వర్షాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లు
డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలే లక్ష్యంగా ముందుకు కదులుతున్న కేంద్రం, ఈ దిశలో తాజాగా బ్యాంకింగ్‌పై దృష్టి సారించింది. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో (జూలై 17 నుంచి ఆగస్టు 11) బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సబ్సిడరీ బ్యాంక్స్) యాక్ట్, 1959, సంబంధిత ఇతర చట్టాల రద్దు ప్రతిపాదనలతో ఈ సమగ్ర బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
దీనితోపాటు నియంత్రణలో ఉండని డిపాజిట్ల స్కీమ్‌లు రద్దు బిల్లు, డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ బిల్లులపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తునట్లు ఒక ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. డిపాజిటర్లను మోసం చేసే ఎవరికైనా 10 సంవత్సరాల వరకూ జరిమానా, భారీ జైలు శిక్షలు పడేలా చట్టాలు రూపొందుతున్నాయి. బ్యాంకింగ్ మొండి బకాయిల సమస్య పరిష్కారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక చర్యలు తీసుకునేలా ఇప్పటికే ఆర్డినెన్స్జారీసహా పలు చర్యలను కేంద్రం తీసుకున్న సంగతి తెలిసిందే.