mono train services
-
ముంబైకర్లకు ‘మోనో’త్సాహం
ముంబై: దేశంలోనే తొలిసారిగా ప్రారంభమైన ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన రవాణా వ్యవస్థ మోనో రైలు సేవల అనుభూతిని ముంబైకర్లు ఆస్వాదిస్తున్నారు. ఈ సేవలకోసం నగరవాసులు ఎంతోకాలంగా ఎదురుచూసిన సంగతి విదితమే. ఎంతో విశ్వసనీయమే అయినప్పటికీ మురికిపట్టిన, అసౌకర్యవంతమైన శివారు రైళ్లు, బెస్ట్ సంస్థకు చెందిన బస్సుల్లో ఇన్నాళ్లూ నానాయాతన పడుతూ రాకపోకలు సాగించిన ముంబైకర ్లకు తాజాగా అందుబాటులోకి వచ్చిన మోనో రైలు ప్రయాణం ఎనలేని ఆనందం కలిగిస్తోంది. ఎన్నో విజయవంతమైన ప్రయోగాత్మక పరుగుల తర్వాత శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ సేవలను ప్రారంభించిన సంగతి విదితమే. ఆదివారం ఉద యం నుంచి మోనో రైలు సేవలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లు ఆకుపచ్చ, నీలం, నలుపు, గులాబీ రంగుల్లో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇవన్నీ పర్యావరణ అనుకూలమైనవి కూడా. ఇక ఈ రైళ్ల లోపలిభాగం, ప్లాట్‌ఫాంలు ప్రయాణికులను కట్టిపడేస్తున్నాయి. 20 అడుగుల వెడల్పు, 5.5 అడుగుల ఎత్తు లో వీటిని నిర్మించారు. కొన్ని ప్రాంతాల్లో ఐదున్నర అడుగులకంటే ఎక్కువఎత్తులో నిర్మించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆయా స్టేషన్ల వద్ద త్వర లో ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గం లో ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలను 20 నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. మోనో రైలు ప్రయాణికులకు గోల్ఫ్‌కోర్సులు, ఆకు పచ్చని మడఅడవులు, పొగమంచు ఆవరించిన పర్వతశ్రేణులు కనువిందు చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఎంఎంఆర్డీయే జాయింట్ డెరైక్టర్ డి కవత్కర్ మాట్లాడుతూ మోనో రైలు మొత్తం ఏడు స్టేషన్లలో ఆగుతుందన్నారు. ఈ మార్గం పొడవు 8.9 కిలోమీటర్లని అన్నారు. -
త్వరలో మోనో, మెట్రో సేవలు ప్రారంభం
సాక్షి, ముంబై: నగరవాసులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న మెట్రో, మోనో రైళ్ల సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే నగరవాసులకు ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టే. మోనో రైలు సేవలను గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిపోయిన పనులను చకచకా పూర్తిచేస్తున్నారు. అంతేకాకుండా మెట్రో, మోనో రైల్వే స్టేషన్ల నుంచి బస్సు సేవల విషయమై బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ పదాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ రెండు మార్గాల ద్వారా రైలు దిగిన ప్రయాణికులకు ఏ రూట్లో, ఏ సమయంలో బస్సులు నడిపితే సౌకర్యవంతంగా ఉంటుందనే అంశంపై ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇందుకు ముంబై మెట్రో-1 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా తనవంతు సహకారం అందిస్తోంది. సాధ్యమైనంత త్వరగా మోనో రైలు సేవలను ప్రారంభించాల ని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కేవలం సేవ లు ప్రారంభిస్తే సరిపోదు కాబట్టి ముందుగా రైలు దిగిన ప్రయాణికులకు అన్ని స్టేషన్లలో ప్రజా రవాణా వ్యవస్థను సిద్ధం చేయా ల్సి ఉంటుంది. లోకల్ రైల్వే స్టేషన్ల మాదిరిగా మెట్రో, మోనో రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగనుంది. ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటపడగానే వారికి బస్సు సేవలు అందుబాటులో ఉంచేందుకు వీలుగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. త్వరలో వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో రైలు, చెంబూర్- వడాల-జాకబ్ సర్కిల్ (సాత్ రాస్తా) మోనో రైలు తొలి విడత సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు మార్గాల రైల్వే స్టేషన్లు అత్యాధునికంగా ఉంటాయి.