పెన్షనర్లకు బంపర్ బొనాంజ
న్యూఢిల్లీ : పెన్షనర్లకు బంపర్ బొనాంజ దక్కబోతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద నెలవారీ అందించే చెల్లింపులను ప్రభుత్వం రెట్టింపు చేయబోతోందని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి చెప్పారు. రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో సుమారు 40 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. ఒకవేళ ఇది కనుక అమల్లోకి వస్తే, ప్రభుత్వంపై వార్షికంగా రూ.3000 కోట్ల భారం పడనుంది. ఈపీఎస్ కింద కనీస నెలవారీ పెన్షన్ వెయ్యి రూపాయలు ఇవ్వాలని 2014లో కేబినెట్ నిర్ణయించింది.
ప్రస్తుతం దీని రెండింతలు చేస్తుండటంతో, ఇక నుంచి కనీసం రెండు వేల రూపాయలను పెన్షనర్లు అందుకోబోతున్నారు. ఈపీఎస్ పెన్షన్ రెండింతలు చేస్తున్న నేపథ్యంలో దీని ఖర్చును, లబ్దిదారుల సంఖ్యను లెక్కించాలని ఈపీఎఫ్ఓను కార్మిక మంత్రిత్వశాఖ ఆదేశించినట్టు సీనియర్ అధికారి చెప్పారు. ఈపీఎఫ్ఓ త్వరలోనే ఈ పెన్షన్ను రెండింతలు చేస్తూ తుది నిర్ణయం ప్రకటించనుందని తెలిపారు. ఈపీఎస్-95 కింద 60 లక్షల మంది పెన్షనర్లున్నారు. వారిలో నెలవారీ రూ.1500 కంటే తక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారు 40 లక్షల కంటే తక్కువే. వీరిలో కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ తీసుకునేది 18 లక్షలు మంది.
కనీస నెలవారీ చెల్లింపులను రూ.3000-రూ.7500కు పెంచాలని ఎంతో కాలంగా ట్రేడ్ యూనియన్లు, ఆల్ ఇండియా ఈపీఎస్-95 పెన్షనర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. పార్లమెంటరీ ప్యానల్ కూడా ఈపీఎస్-95 అసెసీలకు అందించే నెలవారీ కనీస పెన్షన్ రూ.1000ను పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిత్యావసరాలు తీర్చేలా సామాజిక భద్రత ప్రయోజనాలుండాలని తెలిపింది. ఈపీఎఫ్ స్కీమ్ కింద సభ్యులైన ఎంప్లాయీస్ ఆటోమేటిక్గా ఈపీఎస్ స్కీమ్ కింద ఎన్రోల్ అవుతారు.