నచ్చిన కొలువే నిచ్చెన మెట్టు
ప్రేరణ
మీకు ఏది ఆనందాన్ని ఇస్తుందో.. ఆ పనే చేయండి! మిమ్మల్ని మీరు ప్రగాఢంగా విశ్వసించండి. శ్రమించండి. మీ ప్రగతికి అడ్డొచ్చే ఎలాంటి సాకులనూ అస్సలు దరిచేరనీయకండి!!
మీకు ఏమాత్రం ఇష్టంలేని ఉద్యోగంలో ఇరుక్కుపోయామని మదనపడుతున్నారా..! మీరిప్పుడు చేస్తున్న ఉద్యోగంతో డబ్బు, సమాజంలో గుర్తింపు అనేది ఎప్పటికీ ఎండమావేననిపిస్తోందా..! అయితే, మీరిప్పుడు గెయిల్ కెల్లీ ఉద్వేగభరిత విజయగాథను తెలుసుకోవాల్సిందే..!
దక్షిణాఫ్రికాకు చెందిన 54ఏళ్ల గెయిల్ ఇప్పుడు ఆస్ట్రేలియాలోని అతిపెద్ద బ్యాంక్ వెస్ట్‌ప్యాక్-సీఈవో. అంతేకాదు ఆస్ట్రేలియాలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఇది వాస్తవ వర్తమానం, కాని, గతంలో ఆమె అతి సామాన్యురాలు. అతి సాధారణ మహిళ నుంచి అత్యంత ధనవంతురాలిగా గెయిల్ ఎదిగిన క్రమం చూస్తే- ఇష్టమైన పనిని అలుపుసొలుపూ లేకుండా చేస్తుంటే.. ఆస్తిపాస్తులు, పేరుప్రఖ్యాతలు ఇట్టే వచ్చిపడతాయన్నది నిజమనిపిస్తుంది.
గెయిల్ 1954లో దక్షిణాఫ్రికాలో సాధారణ కుటుంబంలో జన్మించింది. ఓ సగటు విద్యార్థిలాగే డిగ్రీ పూర్తిచేసుకుంది. 21ఏళ్లకే తోటి విద్యార్థితో ప్రేమలో పడింది. పెళ్లి కూడా చేసుకుంది. భర్తకు జింబాబ్వేలో ఉద్యోగం రావడంతో గృహిణిలా అతనితోపాటు అక్కడకు వెళ్లింది. ఏడాది తర్వాత ఆ దంపతులు స్వదేశానికి తిరిగివచ్చారు. గెయిల్ ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా చేరింది. ఆ రోజుల గురించి ఆమెకు గుర్తుందల్లా.. గడుగ్గాయులైన కొంతమంది విద్యార్థులు, వాళ్లపై ఆమె అరుపులు! ఒక రోజు ఓ విద్యార్థి స్పోర్ట్స్ రూమ్‌లో తన టీషర్ట్ వదిలేసి వస్తాడు. ఆ విద్యార్థిపై గెయిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా అరుస్తుంది. ‘‘చిన్న పిల్లలపై నేను అరవడం, ఆగ్రహించుకోవడం నాకే నచ్చలేదు. నాపట్ల నాకే చాలా సిగ్గనిపించింది. నా అసంతృప్తిని విద్యార్థులపై చూపిస్తున్నానిపించింది’’ అంటారు గెయిల్ ఆ రోజులను గుర్తుచేసుకుంటూ! మరుసటి రోజు ఆమె పాఠశాలకు వెళ్లేందుకు బస్సులో కూర్చుందేకాని.. మనసంతా ఏవో ఆలోచనలు.. అక్కడ అసలు పాఠశాలే లేనట్టు, ఆమె అందులో టీచర్ కానట్టు.. ఇలా రకరకాల ఆలోచనలు.. ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకుంది. అంతే.. ఆ క్షణమే బస్సు దిగేసింది. ఆ రోజు స్కూల్ బస్సు దిగడం.. గెయిల్ జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్.
