జాయ్ రైడ్కే పరిమితమైన మోనో రైలు
ప్రయాణికుల ఆదరణకు నోచుకోని నూతన రవాణా సాధనం
* నేటితో ఏడాది పూర్తి
సాక్షి, ముంబై: ఎన్నో ఆశలతో, ఎంతో ఆర్భాటంగా దేశంలోనే మొట్ట మొదటిసారిగా నగరంలో ప్రారంభించిన మోనో రైలు ఎందుకోగాని ముంబైకర్ల ఆదరణ పొందలేకపోయింది. ఈ రైళ్లు ప్రారంభమైన తొలిరోజుల్లో వాటిలో ప్రయాణించేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి కనబరిచారు.
చెంబూర్-వడాల మధ్య మోనో రైలు సేవలు 2014 ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రారంభమయ్యాయి. రెండు మూడు నెలల పాటు మోనో రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఎంతో సందడి చేశారు.
నాలుగు బోగీలతో కూడిన ఈ రైళ్లు అటు, ఇటు పరుగులు తీయడం ముంబైకర్లను ఎంతో ఆకట్టుకుంది. రైళ్లన్నీ కిక్కిరిసి పరుగులు తీశాయి. దీంతో భవిష్యత్తులో కూడా ప్రయాణికుల నుంచి ఇలాంటి ఆదరణే లభిస్తుందని ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) వర్గాలు భావించాయి. కానీ కొద్ది రోజుల్లోనే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మోనోరైళ్లకు ప్రజల ఆదరణ తగ్గిపోయింది. ప్రారంభంలో కనిపించిన ఆ సందడంత కేవలం సరదాగా ప్రయాణించడం (జాయ్ రైడ్) కోసమేనని అధికారులు ఆలస్యంగా తెలుసుకున్నారు.
కొద్ది నెలలుగా ఈ ప్రాజెక్టు నష్టాల్లో నడుస్తున్నట్లు అనధికార వర్గాలు తెలిపాయి. ఒక మోనో రైలులో సరాసరి 568 మంది ప్రయాణించవచ్చు. కాని ప్రస్తుతం ఒక్కో రైలులో ట్రిప్పుకు సగటున 50 మంది ప్రయాణికులు మాత్రమే వాటిలో రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడానికి గల ప్రధాన కారాణాలను తెలుసుకొనేందుకు ఎమ్మెమ్మార్డీయే ప్రయత్నాలు ప్రారంభించింది. అన్ని స్టేషన్లలో గట్టి భద్రత, ఆధునిక టికెట్ కౌంటర్లు, అత్యాధునిక ప్లాట్ఫారాలు, తనఖీ సిబ్బంది. సాంకేతిక సిబ్బంది, దీంతో వీటి నిర్వాహణ భారం భారీగా పెరిగిపోయింది. కొద్ది రోజులుగా ఈ రైళ్లలో కుదుపులు కూడా ఎక్కువయ్యాయి. దీంతో పిల్లర్లు, రోలింగ్ స్టాక్, రెండు స్థంబాలను జోడించే విధానంలో లోపాలను పరిశీలించే పనులను ప్రారంభించారు. నివేదిక వచ్చిన తరువాత కుదుపులకు ప్రధాన కారణాలు వెల్లడవుతాయని ఎమ్మెమ్మార్డీయే అదనపు కమిషనర్ బి.వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.