వడ్డీ రేట్లు మరింత తగ్గించే అవకాశం...
వాషింగటన్ : రాబోయే రోజుల్లో ఆర్బీయై వడ్డీ రేట్లు మరింత తగ్గించనుందని ఆర్బీయై గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్ లో మంచి వానలుకురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలు ఫలిస్తే, ద్రవ్యోల్బణం మరింత దిగి వస్తే వడ్డీ రేట్లు మరింత దిగివచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు సమావేశాలకు హాజరైన రాజన్ స్థానిక మీడియాతో మాట్లాడారు. భారత్ లో ద్రవ్యోల్బణ నియంత్రణ పై దృష్టిపెట్టామని, దాని క్షీణత ముందుకూడా కొనసాగి అన్నీ మంచిగా జరిగితే, భవిష్యత్తులో కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లను తగ్గించేందుకు యోచిస్తోందన్నారు. దేశంలో రాబోయే నైరుతి రుతు పవనాల సానుకూల సంకేతాలపై ఆశాభాభావాన్ని వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు, గత రెండేళ్లుగా ఎదుర్కొంటున్న వర్షాభావ పరిస్థితులు ఆహార ధాన్యాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయన్నారు.
దీంతో పాటుగా అమెరికా ఫెడ్ రిజర్డ్ వడ్డీ రేట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన రాజన్ ఫెడ్ అధిపతి జానెట్ ఎలెన్ పై ప్రశంసలు కురిపించారు. ఇప్పటివరకు అమెరికా ఫెడ్ విధానాలు భారతదేశం, చైనా సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని పడేవేస్తున్నాయన్న విమర్శలు ఉండేవన్నారు. కానీ ప్రస్తుత ఎలెన్ నాయకత్వంలో ఆ పరిస్థితి మారిందన్నారు. ఆయన తీసుకున్న చర్యల మూలంగా ఇటీవల ఫెడ్ రిజర్వ్ విధానాలు కరెన్సీ ఒడుదుడుకులు, ఇతర వస్తువుల ధరలు దిగిరావడానికి దోహదపడ్డాయన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలను దృష్టిలో పెట్టుకొని విధానాలను రూపొందించడం ఆహ్వానించదగిన పరిణామమని కొనియాడారు.
కాగా ఇటీవలి ద్రవ్య పరపతి విధాన సమీక్ష లో రెపోరేటను పావు శాతం తగ్గించి, రివర్స్ రెపో రేటును పావుశాతం పెంచిన ఆర్బీయై నగదు నిల్వల నిష్ఫత్తిని యధాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే.