, వైద్యుడినో వెతుక్కుంటూ ఈ సంగతి మర్చిపోతారు. కాస్త లాజిక్‌గా ఆలోచిస్తే చాలు... ఇలాంటి బాబాల మోసాలు ఇట్టే అర్థమైపోతాయి.
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 మేకులు ఎక్కడ ఉంటాయి?

మేకుల్ని పసుపు కుంకుమలో దాస్తారు.ఎవరూ గమనించలేనంత నైపుణ్యంగా మేకులను వేళ్ల మధ్యకు తీసుకుని ఒంటిమీద పెట్టి నోటితో లాగినట్లు భ్రమింపచేస్తారు. దేహం లోపలి నుంచి ఇనుప మేకు బయటకు వస్తే ఆ మేరకు గాయమై రక్తం చిందాలి కదా అనే
 చిన్న తర్కాన్ని కూడా ఆలోచించరు భక్తులు. ఆలోచిస్తే ఇటువంటి వైద్యాలు కొనసాగవు.
 
ఇలా ఛేదించాం

మేము గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి ఆ అరవై ఏళ్ల మహిళ వచ్చింది. స్వామీజీలు చేసే ట్రిక్స్‌ని చేసి చూపిస్తుంటే ఆమె వెంటనే స్పందించింది. ‘మీరు ఓ నెల ముందు మా ఊరికి రాకపోతిరి’ అంటూ తనకు జరిగిన భూతవైద్యం గురించి, మేకుల బాబా మోసాన్ని చెప్పింది. దాంతో మేము కూడా భక్తుల్లాగే వెళ్లి అతడు మేకులను ఎక్కడ దాస్తున్నాడో, ఎలా తీస్తున్నాడో చూపించాం. అప్పటికే అక్కడ ఉన్న భక్తులు మమ్మల్ని గట్టిగా వ్యతిరేకించారు. మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పమనడంతో వాళ్లు కూడా తార్కికంగా ఆలోచించి సమాధానపడ్డారు. ఆ స్వామీజీని పోలీసులకు పట్టివ్వడానికి కూడా సహకరించారు.
 - టి. రమేశ్, ప్రధాన కార్యదర్శి,  ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ కాంగ్రెస్ నెట్‌వర్క్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement