the money
-
ఇదీ ఆటంటే!
కర్నూలు: తిమ్మిని బమ్మి చేయడం.. బమ్మిని తిమ్మి చేయడంలో పోలీసులు సిద్ధహస్తులు. కేసులో ఇరికించాలన్నా.. బయటపడేయాలన్నా వీరికి వెన్నెతో పెట్టిన విద్య. అంతే కాదు.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడంలోనూ నేర్పరులే. ఈ కోవలోనే ఓ సారు పేకాట సొమ్ములో చేతివాటం చూపారు. గార్గేయపురం శివారులోని రాంపురం కొత్తూరు రోడ్డు సమీప పొలాల్లో పేకాట ఆడుతుండగా ఆదివారం మధ్యాహ్నం తాలూకా ఎస్ఐ విజయభాస్కర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. తొమ్మిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి రూ.28,350 స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే తమ వద్ద భారీగానే నొక్కేసినట్లు ఆటగాళ్లు చెబుతుండటం గమనార్హం. వాస్తవంగా శనివారం రాత్రి 11 గంటల సమయంలో కొంతమంది పేకాట ముగించుకుని వస్తుండగా గార్గేయపురం మలుపు వద్ద పోలీసులు కాపు కాసి అదుపులోకి తీసుకుని వారి నుంచి డబ్బు లాక్కున్నారు. పేకాటరాయుళ్లలో ఒకరిచ్చిన సమాచారం మేరకు తొమ్మిది మంది వద్ద భారీ మొత్తంలో డబ్బు నొక్కేశారు. కర్నూలులోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన సుబ్బారెడ్డి పేకాట ముగించుకుని మరో మార్గంలో కర్నూలు చేరుకున్నాడు. అదే కాలనీకి చెందిన గోపాల్ మోటార్ సైకిల్‌పై వస్తూ గార్గేయపురం మలుపు వద్ద పోలీసులకు చిక్కాడు. అతని ద్వారా సుబ్బారెడ్డి పేకాటలో పాల్గొన్నట్లు తెలుసుకుని పోలీసులు కర్నూలులోని అతని ఇంటికి వెళ్లి అర్ధరాత్రి హల్చల్ చేశారు. ముఖంపై పిడిగుద్దులు గుద్ది, బీరువా తెరిపించి.. అందులోని రూ.47వేలు లాక్కున్నట్లు సమాచారం. పేకాటలో గెలిచిన డబ్బు కాదు సార్.. ముఖ్యమైన పని కోసం ఏటీఎంలో డ్రా చేశానని, కావాలంటే సీరియన్ నెంబర్లు చూసుకోండని ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. అదేవిధంగా బోదెపాడు శ్రీను అనే వ్యక్తి వద్ద రూ.20వేలు నొక్కేసి కేసు పెట్టకుండా వదిలేశారు. ధనుంజయరాజ్ నుంచి రూ.26వేలు, బసవరాజు నుంచి రూ.18వేలు, గోపాల్ నుంచి రూ.8వేలు, జనార్దన్ నుంచి రూ.30వేలు, రఘునాథరెడ్డి నుంచి రూ.9వేలు వసూలు చేసుకుని కేసులు నమోదు చేశారు. పలుకూరు గ్రామానికి చెందిన మరికొందరు పేకాట ఆడేందుకు కారులో వస్తుండగా వెంకాయపల్లె వద్ద అడ్డుకుని రూ.50వేల వరకు నొక్కేసినట్లు బాధితులు ‘సాక్షి’కి తెలిపారు. అయితే పోలీసు శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు జంకుతున్నారు. ఈ విషయంపై ఎస్ఐ విజయభాస్కర్‌ను వివరణ కోరగా ‘అదంతా ఫేక్. మీరు ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దు. గత వారంలో తాండ్రపాడు వద్ద పేకాటరాయుళ్లపై దాడి చేసి పట్టుకోగా కొందరు విలేకరులు అక్కడికొచ్చారు. సార్.. రూ.6 లక్షలు దొరికాయట కదా.. అని అడిగారు. అది కూడా తప్పుడు ప్రచారమే. గార్గేయపురం వద్ద తొమ్మిది మంది జూదరులను అరెస్టు చేసి వారి వద్ద రూ.28,350 మాత్రమే స్వాధీనం చేసుకున్నాం.’ అని తెలిపారు. -
మీ ఫోన్‌కు లాటరీ తగిలింది
‘హలో సార్.. మీరు లక్కీ ఫెలో.. మా సంస్థ వంద మందికి లక్కీడిప్ నిర్వహించగా అందులో మీ నెంబర్ తగిలింది.. ఇందుకుగాను మీకు *లక్ష పాలసీని మేము ఇస్తాం.. మీరు కేవలం మీ ఫ్యామిలీతో మా ఆఫీస్‌కు వచ్చి అడ్రస్ ప్రూఫ్, ఐడీ, ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఇస్తే చాలు..’ అని తరచూ ఫోన్లు చేసి కార్యాలయానికి రప్పిస్తారు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి *లక్ష పాలసీ అటు ఉంచితే వచ్చిన వారి నెత్తిన టోపీ వేసి వారితోనే *పది వేల నుంచి *20వేలు వసూలు చేస్తూ యథేచ్ఛగా దందాను మొదలెట్టారు.. వారి మాటలను నమ్మి డబ్బులు కట్టిన బాధితులంతా అసలు విషయాన్ని తెలుసుకుని లబోదిబోమంటున్నారు.. ఇది ఎక్కడో కాదు, జిల్లా కేంద్రంలోనే ఇలా మోసం కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. క్లాక్‌టవర్ (మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ పట్టణం పద్మావతీకాలనీలో రెండేళ్ల క్రితం కార్వే అనే సంస్థను ప్రారంభించి జిల్లా వాసులను సిబ్బందిగా నియమించుకున్నారు. ‘ఇక మీరు లక్కీ ఫెలో...’ అంటూ వందల సంఖ్యలో బాధితుల నుంచి *70లక్షలకు పైగా వసూలు చేశారు. అంతలోనే తేరుకున్న బాధితులు అప్పటి కలెక్టర్ పురుషోత్తంరెడ్డికి ఫిర్యాదు చేయడంతో పోలీసులను రంగంలోకి దింపారు. దీంతో సంస్థ అసలు బాగోతం బయటపడింది. అంతా బోగస్సేనని తేలడంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి బాధితులరే డబ్బులు తిరిగి ఇప్పించేశారు. ఈ సంఘటన మరువకముందే ఇప్పుడు మరో సంస్థ అదే స్థానంలో వెలసింది. ఈ సంస్థ అన్ని టెలీ కమ్యూనికేషన్లలో ఉన్న వినయోగదారుల నంబర్లను సంపాదించుకుంది. ప్రతిరోజూ వంద మందికిపైగా ఫోన్లు చేస్తూ యథేచ్ఛగా టోకరా వేస్తోంది. ఈ సంస్థ చేతిలో ఇంతవరకు 500మందికిపైగా డబ్బులు చెల్లించి దిక్కుతోచని పరిస్థితిలో ఉండి వాటిని రాబట్టుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో పనిచేసే వారు రోజులో ఎవరికైనా ఫోన్లు చేసి లక్కీ ఫెలో అంటూ మాయమాటలు చెప్పి వారిని నిలువునా దోచేస్తున్నారు. ఇది జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో జోరుగా ప్రచారం సాగుతున్నా పట్టించుకునే నాథుడు కానీ, చర్యలు తీసుకునే వారే కరువయ్యారు. ఇలా వెలుగులోకి.... ఈనెల 20న ఆత్మకూర్ పట్టణానికి చెందిన ఇసాక్‌కు ఫోన్ చేసి లక్కీ ఫెలోఅంటూ మాయమాటలు చెప్పడంతో అతను భార్య మరియమ్మతో కలిసి కార్యాలయానికి వెళ్లాడు. తమది రిలయన్స్ ఇన్సూరెన్స్ కార్యాలయం అని చెప్పి రకరకాల మాయమాటలు చెప్పారు. *లక్ష మీకు రావాలంటే ముందుగా *పది వేలు చెల్లించాలని పట్టుబట్టారు. దీంతో అతను చేసేదిలేక తన భార్య పేరిట *8,500 చెల్లించగా వారు ‘ఐఐఎఫ్ఎల్’కు చెందిన రశీదును ఇచ్చారు. ఇది చూసిన బాధితులు ‘రిలయన్స్ అన్నారు, ఇదేమిటి..’ అని ప్రశ్నించగా, అంతా నెలరోజులు ఆగితే తమకే తెలుస్తుందని సమాధానమిచ్చారు. అనుమానం వచ్చిన ఆయన తనకు తెలిసిన బంధువులను సంప్రదించి సంస్థ ప్రతినిధులను గట్టిగా నిలదీయగా తీసుకున్న డబ్బులను తిరిగిచ్చేశారు. ఇలాంటి మోసపూరిత సంస్థను తనలా ఎవ రూ డబ్బులు కట్టి మోసపోవద్దని, ఇలాంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
నచ్చిన కొలువే నిచ్చెన మెట్టు
ప్రేరణ మీకు ఏది ఆనందాన్ని ఇస్తుందో.. ఆ పనే చేయండి! మిమ్మల్ని మీరు ప్రగాఢంగా విశ్వసించండి. శ్రమించండి. మీ ప్రగతికి అడ్డొచ్చే ఎలాంటి సాకులనూ అస్సలు దరిచేరనీయకండి!! మీకు ఏమాత్రం ఇష్టంలేని ఉద్యోగంలో ఇరుక్కుపోయామని మదనపడుతున్నారా..! మీరిప్పుడు చేస్తున్న ఉద్యోగంతో డబ్బు, సమాజంలో గుర్తింపు అనేది ఎప్పటికీ ఎండమావేననిపిస్తోందా..! అయితే, మీరిప్పుడు గెయిల్ కెల్లీ ఉద్వేగభరిత విజయగాథను తెలుసుకోవాల్సిందే..! దక్షిణాఫ్రికాకు చెందిన 54ఏళ్ల గెయిల్ ఇప్పుడు ఆస్ట్రేలియాలోని అతిపెద్ద బ్యాంక్ వెస్ట్‌ప్యాక్-సీఈవో. అంతేకాదు ఆస్ట్రేలియాలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఇది వాస్తవ వర్తమానం, కాని, గతంలో ఆమె అతి సామాన్యురాలు. అతి సాధారణ మహిళ నుంచి అత్యంత ధనవంతురాలిగా గెయిల్ ఎదిగిన క్రమం చూస్తే- ఇష్టమైన పనిని అలుపుసొలుపూ లేకుండా చేస్తుంటే.. ఆస్తిపాస్తులు, పేరుప్రఖ్యాతలు ఇట్టే వచ్చిపడతాయన్నది నిజమనిపిస్తుంది. గెయిల్ 1954లో దక్షిణాఫ్రికాలో సాధారణ కుటుంబంలో జన్మించింది. ఓ సగటు విద్యార్థిలాగే డిగ్రీ పూర్తిచేసుకుంది. 21ఏళ్లకే తోటి విద్యార్థితో ప్రేమలో పడింది. పెళ్లి కూడా చేసుకుంది. భర్తకు జింబాబ్వేలో ఉద్యోగం రావడంతో గృహిణిలా అతనితోపాటు అక్కడకు వెళ్లింది. ఏడాది తర్వాత ఆ దంపతులు స్వదేశానికి తిరిగివచ్చారు. గెయిల్ ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా చేరింది. ఆ రోజుల గురించి ఆమెకు గుర్తుందల్లా.. గడుగ్గాయులైన కొంతమంది విద్యార్థులు, వాళ్లపై ఆమె అరుపులు! ఒక రోజు ఓ విద్యార్థి స్పోర్ట్స్ రూమ్‌లో తన టీషర్ట్ వదిలేసి వస్తాడు. ఆ విద్యార్థిపై గెయిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా అరుస్తుంది. ‘‘చిన్న పిల్లలపై నేను అరవడం, ఆగ్రహించుకోవడం నాకే నచ్చలేదు. నాపట్ల నాకే చాలా సిగ్గనిపించింది. నా అసంతృప్తిని విద్యార్థులపై చూపిస్తున్నానిపించింది’’ అంటారు గెయిల్ ఆ రోజులను గుర్తుచేసుకుంటూ! మరుసటి రోజు ఆమె పాఠశాలకు వెళ్లేందుకు బస్సులో కూర్చుందేకాని.. మనసంతా ఏవో ఆలోచనలు.. అక్కడ అసలు పాఠశాలే లేనట్టు, ఆమె అందులో టీచర్ కానట్టు.. ఇలా రకరకాల ఆలోచనలు.. ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకుంది. అంతే.. ఆ క్షణమే బస్సు దిగేసింది. ఆ రోజు స్కూల్ బస్సు దిగడం.. గెయిల్ జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్. తర్వాత గెయిల్‌కు ఓ బ్యాంక్‌లో చిన్న ఉద్యోగం దొరికింది. తనకిష్టమైన బ్యాంక్ జాబ్ కావడంతో బాగా పనిచేసింది. కొద్దికాలంలోనే పదోన్నతి పొందింది. అలా పనిచేస్తూ ఉండగానే 30ఏళ్ల వయసులో మొదటి బిడ్డకు