ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరితెగింపు
సాక్షి, విజయవాడ : కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు మరీ బరితెగించారు. ఏకంగా పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఏర్పాటుచేసిన ఎన్నికల శిబిరంలో కవర్లలో నగదు పెట్టి పంపిణీ చేపట్టారు. దీనిని గమనించిన సీపీఎం నేతలు డబ్బు పంపిణీ చేస్తున్న ముగ్గురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోగా.. వారిపై టీడీపీ నేతలు దాడికి దిగారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తొలి నుంచీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ నేతలు ఆదివారం ఏకంగా పోలింగ్ కేంద్రం వద్దే డబ్బు పంపిణీకి తెగబడ్డారు.
ఓటింగ్ జరుగుతున్న బిషప్ హజరయ్య హైస్కూల్ వద్ద టీడీపీ మద్దతుతో పోటీచేస్తున్న ఏఎస్ రామకృష్ణ వర్గం శిబిరం ఏర్పాటుచేసింది. దీనికి సమీపంలోనే వామపక్షాల మద్దతుతో యుటీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఎస్ లక్ష్మణరావు వర్గం కూడా టెంట్ వేసింది. ఓటు వేయడానికి వచ్చిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉదయం నుంచి టీడీపీ నేతలు డబ్బులు పంపిణీ చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం పంపిణీ ముమ్మరం చేయడంతో సీపీఎం నేతలు రామకృష్ణకు చెందిన ముగ్గురు అనుచరుల్ని పట్టుకుని వారి వద్ద నుంచి డబ్బులు ఉన్న కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, చెన్నుపాటి గాంధీ, సాంబశివరావు తదితరులు అక్కడే ఉన్నారు.
సీపీఎం నేతలపై బుద్దా ధ్వజం...
తమ అనుచరులు ముగ్గురినీ విడిపించేందుకు అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న స్వయంగా రంగంలోకి దిగి హడావుడి చేశారు. వామపక్షాల కార్యకర్తలను తోసివేశారు. అడ్డువచ్చిన వారిపై పెద్దగా అరుస్తూ తన వారిని గుంజుకుని తీసుకువెళ్లిపోయారు. దీంతో టీడీపీ కార్పొరేటర్లు, ఇతర కార్యకర్తలు మరింత రెచ్చిపోయి సీపీఎం కార్యకర్తలపై తెగబడ్డారు. పోలీసులు అడ్డువచ్చినా శాంతించలేదు. టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న పోలీసుల చేతిలోని లాఠీని పట్టుకుని అడ్డుకున్నారు. దీంతో సీపీఎం నాయకులు ఎదురుదాడికి దిగారు.
నోట్లు పంపిణీ చేసేవారిని అరెస్టు చేయాలంటూ రోడ్డుపైనే బైఠాయించారు. డబ్బు పంపిణీకి కారణమైన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, రామకృష్ణలపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, సీపీఎం నగర కార్యదర్శి సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. వారు స్వాధీనం చేసుకున్న నోట్లను మీడియాకు చూపించారు. పోలీసులు కూడా టీడీపీకే అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ రాకపోతే పోలీసులు నిందితుల్ని అదుపులోకి కూడా తీసుకునేవారు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను కూడా డబ్బుతో కొనాలని చూస్తున్నారని వారు ఆరోపించారు.
టీడీపీ నేతల ఎదురుదాడి...
రామకృష్ణ అనుచరుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న కవర్లకు తమకు సంబంధం లేదంటూ టీడపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న ఎదురుదాడికి దిగారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వామపక్షాల నేతలే డబ్బుల కవర్లు పంచుతున్నారంటూ ఆరోపించారు. దీన్ని అడ్డుకోబోయిన తన వర్గంపై దాడికి దిగారన్నారు. తమ వర్గంపై దాడి చేస్తే సహించబోమంటూ ఎదురు దాడికి దిగడంతో ఆశ్చర్యపోవడం వామపక్షాల నేతల వంతైంది.
తహశీల్దార్‌కు ఫిర్యాదు...
కలెక్టర్ బాబు.ఎ ఆదేశాలతో తహశీల్దార్ శివరావు రంగంలోకి దిగారు. రామకృష్ణ వర్గీయుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదును తీసుకుని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు వద్ద ఫిర్యాదు తీసుకున్నారు. కాగా తమ టెంట్ వద్దకు వచ్చి సీపీఎం నేతలు డబ్బులు పంచుతున్నారంటూ తాము ఇచ్చే ఫిర్యాదు కూడా స్వీకరించాలంటూ ఫ్లోర్‌లీడర్ హరిబాబు తహశీల్దార్‌పై ఒత్తిడి తీసుకురావడం గమనార్హం.
మేయరే స్వయంగా రంగంలోకి దిగి...
టీడీపీ మద్దతుతో పోటీ చేసిన ఏఎస్ రామకృష్ణను గెలిపించేందుకు మేయర్ కోనేరు శ్రీధర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఇందిరాగాంధీ స్డేడియం వైపు ఏర్పాటు చేసిన టెంటులో కూర్చుని స్లిప్పులు పంచుతూ, కార్పొరేషన్ ఉపాధ్యాయులంతా టీడీపీ అభ్యర్థికి ఓటువేయాలంటూ ఒత్తిడి తెచ్చారు.