మీ ఫోన్‌కు లాటరీ తగిలింది
‘హలో సార్.. మీరు లక్కీ ఫెలో.. మా సంస్థ వంద మందికి లక్కీడిప్ నిర్వహించగా అందులో మీ నెంబర్ తగిలింది.. ఇందుకుగాను మీకు *లక్ష పాలసీని మేము ఇస్తాం.. మీరు కేవలం మీ ఫ్యామిలీతో మా ఆఫీస్‌కు వచ్చి అడ్రస్ ప్రూఫ్, ఐడీ, ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఇస్తే చాలు..’ అని తరచూ ఫోన్లు చేసి కార్యాలయానికి రప్పిస్తారు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి *లక్ష పాలసీ అటు ఉంచితే వచ్చిన వారి నెత్తిన టోపీ వేసి వారితోనే *పది వేల నుంచి *20వేలు వసూలు చేస్తూ యథేచ్ఛగా దందాను మొదలెట్టారు.. వారి మాటలను నమ్మి డబ్బులు కట్టిన బాధితులంతా అసలు విషయాన్ని తెలుసుకుని లబోదిబోమంటున్నారు.. ఇది ఎక్కడో కాదు, జిల్లా కేంద్రంలోనే ఇలా మోసం కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
క్లాక్‌టవర్ (మహబూబ్‌నగర్):
మహబూబ్‌నగర్ పట్టణం పద్మావతీకాలనీలో రెండేళ్ల క్రితం కార్వే అనే సంస్థను ప్రారంభించి జిల్లా వాసులను సిబ్బందిగా నియమించుకున్నారు. ‘ఇక మీరు లక్కీ ఫెలో...’ అంటూ వందల సంఖ్యలో బాధితుల నుంచి *70లక్షలకు పైగా వసూలు చేశారు. అంతలోనే తేరుకున్న బాధితులు అప్పటి కలెక్టర్ పురుషోత్తంరెడ్డికి ఫిర్యాదు చేయడంతో పోలీసులను రంగంలోకి దింపారు.
దీంతో సంస్థ అసలు బాగోతం బయటపడింది. అంతా బోగస్సేనని తేలడంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి బాధితులరే డబ్బులు తిరిగి ఇప్పించేశారు. ఈ సంఘటన మరువకముందే ఇప్పుడు మరో సంస్థ అదే స్థానంలో వెలసింది. ఈ సంస్థ అన్ని టెలీ కమ్యూనికేషన్లలో ఉన్న వినయోగదారుల నంబర్లను సంపాదించుకుంది. ప్రతిరోజూ వంద మందికిపైగా ఫోన్లు చేస్తూ యథేచ్ఛగా టోకరా వేస్తోంది.
ఈ సంస్థ చేతిలో ఇంతవరకు 500మందికిపైగా డబ్బులు చెల్లించి దిక్కుతోచని పరిస్థితిలో ఉండి వాటిని రాబట్టుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో పనిచేసే వారు రోజులో ఎవరికైనా ఫోన్లు చేసి లక్కీ ఫెలో అంటూ మాయమాటలు చెప్పి వారిని నిలువునా దోచేస్తున్నారు. ఇది జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో జోరుగా ప్రచారం సాగుతున్నా పట్టించుకునే నాథుడు కానీ, చర్యలు తీసుకునే వారే కరువయ్యారు.
ఇలా వెలుగులోకి....
ఈనెల 20న ఆత్మకూర్ పట్టణానికి చెందిన ఇసాక్‌కు ఫోన్ చేసి లక్కీ ఫెలోఅంటూ మాయమాటలు చెప్పడంతో అతను భార్య మరియమ్మతో కలిసి కార్యాలయానికి వెళ్లాడు. తమది రిలయన్స్ ఇన్సూరెన్స్ కార్యాలయం అని చెప్పి రకరకాల మాయమాటలు చెప్పారు. *లక్ష మీకు రావాలంటే ముందుగా *పది వేలు చెల్లించాలని పట్టుబట్టారు.
దీంతో అతను చేసేదిలేక తన భార్య పేరిట *8,500 చెల్లించగా వారు ‘ఐఐఎఫ్‌ఎల్’కు చెందిన రశీదును ఇచ్చారు. ఇది చూసిన బాధితులు ‘రిలయన్స్ అన్నారు, ఇదేమిటి..’ అని ప్రశ్నించగా, అంతా నెలరోజులు ఆగితే తమకే తెలుస్తుందని సమాధానమిచ్చారు. అనుమానం వచ్చిన ఆయన తనకు తెలిసిన బంధువులను సంప్రదించి సంస్థ ప్రతినిధులను గట్టిగా నిలదీయగా తీసుకున్న డబ్బులను తిరిగిచ్చేశారు. ఇలాంటి మోసపూరిత సంస్థను తనలా ఎవ రూ డబ్బులు కట్టి మోసపోవద్దని, ఇలాంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.