కట్టుకున్న భర్తనే కడతేర్చింది..!
మోమిన్‌పేట: రెండు వేర్వేరు హత్యా కేసులకు సంబంధించి నలుగుర్ని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అదనపు కట్నం వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించిన వివాహితకు ఆమె భర్తే నిప్పంటించి ఆమె మృతికి కారకుడయ్యాడు. మరోకేసులో వివాహేతర సంబంధం గురించి తరచూ సూటిపోటి మాటలతో వేధిస్తున్నాడరి ఓ మహిళ తన ప్రయుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. మోమిన్‌పేట సర్కిల్ ఇన్స్‌పెక్టరు ఎ.వి.రంగా తెలిపిన వివరాలు..
బెదిరిస్తే నిజమే చేశాడు..
ధారూర్ మండలం తరిగోపుల గ్రామానికి చెందిన చాకలి ప్రభావతి(32), భీమయ్యలు దంపతులు. వీరికి 20సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు కుమారులున్నారు. అయితే నాలుగేళ్లు అదనపు కట్నం కింద బైక్ ఇప్పించాలంటూ భీమయ్య తరచూ ప్రభావతిని వేధించడం ప్రారంభించాడు. దీనికి అతడి తల్లి సంగమ్మ కూడా సహకరించేది. ఈ క్రమంలో ఈ నెల 5న అదనపు కట్నం వేధింపులు ఆపకుంటే ఆత్మహత్యకు పాల్పడతానంటూ భర్తను బెదిరించేందుకు ప్రభావతి ఒంటిపై కిరోసిన్ పోసుకుంది.
అయితే ఆమెను ఆపాల్సిందిపోయి భీమయ్య అగ్గిపెట్టె అంటించి ఆమెకు నిప్పంచించాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో న్యాయమూర్తి ఎదుట భీమయ్య, సంగమ్మలే తనకు నిప్పంటిం చారని ప్రభావతి వాంగ్మూలం ఇచ్చింది. అనంతరం చికిత్స పొందుతూ ఈ నెల 19న మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దర్ని మంగళవారం రిమాండుకు తరలించారు.
అడ్డు తొలగించుకున్నారు
మర్పల్లి మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన తెలుగు చెన్నయ్య(60), రాములమ్మలు భార్యాభర్తలు. అయితే గతంలో రాములమ్మ అదే గ్రామానికి చెందిన బోయిని బాలయ్యతో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ విషయమై ఇప్పటికీ రాములమ్మను సూటిపోటి మాటలతో చెన్నయ్య వేధించేవాడు.
దీంతో తన భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన రాములమ్మ బాలయ్యతో కలిసి పన్నాగం పన్నింది. ముందస్తు వ్యూహం మేరకు అక్టోబర్ 25న రాములమ్మ, బాలయ్యలు కలిసి చెన్నయ్యను మోమిన్‌పేట సంతకు తీసుకొచ్చారు. అనంతరం మోమిన్‌పేటలోని పెట్రోల్ బంక్ వెనుకాల ఉన్న పత్తి పొలంలో చెన్నయ్యకు ఫూటుగా మద్యం తాగించారు.
తర్వాత మత్తులో ఉన్న చెన్నయ్య మర్మంగాలను తాడుతో గట్టిగ కట్టేసి దారుణంగా హత్య చేసి స్వగ్రామానికి వెళ్లిపొయారు. అక్టోబరు 30న పొలంలో గుర్తు తెలియని మృతదేహాన్ని గమనించిన పోలీసులు మర్పల్లి ప్రభుత్వాస్పత్రిలో పొస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని భద్రపరిచారు. కాగా మృతుని కమీజుపై వీర్లపల్లి టైలరు అనే పేరు ఉండటంతో ఆ గ్రామంలో డప్పు చాటింపు వేయించారు. ఆ తర్వాత రాములమ్మ తన భర్త ఐదు రోజుల క్రితం బంధువుల వద్దకు వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆస్పత్రిలోని మృతదేహాన్ని పరిశీలించి అది తన భర్తదేనంటూ తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించింది. రాములమ్మ వ్యవహారశైలిని అనుమానించిన పోలీసులు ఆమెపై నిఘా పెట్టారు. దీంతో తాము హత్య చేసిన సంగతి బయటపడుతుందని ఆందోళనకు గురైన రాములమ్మ, బాలయ్యలు మంగళవారం మోమిన్‌పేట తహసీల్దార్ రవీందర్ ఎదుట లొంగిపోయారు. పోలీసులు వారిద్దర్ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.