మొయిత్రా వాకౌట్
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు నగదు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్ నైతిక విలువల కమిటీ ముందు హాజరై తర్వాత వాకౌట్ చేశారు. కమిటీ భేటీలో తీవ్ర అభ్యంతర, వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారంటూ ఆమె మధ్యలోనే బయటికొచ్చారు. ఆమెకు మద్దతు పలుకుతూ విపక్ష ఎంపీలు సైతం అర్ధంతరంగా బయటికొచ్చారు. కాగా, ‘ఎథిక్స్ కమిటీని మొయిత్రా తప్పుదోవ పట్టించే ప్రయత్నంచేశారు.
కమిటీ తప్పుడు విధానాలను అవలంబిస్తోందంటూ, కమిటీ నిర్వహణ పద్ధతిని మొయిత్రా తప్పుగా చిత్రించే దుస్సాహసం చేశారు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు. ‘నగదుకు ప్రశ్నలు’ ఆరోపణలుసహా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను పారిశ్రామికవేత్త దర్శన్ హీరానందానీకి మొయిత్రా ఇచ్చారని, దుబాయ్ నుంచి చాలాసార్లు లాగిన్ అయ్యా, విదేశాల్లో లాగిన్ అవడంతో దేశభద్రత ప్రమాదంలో పడిందని దూబే తీవ్ర ఆరోపణలు చేయడం తెల్సిందే. లోక్‌సభ స్పీకర్ బిర్లాకు దూబే ఫిర్యాదుచేయడంతో వివరణ కోరుతూ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మొయిత్రాను గురువారం పిలిచింది. ఈ భేటీ దాదాపు నాలుగు గంటలపాటు సాగింది.
అసభ్యమైన ప్రశ్నలు వేస్తున్నారు: మొయిత్రా
‘అసలు అవేం ప్రశ్నలు?. తీవ్ర అభ్యంతరకరమైన, అసభ్యమైన ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే బయటికొచ్చేశా’ అని అక్కడ ఉన్న మీడియాతో అన్నారు. ‘మీ కళ్లలో నీళ్లు తిరుగుతున్నట్లు ఉన్నాయిగా’ అని అక్కడున్న ఒక విలేకరి ప్రశ్నించగా.. ‘ఏమిటా చెత్త ప్రశ్న. చూడు నా కళ్లలో నీళ్లు కనిపిస్తున్నాయా?’ అంటూ మొయిత్రా తన రెండు కళ్లను చూపించారు. ‘అసలు ఇది ఎథిక్స్ కమిటీయేనా?. ముందే సిద్దంచేసిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారు’ అంటూ కమిటీపై మొయిత్రా ఆరోపణలు చేశారు. ‘‘కమిటీలో చైర్మన్ నన్ను మాటలతో ‘వ్రస్తాపహరణం’ చేశారు’’ అని ఫిర్యాదుచేస్తూ స్పీకర్ బిర్లాకు మొయిత్రా ఒక లేఖ రాశారు.
మొయిత్రా, కమిటీ చైర్మన్, సభ్యులు ఏమన్నారు?
మొయిత్రా వాకౌట్ తర్వాత ఎథిక్స్ కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకార్ మీడియాతో మాట్లాడారు. ‘ నిజానికి కమిటీ విధివిధానాలు, నిర్వహణ పద్ధతిపై మొయిత్రా తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. తర్వాత ఆమె, విపక్ష సభ్యులు చర్చ జరుగుతుండగానే మధ్యలో బయటికొచ్చేశారు’ అని చెప్పారు. ‘ మొయిత్రాను అడిగిన ప్రశ్నలు అగౌరవనీయం, అనైతికంగా ఉన్నాయి. ఎక్కడెక్కడ తిరిగారు. ఎవరితో మాట్లాడారు. మీ ఫోన్ రికార్డింగ్‌లు ఇవ్వాలని కమిటీ అడిగింది’ అని కాంగ్రెస్ ఎంపీ, ప్యానెల్ సభ్యుడు అయిన ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ‘రాత్రిళ్లు ఎవరితో మాట్లాడతారు? ఎలాంటి విషయాలు మాట్లాడతారు? అని ఆమెను ప్రశ్నించారు. మహిళా ఎంపీని చైర్మన్ ప్రశ్నలు అడిగే పద్దతి ఇదేనా? ద్రౌపది వస్త్రాపహరణం తరహాలో విచారణ కొనసాగింది’ అని కమిటీ సభ్యుడు డ్యానిష్ అలీ ఆరోపించారు.
ఆ లాయర్ వల్లే ఇదంతా !
బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేకు బలమైన సాక్ష్యాలు ఇచ్చారంటూ వార్తల్లో నిలిచిన న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ గతంలో మొయిత్రాకు బాగా తెలుసు. వీరిద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేసి విడిపోయారు. విడిపోయేటపుడు జరిగిన గొడవకు ప్రతీకారంగానే జై అనంత్ ఇవన్నీ చేస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. కమిటీ ముందు ఇవే అంశాలను మొయిత్రా ప్రస్తావించారని తెలుస్తోంది. అయితే, దేహద్రాయ్‌తో బంధం విడిపోయిన విషయం పక్కనబెట్టి ‘నగదుకు ప్రశ్నలు’ అంశంపై వివరణ ఇవ్వాలని కోరినా ఆమె పట్టించుకోలేదని బీజేపీ ఎంపీ, కమిటీ సభ్యుడు విష్ణుదత్ శర్మ ఆరోపించారు.