తర్వాత గెయిల్‌కు ఓ బ్యాంక్‌లో చిన్న ఉద్యోగం దొరికింది. తనకిష్టమైన బ్యాంక్ జాబ్ కావడంతో బాగా పనిచేసింది. కొద్దికాలంలోనే పదోన్నతి పొందింది. అలా పనిచేస్తూ ఉండగానే 30ఏళ్ల వయసులో మొదటి బిడ్డకు జన్మ ఇచ్చింది. బిడ్డ ఆలనాపాలనా చూస్తూనే ఎంబీఏ పూర్తిచేసింది. ఆమె ఎంత ఇష్టంగా, నిబద్ధతతో పనిచేస్తుందో తెలిసిన బ్యాంక్ యాజమాన్యం.. చంటిపిల్ల తల్లి అయినా తిరిగి ఉద్యోగంలో చేర్చుకుంది. అమోఘమైన పని తీరుతో కెరీర్‌లో ఉన్నత స్థానాల దిశగా ఒక్కో మెట్టూ ఎక్కసాగింది. ఈ లోపే మళ్లీ గర్భం.. ఈసారి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు. ఆశ్చర్యంగా.. కాన్పు అయిన 5 నెలలకే గెయిల్ మళ్లీ బ్యాంక్‌కు వ చ్చి ఉత్సాహంగా బాధ్యతలు చేపట్టింది. ఇష్టమైన పని కావడంతో సంతోషంగా చేసానంటారామె! అలా చేస్తూనే పిల్లలకు మరింత మంచి భవిష్యత్ అందించాలనే లక్ష్యంతో గెయిల్ దంపతులు ఆస్ట్రేలియా ప్రయాణమయ్యారు. అక్కడ బ్యాంక్ ఉద్యోగంలో చేరి తన అద్భుత పనితీరుతో.. 54 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన వెస్ట్‌ప్యాక్‌కు సీఈవో అయ్యారు.
కెరీర్‌లో తన ఉన్నతికి పాషన్(అమితమైన ఇష్టం), హార్డ్‌వర్క్ (శ్రమించడం), ఉన్నత విద్య- ఎంబీఏ, మంచి టీం, వెన్నంటి నిలిచే భర్త ప్రధాన కారణాలంటారు గెయిల్. వీటన్నింటికంటే కూడా తనకిష్టం లేని టీచర్ ఉద్యోగాన్ని వదిలేందుకు ఆ రోజు స్కూల్ బస్సు దిగకపోయి ఉంటే.. ఈ రోజు అతిపెద్ద బ్యాంక్‌కు సీఈవోను అయ్యేదాన్ని కాదంటారు!
ఓ సాధారణ స్కూల్ టీచర్ అతిపెద్ద బ్యాంక్‌కు సీఈవో కాగలిగినప్పుడు.. మీరెందుకు కెరీర్‌లో ఉన్నతంగా ఎదగలేరు. కచ్చితంగా ఎదగొచ్చు. కాకపోతే నచ్చని పనిని వదిలేయాలి. ఇష్టమైన పనిని సంతోషంగా చేయాలి. బాగా శ్రమించాలి. మీ మీద మీరు నమ్మకం పెంచుకోవాలి. సాకులు అంటే.. నాకు ఎంబీఏ లేదు.. నేను పిల్లల్ని చూసుకోవాలి.. బదిలీలు అయితే ఊళ్లు మారలేను.. వంటివి మీ ఎదుగుదలకు ప్రతిబంధకాలు కాకుండా చూసుకోండి.
గెయిల్ విజయగాథ మనకు ఇస్తున్న సందేశం ఒక్కటే- నచ్చని పని చేస్తున్నారా.. వెంటనే వదిలేయండి. ప్రయాణం ఆనందం ఇవ్వడంలేదా.. బస్సు దిగేసేయండి. మీ కోసం మరెన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న సంగతి మరవకండి! మనలో చాలామంది జీవితాంతం నచ్చని పనిని అంటిపెట్టుకొని ఉంటారు. చేస్తున్న పనిని ప్రతిక్షణం ద్వేషిస్తుంటారు. ఇది వారి పని పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయినా, ఇష్టమైన పనికి మారాలన్న ఆలోచన చేయరు. కారణం.. చేస్తున్న ఉద్యోగం వదిలేసే ధైర్యం లేకపోవడమే! ప్రయాణం నచ్చకపోయినా.. బస్సు దిగే ప్రయత్నం చేయరు.
జీవితం చాలా చిన్నది. ఇష్టంలేని పనిచేస్తూ అమూల్యమైన సమయం వృథా చేసుకోవడం సమర్థనీయం కాదు. ఏ పనైతే సంతోషంగా చేస్తారో అందులో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ. ఆనందాన్ని ఇచ్చే పనిచేస్తున్నప్పుడే ఏవైనా ప్రతిబంధకాలు ఎదురైతే.. వాటిని అధిగమించే సామర్థ్యం కూడా దానంతట అదే వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి. ఇష్టంలేని పనిలో మగ్గిపోకండి. గెయిల్ కెల్లీలా మీకు సంతోషం ఇచ్చే పనే చేయండి!!
-‘కెరీర్స్ 360’ సౌజన్యంతో