రక్తపుమడుగులో మృతదేహం
నల్లకుంట: ఆస్తి వివాదం మహిళ హత్యకు దారి తీసింది. కోర్టులో కేసు వీగిపోవడంతో కక్షగట్టిన ఓ వ్యక్తి ఉదయాన్నే షాపుకెళ్లి పాల ప్యాకెట్ తీసుకొని ఇంటికి వెళ్తున్న మహిళను అడ్డగించి రాడ్‌తో తలపై బాది అతికిరాతకంగా చంపేశాడు. అక్కడి నుంచి నేరుగా నల్లకుంట పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
ఇన్ స్పెక్టర్ యాదగిరిరెడ్డి తెలిపిన వివరాలు... శంకర్‌మఠం సమీపంలో టైలర్ షాప్ నిర్వహిస్తున్న చెగూరి సత్యనారాయణ, ఉమ (56) దంపతులు 1992లో అడిక్‌మెట్ దయానంద్ నగర్‌లో నర్సింగ్‌రావు అనే వ్యక్తి వద్ద 50 గజాల స్థలం కొన్నారు. 1993లో ఆ స్థలాన్ని ఉమ పేరిట నోటరీ చేయించుకుని ఇల్లు నిర్మించుకొని ఉంటున్నారు. సచివాలయంలో లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న పి. దర్మరాజు అనే వ్యక్తి వీరింటి పక్కనే ఉంటున్నాడు.
ఉమ దంపతులు నిర్మించుకున్న స్థలం తనదంటూ ధర్మరాజు కొన్నేళ్లుగా ఉమ కుటుంబసభ్యులతో ఘర్షణ పడుతున్నాడు. రెండేళ్ల క్రితం ధర్మరాజు కోర్టుకు వెళ్లగా, ఆ స్థలం ఉమ కుటుంబ సభ్యులకే దక్కుతుందని తీర్పునిస్తూ ధర్మరాజు వేసిన పిటిషన్ ను కొట్టేసింది. దీంతో కక్షగట్టిన ధర్మరాజు ఎలాగైనా ఉమను అంతమొందించాలని పథకం వేశాడు. బుధవారం ఉదయం 6.45కి షాపుకెళ్లి పాల ప్యాకెట్ తీసుకుని వస్తున్న ఉమను రోడ్డుపై అడ్డగించి రాడ్‌తో తలపై బలంగా కొట్టాడు.
తీవ్ర రక్తశ్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. కొద్దిసేపటి తర్వాత అటుగా వెళ్లిన బస్తీకి చెందిన ఓ వ్యక్తి రక్తపుమడుగులో పడి ఉన్న ఉమను చూసి ఆమె కుటుంబసభ్యులకు చెప్పాడు. ఇదిలా ఉండగా.. ధర్మరాజు హత్యకు ఉపయోగించిన ఇరుప రాడ్ తీసుకుని నేరుగా నల్లకుంట ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. హతురాలి కుమారుడు నవీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. విచారణ అనంతరం నిందితుడిని గురువారం రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.
రూ. లక్ష ఇస్తే స్థలం ఇచ్చేస్తామని చెప్పాం
1992లో లక్ష రూపాయలకు 50 గజాల స్థలాన్ని కొన్నాం. ఆ స్థలం తనదని ధర్మరాజు తరచూ మాతో గొడపడేవాడు. దీంతో విసిగిపోయిన మేము రూ. లక్ష ఇస్తే స్థలం వదిలి వెళ్లిపోతామన్నాం. అయినా వినకుండా రెండుసార్లు కోర్టుకు వెళ్లాడు. కోర్టు ఆ స్థలం మాకే చెందుతుందని తీర్పు చెప్పింది. దీంతో కక్షగట్టిన ధర్మారాజు రెండేళ్లుగా తరచూ గొడవపడేవాడు. చివరకు అన్యాయంగా నా భార్య ప్రాణం తీశాడు. అతడిని కఠినంగా శిక్షించాలి.
–సత్యనారాయణ, మృతురాలి భర్త