జన్మ ఇచ్చింది. బిడ్డ ఆలనాపాలనా చూస్తూనే ఎంబీఏ పూర్తిచేసింది. ఆమె ఎంత ఇష్టంగా, నిబద్ధతతో పనిచేస్తుందో తెలిసిన బ్యాంక్ యాజమాన్యం.. చంటిపిల్ల తల్లి అయినా తిరిగి ఉద్యోగంలో చేర్చుకుంది. అమోఘమైన పని తీరుతో కెరీర్లో ఉన్నత స్థానాల దిశగా ఒక్కో మెట్టూ ఎక్కసాగింది. ఈ లోపే మళ్లీ గర్భం.. ఈసారి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు. ఆశ్చర్యంగా.. కాన్పు అయిన 5 నెలలకే గెయిల్ మళ్లీ బ్యాంక్‌కు వ చ్చి ఉత్సాహంగా బాధ్యతలు చేపట్టింది. ఇష్టమైన పని కావడంతో సంతోషంగా చేసానంటారామె! అలా చేస్తూనే పిల్లలకు మరింత మంచి భవిష్యత్ అందించాలనే లక్ష్యంతో గెయిల్ దంపతులు ఆస్ట్రేలియా ప్రయాణమయ్యారు. అక్కడ బ్యాంక్ ఉద్యోగంలో చేరి తన అద్భుత పనితీరుతో.. 54 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన వెస్ట్ప్యాక్కు సీఈవో అయ్యారు. కెరీర్లో తన ఉన్నతికి పాషన్(అమితమైన ఇష్టం), హార్డ్‌వర్క్ (శ్రమించడం), ఉన్నత విద్య- ఎంబీఏ, మంచి టీం, వెన్నంటి నిలిచే భర్త ప్రధాన కారణాలంటారు గెయిల్. వీటన్నింటికంటే కూడా తనకిష్టం లేని టీచర్ ఉద్యోగాన్ని వదిలేందుకు ఆ రోజు స్కూల్ బస్సు దిగకపోయి ఉంటే.. ఈ రోజు అతిపెద్ద బ్యాంక్‌కు సీఈవోను అయ్యేదాన్ని కాదంటారు! ఓ సాధారణ స్కూల్ టీచర్ అతిపెద్ద బ్యాంక్‌కు సీఈవో కాగలిగినప్పుడు.. మీరెందుకు కెరీర్లో ఉన్నతంగా ఎదగలేరు. కచ్చితంగా ఎదగొచ్చు. కాకపోతే నచ్చని పనిని వదిలేయాలి. ఇష్టమైన పనిని సంతోషంగా చేయాలి. బాగా శ్రమించాలి. మీ మీద మీరు నమ్మకం పెంచుకోవాలి. సాకులు అంటే.. నాకు ఎంబీఏ లేదు.. నేను పిల్లల్ని చూసుకోవాలి.. బదిలీలు అయితే ఊళ్లు మారలేను.. వంటివి మీ ఎదుగుదలకు ప్రతిబంధకాలు కాకుండా చూసుకోండి. గెయిల్ విజయగాథ మనకు ఇస్తున్న సందేశం ఒక్కటే- నచ్చని పని చేస్తున్నారా.. వెంటనే వదిలేయండి. ప్రయాణం ఆనందం ఇవ్వడంలేదా.. బస్సు దిగేసేయండి. మీ కోసం మరెన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న సంగతి మరవకండి! మనలో చాలామంది జీవితాంతం నచ్చని పనిని అంటిపెట్టుకొని ఉంటారు. చేస్తున్న పనిని ప్రతిక్షణం ద్వేషిస్తుంటారు. ఇది వారి పని పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయినా, ఇష్టమైన పనికి మారాలన్న ఆలోచన చేయరు. కారణం.. చేస్తున్న ఉద్యోగం వదిలేసే ధైర్యం లేకపోవడమే! ప్రయాణం నచ్చకపోయినా.. బస్సు దిగే ప్రయత్నం చేయరు. జీవితం చాలా చిన్నది. ఇష్టంలేని పనిచేస్తూ అమూల్యమైన సమయం వృథా చేసుకోవడం సమర్థనీయం కాదు. ఏ పనైతే సంతోషంగా చేస్తారో అందులో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ. ఆనందాన్ని ఇచ్చే పనిచేస్తున్నప్పుడే ఏవైనా ప్రతిబంధకాలు ఎదురైతే.. వాటిని అధిగమించే సామర్థ్యం కూడా దానంతట అదే వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి. ఇష్టంలేని పనిలో మగ్గిపోకండి. గెయిల్ కెల్లీలా మీకు సంతోషం ఇచ్చే పనే చేయండి!! -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో